Asianet News TeluguAsianet News Telugu

దోసెలేసే వోడు వొంటిచేత్తో అలవోకగా స్టీరింగ్ తిప్పేయగలడా?

Andhra kitchen humour

 వంటచేయటం వేరు, వంటల అల్కెమీ తెలియడం వేరు. అందుకే కొందరి వంటలే బాగుంటాయి. వాళ్లే వంటల అల్కెమిస్టులు. అలాంటి వాళ్లలో ఈ  రాజ్ కుమార్ ఒకరు. ఆయన చెప్పే రసవాద రహస్యాలివి:

 

1. వంటల్లో చాలా రకాలున్నాయని అపోహలతో భ్రమపడీ భయపడుతుంటారు మన యువత.  ఉన్నవి మూడే. 1. ఇగురు 2. పులుసు 3. వేపుడు.
పోపులు నూనెలో మాడబెట్టి, అందులో ఉల్లిపాయలు వేయించి, కూరగాయ ముక్కలు పడేసి ఉప్పు, కారం జల్లేసి, కొంచెం నీరుపోసి కలిపేసి మూత పెడితే అది "ఇగురు". నీళ్ళెయ్యకుండా, మూత పెట్టకుండా మరికొంచేమ్ నూనేసి వేయిస్తే అది "వేపుడు". చింతపండు పులుసేస్తే  అది.."పులుసు". 

2. నాన్వెజ్జీ ల కోసం ప్రాణాలు అర్పించే బ్రాయ్లర్ కోళ్ళు లోకం లో కోకొల్లలుగా ఉండటం మన అదృష్టం. "బాగుంటాదో లేదో, ఉడుకుతాదో లేదో" అన్న టెన్షన్ అక్కర్లేదు. ఉప్పు-కారం వేసి ఉడకేస్తే అదే బాగుంటుంది.

3. ఉప్మా చేసేటప్పుడు ఉప్పెయ్యటం మరిచిపోవటం అనేది నమ్మిన మనిషి దగ్గర నమ్మకం పోగొట్టుకోవటం లాంటిది. అది ఒకసారి జరిగిపోతే మన చేతుల్లో ఏం ఉండదు. కాబట్టీ తస్మాత్ జాగ్రత్త.

4. దోసలు వెయ్యటం ప్రాక్టీస్ చేసినోడికి  స్టీరింగ్ తిప్పడం బాగా వస్తుంది. పవర్ స్టీరింగ్ కాకపోయినా ఒంటి చేత్తో డ్రైవింగ్ చేసీగల్రు.

Andhra kitchen humour


5. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతాదంటారు. కానీ నీళ్ళెక్కువైనప్పుడు అరిటికాయ కూరా,చింతపండు ఎక్కువయినప్పుడు చారు, ఉల్లిపాయలెక్కువైనప్పుడు ఎగ్ బుర్జీ ల పరిమాణం పెరుగును. (FYI... గత్యంతరం లేని అత్యవసర పరిస్థితుల్లో వాడుకోండీ).

6. మొదట్లో ఉప్పు, కారం, పులుపు మొదలైనవి ఎక్కువ తక్కువలవుతాయి. అది సహజం. అందుకే ముందు జాగ్రత్త గా ఎంతోకొంత వెయ్యాలి. సరిపోలేదంటే మరికొంత వేసుకోవచ్చు. మన లక్ కిక్కిచ్చి ఎక్కువైపోతే మరికొన్ని నీళ్ళు పోసి మరిగించడమే.

7. వండేవాడికే అందరికంటే ముందు వంటకం టేస్ట్ తెలుస్తుంది. మన కర్మ కాలి ఎప్పుడైనా పదార్ధం తేడా కొట్టేసినట్టు తెలిస్తే, మినిమం గంట సేపు కూర పొయ్యి మీదుంచి కాలయాపన చేసెయ్యాలి. ఈ లోపు తినేవాళ్లకి  బాగా ఆకలి వేస్తుంది. మంచినీటి రుచి దాహమేసినప్పుడూ, మాడిన కూర రుచి ఆకలేసినప్పుడూ తెలుస్తుంది కాబట్టీ మనం సేఫ్ జోన్ లోకి పోతాం.

8. తినేవాడికి వండేవాడెప్పుడూ లోకువే. వాళ్ళిచ్చే నెగటివ్ కమెంట్స్ కట్ చేసేటప్పుడు ఉల్లిపాయల్లా కన్నీళ్ళు పెట్టిస్తూ మనల్ని మానసికం గా కృగదీస్తాయి. మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొడతాయి. మన పాక ప్రయోగం బెడిసికొట్టినప్పుడు అలాంటివి జరగకుండా రివర్స్ ఎమోషనల్ డ్రామాతో సన్నివేశాన్ని రక్తి కట్టించాలి. పాజిటివ్ కమెంట్స్ మాత్రమే ఏక్సెప్ట్ చేస్తామన్న విషయాన్ని మనం క్లియర్ గా తెలియజేయాలి.

9. మసాలాలు నూరెయ్యాలీ, అల్లం-వెల్లుల్లి దంచెయ్యాలీ, ఎండు మిరపకాయలు చిదిమెయ్యాలీ, చింతపండు పులుసు పిసికెయ్యాలీ... లాంటి రూల్స్ పక్కన పెట్టండి. పాలు కొని మరిగించాలి..  తోడుచుక్క కోసం పక్కింటికెళ్ళాలీ లాంటి పాతకాలపు పనులకి దూరంగా ఉండండి. మనకి రెడీ మేడ్ మసాలా పేస్టులున్నాయ్, పెరుగు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయ్. అంత గొప్పటేస్ట్ రాకపోయినా టైం వేస్టవ్వకుండా ఉంటుంది.

10. వంట చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నీ కుదిరితే తిండానికి ఇష్టం గా ఉంటుంది. కానీ అంట్లు తోమాలంటే  కష్టం గా ఉంటుంది. అవి అలాగే వదిలేస్తే  మాత్రం వాసన భరించలేనిదిగానూ, పరిస్థితి పాథటిక్ గానూ ఉంటుంది. కాబట్టీ చెయ్యి కడిగినప్పుడే అంట్లు కూడా కడిగెయ్యండి. (ఇది కొంచెం కష్టమే గానీ తప్పదు)

11. నేటీ హీరోయిన్లే రేపటి ఐటెం బాంబులు. నేడు మిగిలిపోయిన అన్నమే రేపటి కమ్మని పులిహోర. అన్నం ఇళయరాజా స్వరూపం. వేస్ట్ చెయ్యకండి.


నోరూరించక పోయినా గానీ కడుపు మాడకుండా చేసే వంటకి నా ఈ 11 సూత్రాలూ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారు.  ఇక్కడెవరయినా వంటొచ్చినోళ్లుంటేమాత్రం క్షమించాలిసుమా...