Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం నిండిందని రాయలసీమను విస్మరించవద్దు

Rayalaseema should be given priority while releasing water from Srisailam reservoir

నైరుతి రుతు పవనాల వల్ల జూన్ నుండి సెప్టంబరు వరకు కురిసే వర్షాల ద్వారానే ఉభయ తెలుగు రాష్ట్రాలకు 65% నీటి లభ్యత ఉంటుంది. ఈ ఏడాది నైరుతీ రుతు పవనాల ముగింపు దశలో మంచి వర్షాలు పడ్డాయి. గోదావరి నదీ జలాలు పుష్కలంగా లభించడంతో గోదావరి డెల్టా ఆయకట్టులోను, కృష్ణా జలాలపై ఆధారపడిన క్రిష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేయడం, వాటికి తోడు నాగార్జున‌సాగర్ క్రింది భాగంలో లభించిన వర్షపు నీటితో ఖరీప్ పంటను సాగుచేసుకొన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లోను, అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల క్రింది ఆయకట్టుకు ఖరీప్ పంట సాగుకు నీరు లభించలేదు. రబీ పంటనైనా పండించు కోకపోతే ఆర్థికంగా నిలదొక్కుకోలేరు. శ్రీశైలం మరియు నాగార్జున‌సాగర్ జలాశయాల్లోని నీటి వినియోగంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నది.  ఆలస్యంగానైనా రెండు రాష్ట్రాలలో వర్షాలు కురిసినందుకు ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కానీ, కృష్ణా మరియు పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లో ఒక్క‌ శ్రీశైలం జలాశయం మినహాయించి మిగిలిన జలాశయాల్లోని నీటి నిల్వల పరిస్థితి నేటికీ అంత ఆశాజనకంగా లేదు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న‌ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాలు నిండి పొంగి పొర్లిన తరువాతనే క్రిందికి నీరు వదిలి పెట్టబడింది. నేడు జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312కు గాను 256 టియంసిలు మాత్రమే చేరాయి. నదీ ప్రవాహం తగ్గు ముఖం పట్టింది. పులిచింతలలో 46కు గాను 16 టియంసిలే ఉన్నాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 17కు గాను 16 టియంసిల నిల్వ చేయబడింది. కానీ 18 టియంసిల సామర్థ్యమున్న‌ బ్రహ్మంగారిమఠం జలాశయంలో నీరు లేదు. సోమశిలలో 78కి గాను 58 టియంసిల వరకే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్నాటక మరియు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతగా చెన్నయ్ నగరానికి 15 టియంసిలను కండలేరు నుంచే సరఫరా చేయాల్సి ఉన్నది. కానీ, 68 టియంసిల సామర్థ్యమున్న కండలేరు జలాశయంలో కేవలం 5 టియంసిల నీరే ఉన్నది. శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడ్డ‌ ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగమైన గోరకల్లు మరియు ఔక్ జలాశయాలు, గండికోట జలాశయంలో నీటి చేరిక అత్యల్పంగా ఉన్నది. 

ఈ నేపథ్యాన్ని గమనంలో ఉంచుకొని, వచ్చే ఏడాది జూన్ - జూలై నాటి వరకు త్రాగు నీటి అవసరాలను కూడా పరిగణలో పెట్టుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవలసిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపైన ఉన్నది. కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయాలకు లోబడి, వివాదరహితంగా నీటిని సమర్థవంతంగా వాడుకోవాలి. 

తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టియంసిలకు గాను ప్రస్తుతం 90 టియంసి లున్నాయి. తుంగభద్ర జలాశయం నీటి వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా న్యాయమైన వాటా సాధనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సగటు వర్ష పాతం 852 మి.మీ. తూర్పు గోదావరి జిల్లా సగటు వర్షపాతం దాదాపు 1100 మి.మీ.గా ఉంటే అనంతపురం జిల్లా 550 మి.మీ. మాత్రమే. రాయలసీమ ప్రాంత సగటు వర్ష పాతం 645 మి.మీ. నైరుతీ రుతు పవనాల వల్ల లభించాల్సిన సగటు వర్షపాతం కంటే కాస్తా అధికంగా వర్షపాతం నమోదైనా రాయలసీమ ప్రాంతం సగటు వర్షపా‍తం తక్కువన్న వాస్తవాన్నిపరిగణలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నీటి వాడకంలో ఆ ప్రాంత నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

(* టి లక్ష్మి నారాయణ తెలుగు నాట పేరున్న రాజకీయ విశ్లేషకుడు)