Asianet News TeluguAsianet News Telugu

RTC Strike:తెలంగాణ బంద్‌కు ఆంధ్రా మద్దతు...విశాఖలో ఆందోళన

తెలంగాణ ఆర్టిసి కార్మికులు  చేపడుతున్న రాష్ట్ర బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రజాసంఘాల మద్దతు లభించింది.  న్యాయబద్దంగా కార్మికులు చేపడుతున్న సమ్మెకు తాము అండగా  నిలుస్తామని ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. 

andhra pradesh peoples asssociations supports telangana  bandh and RTC strike
Author
Vishakhapatnam, First Published Oct 19, 2019, 2:19 PM IST

విశాఖపట్నం: తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టిసి కార్మికులు చేపడుతున్న నిరసనకు మరో తెలుగు రాష్ట్రం నుండి మద్దతు లభించింది.  గతకొన్ని రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న కార్మికులకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు ఆంధ్రా ప్రజా సంఘాలు ప్రకటించింది. ఇవాళ(శనివారం) వారు నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రటించాయి..    

ఈ మేరకు విశాఖపట్నంలో ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఆర్టిసి కార్మికులకు న్యాయం చేయాలని...ఈ  మేరకు  వారి డిమాండ్లను కేసీఆర్ అమలు చేయాలని అన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ఆర్టిసి కార్మికుల పాత్ర  ఎంతో వుందని...  వాళ్ళ పోరాటం వల్లే ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోవద్దని సూచించారు.    న్యాయపరంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఇలా మొండిగా వ్యహరించడం కేసీఆర్ కు తగదన్నారు.  ఇకనైనా వారి డిమాండ్లను నెరవేర్చే దశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు సూచించారు. 

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఇవాళ బంద్ తలపెట్టారు. దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు తెలంగాణ ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి.  తాజాగా ఆంధ్రా ప్రజాసంఘాలు కూడా మద్దతును ప్రకటించాయి.

రాజధాని హైదరాబాద్ లో క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇస్తున్నారు.  ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు. నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

అయితే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. ఇదిలా ఉండగా...బంద్ నేపథ్యంలో... డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆర్టీసీ సమ్మె తర్వాత... అరకొరగా నడుస్తున్న బస్సులను రోడ్డుమీదకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios