Asianet News TeluguAsianet News Telugu

అమ్మా , నాన్నా...కాస్త వినoడి

a poem on the invading corporate schooling
అమ్మా , నాన్నా...కాస్త వినoడి
 

ఒకప్పుడు నా చేతిలో 
స్వేచ ఉండేది 
నా బుర్ర చురుకుగా 
మొగ్గలేసేది 
నా కనులు 
కలలతో నిండిపోయేది 
స్వేచా గాలితో 
నా ఊపిరి పరిమళించేది

చదువుల ఊబిలో దిగాబడ్డాక
సార్లు కుక్కింది తప్ప 
నా బుర్రలో ఏమి లేదు 
నిద్ర లేదు ఇంకా కలలు ఎక్కడ ?
సమయమంతా చదువే ...
గాలి  పీల్చేదెప్పుడు ?

ఆశలూ ,ఆశయాలు 
అన్ని అమ్మ నాన్నే నిర్ణయించారు 
నాలో దూరి వళ్లే ఆలోచిస్తారు 
నా నోటి నుండి సార్లు పలుకుత 
బతకడానికే తింటున్నా,
నా బతుక్కి రెండు షిఫ్టుల చదువా...!

వికాసం జీరో 
ఆటపాటలు సున్నా 
ఆరోగ్యం శూన్యం .
టెన్షను ,భయం 
ద్వేషం ,కడుపునొప్పి 
గజ్జి ,బెంగ జ్వరం 
ఇంటిదగ్గర విరేచనాలు 
హాస్టల్లో మలబద్దకం 
ఇవేగాధ నేను సంపాదించిన 
నవరత్నాలు !

నా ఇంటిలో  నేను ఒక
కాందశీకుణ్ణి 
నా హాస్టల్లో నేనొక 
ముఖ్య ఖైదిని 

కార్పరేటు కుట్రలో 
నన్ను ఇరికించిందెవరు?
నా నుండి నన్ను దూరం చేస్తుందెవరు ?
ర్యాంకుల ఎరీనాలో 
లేగదూడ గుండెలో 
కత్తులు దింపుతున్నదెవరు?
శిథిల వీధిబడిలో 
నిలబడి అడుగుతున్నాను 
యాజమాన్యాలా 
తల్లిదండ్రులా ,ఎవరు చెబుతారు ?
చెట్టు ముందా ,విత్తు ముందా ?

డాబూ దర్పాల వాళ్ళ బిడ్డని 
ఫైవ్ స్టారు స్కూలు వాణ్ణి  
కానీ ఏం లాభం 
మోతవల్ల వెన్ను విరిగిన వాణ్ణి 
వేర్లు కతిరించిన 'బోన్సాయ్ ' ని 
ఆకులు నరకబడిన క్రోటన్ ని 
స్వీయ కేంద్రం గా ఎదిగిన వాణ్ణి 
ఏ ప్రేమలు ఎరుగను 
నేనెవరికి వద్దు 
నాకెవరు వద్దు 

ఈవాళ నన్ను 
హాస్టల్లో పడేస్తే 
రేపు నిన్ను 
వృద్దాశ్రయం లో పడేయనా ?
నువ్వు నేర్పిన న్యాయమే కదా ?

వాడెవడో ఐఐటి ఆట,
ఆమెవరో డాక్టరట
వాళ్ళలా కావాలంటూ 
నన్ను బాదేస్తారా ?
వాళ్ళు అందుకోసం పుట్టారు 
మరి నేనెందుకు పుట్టానో 
కనిపెట్టండి బాబో
నా జన్మ కారకుల్లారా ...

చుట్టాలు లేరు 
నేస్తాలు లేరు 
సెలవుల్లేవ్ 
సినిమాల్లేవ్ 
పండుగల్లేవ్  
పెళ్ళిళ్ళు లేవు 
ఉన్నదల్లా
చదువు చాకిరీ మాత్రమే

ఈ కుట్ర విద్య విషవలయం  నుండి 
విముక్తి లేదా?
పారిపోయి లాభం లేదు
లాకొచ్చి చదివించేస్తారు 
ఏడ్చి మొత్తుకున్నా,
అమ్మ కరగలేదు
జైలు వద్దన్నా, 
నాన్న వదల్లేదు
గోడ దూకనివ్వలేదు 
అందుకే స్కూలు మీదనుండి దూకుతున్నా ...

ఇంద్రధనస్సు చూడాలి 
వర్షం లో ఆడాలి 
చెట్లు ఎక్కాలి 
కొండలు పాకాలి 
పావురం లా ఎగరాలి 
ఈదులడాలి 
పరుగుపెట్టాలి 
ఇరుకు గదులు వదిలి 
విశాలప్రపంచం లో విహరించాలి 

   ఏ పాఠశాలైతే ....

   నన్ను మనిషిగా చూస్తుందో 
   నాకు స్వేచ నిస్తుందో 
   కష్టపడేలా కాక ఇష్టపడేలా చేస్తుందో 
   నాలోని కళలను గుర్తిస్తుందో 
   నా ప్రతిభను వెలికి తీస్తుందో 
   నూతిలో కాక సముద్రంలో ఈదనిస్తుందో 
   జైలులో కాక మైదానంలో 
   చదువు చెబుతుందో 
   నాకు ప్రపంచాన్ని చూపిస్తుందో ...

   తండ్రీ ....
   ఆ బడిలో నన్ను చేర్చు

 

                       - పి.జె .సునీల్, 9059721662