Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, జైట్లీ ఇద్దరూ రాష్ట్రాన్ని మోసగించారు

Chandrababu and Arun Jaitley both jointly hurt the interests of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా నియంతృత్వ మోడీ సర్కారు నాటకాలాడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి ఐదుకోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ హోదా  ఇవ్వం పొమ్మన్నారు.. తాజాగా విశాఖ రైల్వే జోన్‌ కూడా ఇచ్చేది లేదని రైల్వే అధికారులు కుండబద్దలు కొట్టారు. రైల్వేజోన్‌ వల్ల ఏమొస్తుంది.. జనరల్‌ మేనేజర్‌ పోస్టు మినహా.. అంటూ హేళన చేస్తున్నారు.. విజయవాడ, విశాఖ మెట్రోకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కవలసిన వాటిల్లో ఇవన్నీ కీలకమైనవి. మరోపక్క జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్రప్రభుత్వం ఏదో ఒక కొర్రీ పెడుతూనే వున్నది. చివరకు రాష్ట్రానికి చెందిన కూలీలకు ఉపాధి హామీ బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆం.ప్ర. ప్రభుత్వం మొత్తుకుంటున్నది. 


నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని కాంగ్రెస్‌ పార్టీని దునుమాడిన నరేంద్ర మోడీ, తిరుమల వెంకన్న సాక్షిగా ఆం.ప్ర.కు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా  ఇస్తామన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నగరాన్ని కట్టిస్తామన్నారు. మరి ప్రధానమంత్రి అయ్యాక ఆ ఊసే మర్చిపోయారు. రెండేళ్ల నాడు రాజధాని నగర నిర్మాణ శంకుస్థాపన చేసి ఒక ముంతలో మట్టి, ఒక ముంతలో జలం అందజేశారు. ఆ సమయంలో కూడా విభజన చట్టాన్ని, యూపీఏ ప్రధానమంత్రి డా|| మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తామని ఎటువంటి లోటు రానీయబోమని ప్రకటించారు. ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. పైపెచ్చు ఆం.ప్ర.ను ఏవిధంగా ఇబ్బంది పెట్టాలా అని ఎత్తులు వేస్తున్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విధంగా చేస్తున్నారనడంలో సందేహమే లేదు. ఆం.ప్ర.కు ఎంత చేసినా మాకేమిటి ప్రయోజనం అన్నరీతిలో బీజేపీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. 

Chandrababu and Arun Jaitley both jointly hurt the interests of Andhra Pradesh


ఇక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బీజేపీపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకత తమపై పడకూడదని జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే విధిలేని పరిస్థితుల్లో మోడీ సర్కారు నుంచి ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. ఎన్‌డీఏ నుండి కూడా బయటకు వచ్చేశారు.  అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఈ మూడు పార్టీలు స్వార్థ రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాలరాస్తున్నాయడంలో సందేహం లేదు. నాడు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఒక క్లిష్టమైన సమస్యను పరిష్క రించేందుకు రాజకీయంగా నష్టపోతామని తెలిసినప్పటికీ అన్ని పార్టీల సమ్మతితోనే ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం జరిగింది. అధిక ఆదాయం అందించే రాజధాని నగరం హైదరాబాద్‌ను కోల్పోయి 13 జిల్లాలతో మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి దోహదపడేలా చట్టం తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఏపీకి శాపంగా పరిణమించింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సాయం నామమాత్రమే. చట్టప్రకారం రాష్ట్రానికి చెందవలసినవి దక్కనీయకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. 

Chandrababu and Arun Jaitley both jointly hurt the interests of Andhra Pradesh


ఐదుకోట్లమంది ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ , వామపక్ష ప్రజాతంత్ర శక్తులు పోరాడుతున్న పర్యవసానంగా తెలుగుదేశం పార్టీ కూడా మోడీ సర్కారుపై నిరసన గళం వినిపించక తప్పని పరిస్థితి ఎదురైంది. పర్యవసానంగా నిన్న మొన్నటి వరకు పరస్పరం పొగడ్తలు కురిపించుకుంటూ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ అంటకాగిన అధికార తెలుగుదేశం, భాజపాలు ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడంలో, నిందలు వేసుకోవడంలో బిజీగా వున్నాయి. ప్రత్యేక ¬దా కన్నా ప్రత్యేక ప్యాకేజీ అద్భుతం అంటూ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాభీష్టాన్ని అర్థం చేసుకొని యూటర్న్‌ తీసుకున్నారు. విభజన వేళ ఢిల్లీలో ఎనిమిదిరోజుల పాటు నిరవధిక నిరాహారదీక్ష చేశానని, జాతీయస్థాయిలో తనను మించిన సీనియర్‌ రాజకీయవేత్త మరొకరు లేరని, జాతీయ పార్టీలతో తనకున్న సంబంధాలపై నిత్యం వల్లె వేసే చంద్రబాబునాయుడు గారు చట్టాలను ధిక్క రించి మరీ రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం అమరావతికి ఎందుకు పరిమితమయ్యారు?

రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్ట వద్దు.. ఢిల్లీ వెళ్లి పోరాడమంటూ ప్రతిపక్షాలకు సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్లరు? ఇటీవల అఖిల పక్షాల సమావేశం నిర్వహిస్తానని చెప్పిన బాబు గారు ఆ మాటే మర్చిపోయారు.

చిత్తశుద్ధి వుంటే పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు చేరిన తరుణంలో హోదా కోసం పోరాడుతున్న అన్ని రాజకీయపక్షాలు, ఇతర సంఘాలను కలుపుకొని ఢిల్లీలో ఆం.ప్ర. హక్కుల కోసం పెద్ద ఎత్తున ఎందుకు ఉద్యమించాల్సిన అవసరం ఆయనకు లేదా? నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేసి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ఢిల్లీ గడప తొక్కడం లేదు? అమరావతిలో సభలు పెడితే ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం పాదయాత్రకే పరిమితమయ్యారు. కీలక సమయంలో అందరం కలిసికట్టుగా పోరాడితేనే కదా మోడీ సర్కారు మెడలు వంచ కలిగేది. రాష్ట్రం కోసం జెండాలను పక్కనబెట్టి పోరు సలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నది. 
కాంగ్రెస్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటున్న ఇతర సంఘాలు మాత్రమే చిత్తశుద్ధితో గత నాలుగేళ్లుగా ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలుకోసం అలుపెరగకుండా పోరాడుతూనే వున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన మూడురోజులు ఆత్మగౌరవ దీక్ష, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది.ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ సైతం ఆం.ప్ర.కు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించారు. ప్రధానమంత్రిగా తాను మొట్టమొదట ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా  కల్పించే ఫైలుపై సంతకం చేస్తానని, విభజన చట్టాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తామని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆత్మగౌరవ దీక్ష శిబిరం వద్ద హామీ ఇచ్చారు. అంతేకాదు ఆం.ప్ర.కు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ పార్లమెంటులో సైతం కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్నది. ఈ నెల 16, 17, 18 తేదీలలో జరిగే ఏఐసీసీ ప్లీనరీలో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు అంశాలను చేర్చడం జరిగింది. 

Chandrababu and Arun Jaitley both jointly hurt the interests of Andhra Pradesh


అదే అసెంబ్లీలో ఇప్పుడు అరుణ్‌ జైట్లీని విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా  డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సైతం మేము బీజేపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించడం కూడా మంచి పరిణామంగానే భావించవచ్చు. అయితే టీడీపీ మంత్రులను ఉపసంహరించిన మాత్రాన కేంద్రం దిగిరాదు. వైకాపా అవిశ్వాసం పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు. బాధ్యతతో వ్యవహరించాల్సిన ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. ఇదే అదనుగా ఆంధ్రదేశంలో ఏమాత్రం పట్టులేని బీజేపీ లబ్ధి పొందాలని రాజకీయ క్రీడకు తెరలేపింది. తనకు నచ్చినవారిని జైలు నుంచి విడుదల చేయిస్తూ.. నచ్చనివారిని జైళ్లకు పంపుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆం.ప్ర.లో కూడా బీహార్‌ ఫార్ములాను చొప్పించాలని చూస్తున్నట్లుంది. ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టాలని కూడా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకులంతా సమావేశమై రాయలసీమ డిక్లరేషన్‌ చేయడం ఒక ఉదాహరణ. అలాగే జాతీయ మీడియాలో ఆంధ్రులవి గొంతెమ్మ కోర్కెలన్నట్లుగా అవాస్తవాలు రాయిస్తున్నారు. ఇక రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే అందుకు విరుద్ధంగా ఆం.ప్ర. బీజేపీ నాయకులు తమ వైఖరిని సమర్థించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా నిధులను కూడా మోడీ ఏదో కనికరించి ఇచ్చినట్లు.. మేమిచ్చాం.. అని వాదిస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. ఏవిధంగా చూసినా బీజేపీ, టీడీపీ, వైకాపాలు రాష్ట్ర ప్రయోజనాల సంగతి పక్కనబెట్టి ఎన్నికలే లక్ష్యంగా ఆటలాడుతున్నాయనేది స్పష్టమవుతున్నది. 


నల్లధనం వెలికితీత, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలం చెందింది. పైగా పెద్దనోట్ల రద్దు , అడ్డగోలుగా జిఎస్‌టి అమలు వల్ల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు.. ఇటీవల వేలాది కోట్లరూపాయల బ్యాంకుల కుంభకోణాలు వెలుగులోకి రావడం, జాతీయ బ్యాంకులపై కూడా విశ్వాసం సన్నగిల్లడం.. పెట్టుబడికి రుణం లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశ వ్యాప్తంగా రైతాంగం ఉద్యమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నరేంద్రమోడీ సర్కారు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మళ్లీ సోనియాగాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడం, యువనేత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యంగా కనిపిస్తున్నది. 


ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నంతవరకూ ఆం.ప్ర.కు ఎటువంటి మేలు జరగదని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఏదో ఉద్ధరిస్తారని ఓట్లేసి గెలిపించిన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా వేస్తున్న వేషాలు, అవలంబిస్తున్న విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఉలుకు పలుకు లేకుండా వుండి ఎన్నికల దగ్గరకొస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా  నినాదాన్ని అందిపుచ్చుకుని రాత్రికే రాత్రే చాంపియన్లమైపోదామని భావిస్తున్నవారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ, దానితో అంటకాగే వారికి రాష్ట్రంలో అడ్రసులు గల్లంతు కావడం ఖాయం. 
నాలుగేళ్ల క్రితం ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్‌ పార్టీ పట్ల దేశవ్యాప్తంగానే కాక ఆం.ప్ర.లో సైతం సానుభూతి పవనాలు వీస్తున్నాయి. నాడు క్లిష్టమైన పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ విభజించినప్పటికీ పకడ్బందీగా విభజన చట్టం ఏర్పాటు చేయడం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు సర్వతోముఖాభివృద్ధికి ఇబ్బంది లేకుండా చేసిందని, దానిని అమలు చేయకుండా బీజేపీ నాటకాలాడుతోందని ప్రజలు భావిస్తున్నందున రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గణనీయ సంఖ్యలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకోవడం ద్వారా ఆం.ప్ర. భవితకు బాటలు వేయడం తథ్యం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టం అమలుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి వున్నది. ఇందుకనుగుణంగానే ఏఐసీసీ ప్లీనరీ డిక్లరేషన్‌లో సదరు అంశాలను చేర్చనున్నారు. 


- కొలనుకొండ శివాజీ, 
అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసిసి) సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి 
ఫోన్‌ : 9866200463 
www.shivaji.kolanukonda@gmail.com