Asianet News TeluguAsianet News Telugu

' ఎట్లన్న జేసి పాస్జేయించాలే...'

separate Telangana state poem

 

 

 

 ఎ ట్ల న్న    జే సి   పా స్జే యిం చా లే...
 

 

 

సీ.సీ. కెమెరాల మూతుల్ తిప్పి
ముడ్డెనుక నుండి చిట్టీలు ఎట్లివ్వాలో ఇన్విజిలేటర్లకు ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్లు ఇప్పించలేదా?

ఏం పీకుతాండ్లువయా డీయీవోలు...?!
ఎనభై నాలుగు శాతం రిజల్టుతో
ఏం ముఖం పెట్టుకొని వచ్చారయా..?!

కేజీ టు పీజీ కార్పోరేట్ స్థాయి ప్రమాణాలంటే
ఏమనుకున్నారు?
హెడ్మాస్టర్లను వంగబెట్టైనా
సెంట్ పర్సెంట్ రిజల్టు తీసుకొచ్చుడు...

తెలంగాణ వొచ్చింది కదా
ఏదో ఊడ బెరుక్కుద్దనుకునేరు...
ఉన్న పోస్టులను ఊడబెరుకుతం......
ఐదు వేల బడులను మూసేస్తున్నాం...
హేతుబద్ధీకరణ పేరు మీద 
ఆరు వేల పంతుల్ల ముడ్డి మీద తన్ని తరిమేస్తున్నాం...

మన రాష్ట్రం... మన ప్రజలు...మన వనరులు... మన ఉద్యోగాలు అనుకుంటూ ఊరికే ఊహల్లో తేలియాడ కండి...
'ఉద్యమ పార్టీ గద్దెనెక్కింది గదా' 
ఉద్యోగాలు కల్పిస్తుందని దింపుడు కళ్లం ఆశలు పెట్టుకోకండి....
"ఇవ్వం గాక ఇవ్వం" 
అసెంబ్లీ దద్దరిల్లేలా 'ఉద్యమ పార్టి ప్రభుత్వాధి నేత'  ఉరిమింది 
చెవుల్లో గింగురుమనడం లేదా?

నిరుద్యోగులారా ఖబర్దార్!
ఉద్యోగాలని ఉద్యమాలు చేసేరు!
మావోయిస్టు ముద్ర వేసి
ఎన్ కౌంటర్ల కౌంట్  పెంచేసుకొని
మోడి సర్కార్ దగ్గర శెహబాసని పించుకుంటాం...

'వలసాంధ్ర సర్కారోడికి 
వీడికి తేడాయే లేదా'


సందేహపడనక్కర లేదు!
తేడా లేదు...

అంతెందుకు...
నన్ను చూడండి...

వాడి దగ్గర.. వీడి దగ్గర
విద్యా మంత్రిని నేనే కదా...

వాడి మూతి నాకి నట్లె
వీడి మూతి నాకితి...

ఉపముఖ్యమంత్రి కావడానికి కాసింత
ఎక్కువే తిప్పలపడాల్సి వచ్చిందనుకోండి!
కిందా మీదా నాకాల్సి వచ్చె....

వాడున్నప్పుడన్నా...
ఇక్కడ ఉద్యమమున్నదనే బెదురుండేది..
వీడే ఉద్యమకారుడన్న బలుపుతోటి బలాదూరయ్యిండని తెలుస్త లేదా?

ఇంకెక్కడి నవ నిర్మాణం...
ఇంకెక్కడి బంగారు తెలంగాణ..

వాడెవడో కవి సన్నాసి
'నవ నిర్మాణం' మీద కవిత్వం తెస్తడట!


అహ్హ్! అహ్హ్! అహ్హహ!!
మా బట్టెబాజితనం తెల్వని
ముడ్డి చుట్టు తిరిగే ఫౌడేషన్లు!
సాహిత్య సంఘాలు!!
ఎడ్డి జనాలకన్నా అధ్వాన్నం...

వ్యవసాయం ఎండబెట్టి
మా ఫాం హౌజుల కోసం
మల్లన్న సాగర్ కట్టుకుంటున్నది, తెల్వదా?!
మిర్చి రైతులు వాళ్ల పంట వాళ్లే 
తగుల బెట్టుకునేలా చేస్తున్నాం...
వేలాది రైతుల్ని ఆత్మహత్యల పాల్జేసాం...
వాడు వ్యవసాయం దండుగ అంటే...
మేం దాన్ని సహేతుకంగా రైతుల్ని
పొట్టన పెట్టుకుంటూ నిరూపించేశాం!
దళితుల్ని వాడు అక్కడ చంపి ఇక్కడ
వివక్షగా చూస్తే...
ఇక్కడ మేం సమూలంగా తుదముట్టిస్తున్నాం!
ఇంకేం చెయ్యాలా?

అన్నట్టు!
నేనూ దళితున్నే కదూ!
నేను దళితున్నంటే 
మా ఆవిడొప్పికోదు కాని...
తెలంగాణ సమాజమేమో
దళిత దొర అంటదాయే...

మా దొర సరిగానె గుర్తించిండు..
ఎంతైనా, మేం దొరలం అంతా ఒకటే, కదా!

వర్గ దృష్టిలో... దొరనన్నది నిజమేకాని...
గొర్రెదాటు జనాలకేమెరుక... నా బలుపు రహస్యం!

అటు దళితున్నని బ్లాక్ మెయిల్ చేస్తా...
ఇటు దొరతనమూ చేస్తా...
డబుల్ ధమాకా!

దొరల గడీలు కూల్చిన చరిత్ర తెలుసుగాని...
దొరలతోని ఉన్నప్పుడు
'సోబత్ కా అసర్ పడదా?
మంది ఇజ్జత్ తియ్యాలె...
మంది ప్రాణాలు తీయాలె...
ఇజ్జత్, మానం లేకుంట బతుకాలె...

ఇంతకీ,పంతుళ్లూ!
'విద్యా మనొ వైజ్ఞానిక పద్ధతులు' అనుకుంటు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వల్లించకండి!

మా దగుల్బాజి చరిత్రంతా, పాఠం లా ఎందుకు చెప్పాననుకుంటున్నారు?
(ఎంతైనా, నేను లెక్చరర్ ను కదా!)
నానా గడ్డి కరిచైనా,
సెంట్ పర్సెంట్ రెజల్ట్ తీసుకు రావాలె!

'డీయీవోలకు ఇప్పుడే 
ఇన్స్ట్రక్షన్స్' ఇస్తున్నాను....
అందర్నీ అడ్డదిడ్డంగా వాడుకొమ్మని'...

 

 

-బాసిత్