Asianet News TeluguAsianet News Telugu

వంకాయకు ఆపేరెవరు పెట్టారబ్బా...

who named this smoth soft and pulpy brinjal as vankay in Telugu

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే

అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.

వంకరగా ఉన్న కాయని వంకర కాయ లేదా వంకాయ అనొచ్చు. కాని మెట్ట వంకాయలు గుండ్రంగానో, గుడ్డు ఆకారంలోనో ఉంటాయి, నీటివంకాయలైతే కోలగా ఉంటాయి; కాని వంకర టింకరగా ఉన్న వంకాయలు నాకు తారస పడలేదు.

వంగపండు, వంగనార వంటి మాటలనిబట్టి వంకాయ అంటే వంగ కాయ అయి ఉండొచ్చు. అంటే, వంగ దేశపు కాయ కాబోలు. బంగాళా దుంపలకీ, బెంగాలుకీ మధ్య బాదరాయణ సంబంధమే కాని, వంకాయకీ, వంగదేశానికీ దగ్గర సంబంధమే ఉందనవచ్చు.

వంకాయని బెంగాలీలో "బేగున్" అంటారుట. దీన్ని "బే గుణ్" అని విడగొడితే "గుణం లేనిది" అనే అర్ధం వస్తుంది. ఇక్కడ “గుణం” అంటే “నీతి, నియమం, శీలం, సత్‌ప్రవర్తన” వంటి అర్ధాలు కాకుండా ఒక ప్రత్యేకమైన లక్షణం అని అర్ధం చెప్పుకోవచ్చు. కందకి దురద వేసే గుణం ఉంది. కాకరకాయకి చేదు అనే గుణం ఉంది. కనరు పట్టిన వంకాయలు చేదుగా ఉంటాయి కాని ఆ చేదు వంకాయ గుణం కాదు. తనకి స్వగుణం లేదు కనుక మనం ఎలా ఒంచితే అలా ఒంగుతుంది, ఎలా వండితే అలా మొగ్గుతుంది. అందుకే వంకాయ-మెంతికారం, వంకాయ-కొత్తిమిరకారం, వంకాయ-ఉల్లికారం, వంకాయ వేపుడు, వంకాయ బజ్జీలు పచ్చడి (వంకాయని కాల్చి చేసే పచ్చడి), హైదరాబాదీ వంకాయ కూర, ఇలా ఎన్నెన్ని విధాలుగానో వంకాయని వాడుకోవచ్చు.

ఈ "బేగున్" హిందీలో బైన్‌గన్ అయింది.

హిందీ కంటె పాతది సంస్కృతం కదా. సంస్కృతంలో వంకాయని "వతింగన" అంటారు. ఇది పారశీక భాషలో "బదింగన్" అయింది. పారశీకం నుండి అరబ్బీలోకి వెళ్ళి అక్కడ "ఆల్ బదైన్‌జన్" అయింది. అరబ్బీలో "ఆల్" అనే ప్రత్యయం మన తెలుగులో డు, ము, వు, లు లాంటిది; తరచు కనిపిస్తూ ఉంటుంది. అరబ్బీ నుండి కేటలీనా వెళ్ళి అక్కడ "ఆల్బర్జీనా" అయింది. అక్కడనుండి ఫ్రెంచి భాషలోకి వెళ్ళి "ఔబర్‌జీన్| అయింది. ఈ ఫ్రెంచి మాట ఆఫ్రికాలో ఉన్న ఐబీరియా వెళ్ళి అక్కడ "బెరింజెలా" అయింది. ఆఫ్రికా నుండి బ్రిటిష్ వాళ్ళు ఈ మాటని "బ్రింజాల్" చేసి ఇండియా తీసుకొచ్చేరు. కాని ఇంగ్లండులో మాత్రం ఫ్రెంచి మాటయిన ఔబర్‌జీన్ నే వాడతారు.

మన తెలుగు వాడికి వంకాయని వంకాయ అనటానికి సిగ్గు; బ్రింజాల్ అనే అంటానంటాడు. "అమెరికాలో ఉన్న మీ "అగ్రవర్ణాలు" ఇంగ్లీషు నేర్చేసుకుని మంచి మంచి జాబ్స్ ని కొట్టేసి మనీ చేసేసుకుంటున్నారు, ఇండియాలో ఉన్న మాకు తెలుగు నేర్పేసి మమ్మల్ని "దళితులు"గా నొక్కెద్దామని చూస్తున్నారు. కనుక మేం ఛస్తే తెలుగు నేర్చుకోం. ఇంగ్లీషులోనే "బ్రింజాల్" అంటాం" అంటూ శంకరాభరణం లాల్చీ మేష్టారు లాంటి వ్యక్తి ఒకరు నన్ను తూలనాడేడు.

కాని ఈ అమెరికావాడు ఉన్నాడే వీడు నా పాలిట ఒక తంటసుడు; అంటే తంటసం తెచ్చిపెట్టినవాడు. ఇంగ్లీషు మరిగిన తెలుగువాడికి తంటసం అంటే ఏమిటో తెలియక పోవచ్చు. తంటసం అంటే ముల్లు. ఈ ముల్లు ఒక ప్రత్యేకమైన శరీరభాగంలో గుచ్చుకుంటే కూర్చోలేం, నిలబడలేం. తెలుగు మీద అభిమానం కొద్దీ నేను తెలుగు మాటలే ఎక్కువ వాడటానికి ప్రయత్నిస్తూ పృష్టభాగపు పేరుని తెలుగులో రాయబోతూ ఉంటే మరీ "అన్ విక్టోరియన్" గా ఉంటుందని ఉపద్రష్ట రామకృష్ణ అనే కుర్రాడు పెద్దవాడిని అయిన నన్ను మెత్తగా మందలించేడు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ అమెరికావాడు, ఈ తంటసుడు, వంకాయ పేరులోని పూర్వ చరిత్రని పూర్తిగా విస్మరించి ఒక కొత్త పేరు పెట్టేడు. అమెరికాలో వంకాయని "ఎగ్ ప్లేంట్" అంటారు. దీన్ని తెలుగులో "గుడ్డు చెట్టు" అనో "గుడ్డు మొక్క" అనో గాడిద గుడ్డు అనో అనుకోవచ్చు. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో "ఎగ్ ప్లేంట్" అంటే ఈ అమెరికా వాళ్ళు గుడ్లని చెట్లమీద కాయింపిస్తారు కాబోలని అనుకునే వాడిని. వీళ్ళంటే నాకంత గురి. నిఝం! "హాట్ డాగ్" అంటే కుక్కల్ని కాల్చుకు తింటారు కాబోలు అనుకునే వాడిని. సరస్పతి తోడు!


అమెరికావాడు వంకాయని చూసి గుడ్డు అనుకున్నాడుట. కొన్ని జాతుల వంకాయలు తెల్లగా, గుడ్డు ఆకారంలో ఉంటాయి. అందుకని అమెరికావాడు అలా భ్రమపడి ఉంటాడు. 

అరవ్వాడు తెలివయిన వాడు. పిలక్కి తాడు కట్టుకుని మరీ చదివేవాడు - పూర్వం బుడ్డి కిరసనాయిలు దీపాలు ఉన్న రోజులలో. ఎలెట్రీ దీపాలు వచ్చేక పిలక్కి తాడు కట్టుకోవలసిన అవసరం పోయింది. పిలకలు కూడా పోయాయి లెండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అరవ్వాడు వంకాయని "కత్తరికాయ" అంటాడు. "ఈ మాట ఎక్కడ నుండి ఎక్కడనుండి వచ్చిందిరా?" అని అడిగితే వాడు "సిలప్పాధికారం, మణిమేఖలై" అంటూ తమిళం ప్రాచీనతని మనకి మరోసారి గర్వంగా జ్ఞాపకం చేస్తాడు. మనం త్రుళ్ళిపడి, లేచి, ఢిల్లీ పరిగెత్తుకు వెళ్ళి, తెలుగుకి కూడా క్లాసికల్ లాంగ్వేజి స్టేటస్ తీసుకొస్తాం. కాని తెలుగులో మాట్లాడం. 

ఆమ. దట్సిట్!

 

(వంకాయ కూరంత రుచిగా ఉన్న ఈ పోస్టు వంకాయల కోసం వెదుకుతూంటే నిగనిగలాడుతూ బ్లాగ్ స్పాట్ లో  కనిపించింది.దీనినిఅచ్చేసిన రావు వేమూరి ఇక్కడ సంచరిస్తూ ఉంటారు)