Asianet News TeluguAsianet News Telugu

సింగరేణిలో టిఆర్ఎస్ సంఘం ఇంకేం గెలుస్తది

A worker feels trs lost relevance in Singareni

సింగరేణిలో అక్టోబర్ 05--2017 న జరుగనున్న గుర్తింపు కార్మిక సంఘము  ఎన్నికల ప్రచారములో TRS అనుబంధ కార్మిక సంఘము TBGKS నాయకులు " సహనముతో , ప్రజాస్వామ్యయుతముగా వ్యవహరించి పారిశ్రామిక శాంతిని కాపాడాలి. సామాన్యముగా అధికారములో ఉన్నవారికి బాధ్యతలు ఎక్కవగా ఉంటాయి. గతంలో తేది 28 -06-2012న జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికలలో TRS అనుబంధ కార్మిక సంఘము " తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము "ను గెలిపించినారు. ఎందుకంటే??? తెలంగాణ సెంట్ మెంట్/ తెలంగాణ ఆకాంక్ష మొదటి కారణము కాగ, రెండవది నేటి ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉద్యమ సమయములో అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక వాగ్దానాలు చేసినాడు. " వాలంటరీ రిటైర్డ్ మెంట్ స్కీం అన్ మెడికల్ గ్రౌండ్   డిపెండెంట్ ఉద్యోగ ఉద్యోగ నియామకాలను పునరుద్ధరింపచేసి ఒకే దెబ్బతో 30వేల మందికి ఉద్యోగాలను ఇప్పిస్తానని చెప్పినాడు.

మెడికల్ కాలేజీలు పెట్టించి , సింగరేణి కార్మికుల కు, ఉద్యోగులకు "సూపర్ స్పెషాలిటీ కార్పోరేట్  వైద్యచికిత్సను చేయిస్తానన్నాడు. సింగరేణి ఏరియాలో మైనింగ్ యూనివర్సిటీ ని, మైనింగ్ డిప్లొమా కాలేజీలను ఏర్పాటు చేయిస్తానన్నాడు. కార్మికులకు ఉద్యోగులకు స్వంత ఇంటి పథకము ద్వారా స్వంత ఇండ్లను కట్టిస్తానన్నాడు. సింగరేణి కార్మికులకు ఉద్యోగులకు ఆదాయపు పన్నును మాఫీ చేయిస్తానన్నాడు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బొగ్గు తవ్వకాలను బంద్ చేయించి ముప్పై నలుబై అండర్ అండర్ గ్రౌండ్ బొగ్గు బావులను తవ్విస్తానన్నాడు. సింగరేణి కొంగు బంగారం అన్నాడు. లక్ష యాబైవేల మంది కార్మికులు ఉద్యోగులు పని చేసేటట్లు తయారు చేస్తానన్నాడు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయిస్తానన్నాడు. గైరాజర్ లతో డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలను ఇప్పిస్తానన్నాడు. కార్మికుల అరికాలుకు కుచ్చిన ముల్లును మునిపంటితో పీకాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము నాయకులకు సూచించినాడు. NCWA/ నేషనల్ కోల్ వేజు అగ్రిమెంట్ ను హైదరాబాద్ కు తీసుకవస్తానన్నాడు. కాంట్రాక్టీకరణను, ప్రైవేటీకరణను పాతర పెడుతానన్నాడు. 

ఇప్పుడున్న సింగరేణి కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతము, కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతముకు బదులుగా మొత్తము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా సింగరేణిని తీర్చిదిద్దుతానన్నాడు. విదేశాలలో సింగరేణి కంపెనీ పరముగా బొగ్గు బావులను తవ్వించి ఉద్యోగాలను పెట్టిస్తానన్నాడు. సింగరేణిలో అవినీతిని పాతర పెట్టిస్తానన్నాడు, ఇలా అనేక ప్రయోజానాలను కల్పించి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చినాడు. బాగానే ఉన్నది. ముఖ్య మంత్రి గారు మంచి చేస్తానంటే అందరూ సంతోషిస్తారు.. సింగరేణి కార్మికులు ఉద్యోగులు కూడా మురిసి పోయినారు. ఇటు ముఖ్యమంత్రి మనకు దొరుకడము మన అదృష్టమని ముచ్చటపడ్డారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము  నాయకులు అంతర్గత విభేధాలతో, కార్మిక చందా డబ్బులను కోట్ల రూపాయలను దుర్వినియోగము చేసినా ?? ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని జైలు పాలైన , కోర్టులకు పోయిన, మరల TBGKS నాయకులను ఎన్నుకోవాలని ఇచ్చిన హైకోర్ట్ తీర్పు ప్రకారముగా జరిగిన ఎన్నికలలో  ఓట్లేసి TRS బలపరిచిన నాయకులను ఓడించిన వారికే తిరిగి పట్టము కట్టినా భరించినారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము గుర్తింపు కార్మిక సంఘము హోదా పరిమితి నాలుగు సంవత్సరాల గడువుకు మించి 14 నెలలు ఎక్కువ కాలము  కొనసాగినా?  నెలకు రూపాయలు 8లక్షల చొప్పున దాదాపు కోటి రూపాయలు కార్మికుల ఉద్యోగుల వేతనాల్లో యూనియన్ చందా డబ్బులను మినహయించుకున్నా భరించినారు. సామాన్యముగా, సహజముగా పాలక పక్షానికి,  అధికార పక్షానికి ఎన్నికల సమయమున ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పుతారు. అయితే సింగరేణిలో అక్టోబర్ 05 న జరుగనున్న గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికలలో TBGKS కు ప్రచార సమయములోనే చుక్కలు చూపించుచున్నారు. ప్రచారానికి వచ్చిన నాయకులను ప్రశ్నించుచున్నారు. తేది 20-09-2017 న రామగుండం ఏరియా 1 పరిధిలోని జిడికె 1 మరియు జిడికె 11 ఇంక్లైన్ ల మీదికి ప్రచారానికి వచ్చిన TBGKS/ TRS నాయకులకు ప్రశ్నలు వేసి చుక్కలు చూపించినారు. వాల్ల ప్రసంగాలను వినడానికి నిరాకరించినారు. కార్మికుల, ఉద్యోగుల నిరసనకు ఖంగు తిన్న నాయకులు సహనము కొల్పోయి, కార్మికులను, ఉద్యోగులను బెదిరించినారు. సత్తీష్ అనే కార్మికుడిని గుంజుకపోయి దాడి చేయడానికి ప్రయత్నించగా తోటి కార్మికులు, ఉద్యోగులు వారించగా, అడ్డుకోగ వెనుతిరిగి వెళ్లిపోయినట్లుగా తెలిసింది. 

 

ఇట్లు....
మెరుగు రాజయ్య,
సింగరేణి కార్మికుడు, 
రామగుండం,
ఫోన్. 9441440791

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి