Asianet News TeluguAsianet News Telugu

మీ దృష్టి మార్చండి.. అతడి వయస్సు 22 ఏళ్లే: పంత్‌ను వెనకేసుకొచ్చిన రోహిత్

టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ పంత్‌కు అండగా నిలిచాడు. పంత్‌ను పట్టించుకోవడం మానేయాల్సిందిగా రోహిత్ అభిమానులకు సూచించాడు. 

rohit sharma supports rishabh pant over failures
Author
Mumbai, First Published Nov 9, 2019, 9:55 PM IST

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. పదే పదే విఫలమవుతున్న అతడిని జట్టులోకి తీసుకోవడం అవసరమా అని కొందరు.. సానబెడితే మంచి ఆటగాడవుతాడని మరికొందరు అంటున్నారు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టీ20లలోనూ రిషభ్ నిరాశపరచడంతో అతడిని టీమిండియా అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లోనూ.. కీపింగ్‌లోనూ ఇచ్చిన అవకాశాలను అందుకోలేకపోవడంతో పంత్‌ జట్టులో చోటు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో చర్చలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ పంత్‌కు అండగా నిలిచాడు. పంత్‌ను పట్టించుకోవడం మానేయాల్సిందిగా రోహిత్ అభిమానులకు సూచించాడు. ప్రస్తుతం ప్రతీరోజు, ప్రతీక్షణం రిషభ్ పంత్ గురించే తీవ్రమైన చర్చ జరుగుతుందని తెలిసిందే

Also Read:మళ్లీ అదే ఆట... పంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

అయితే కొంతకాలం మీ దృష్టి పంత్‌పై కాకుండా ఇతర అంశాలపై పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నాడు. ఈ విధంగా చేసినట్లయితే అతను గొప్ప క్రికెట్ ఆడటానికి సాయం చేసినవారవుతారని రోహిత్ పేర్కొన్నాడు.

పంత్ ఒక ధైర్యమైన క్రికెటర్ అని .. జట్టు మేనేజ్‌మెంట్ అతనికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని భావిస్తోందని.. దీనిలో భాగంగానే తాను అతను మైదానంలో ఏం చేయాలనుకుంటున్నాడో దానిని అనుమతించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

పంత్ ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోతున్నాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని వయసు 22 ఏళ్లేనని.. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని రోహిత్ శర్మ వెల్లడించాడు.

Also Read:రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘన విజయం

అలా అని తనతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ రిషభ్ పంత్‌ని వెనకేసుకురావడం లేదని అతనిలో అపారమైన ప్రతిభ ఉంది కాబట్టే తాము పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నాడు. ఒక్కసారి క్రీజులో సెటిలైతే పంత్ గొప్ప క్రికెటర్‌గా మారడం ఖాయమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 

వికెట్ కీపింగ్ విషయంలో నిరాశ పరిచి.. నెటిజన్ల ట్రోల్స్ బారిన పడ్డాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ 20ల్లో పంత్ మరోసారి నిరాశ పరిచాడు.  బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ని స్టంపపౌట్ చేసే క్రమంలో పంత్ పెద్ద తప్పు చేశాడు.

కీపర్‌గా ప్రాథమిక నియమాన్ని ఉల్లఘించిన పంత్‌పై సోషల్ మీడియాలో అభిమానులు చురకలేస్తున్నారు. ఆట రూల్స్ కూడా తెలియడం లేదా అంటూ ఏకిపారేస్తున్నారు. పంత్ ఆట చూసి ధోనీ ఇలా రియాక్ట్ అవుతాడంటూ కొన్ని కామెడీ ఫోటోలు షేర్ చేస్తున్నారు.

ఎక్కడ చూసినా పంత్ ని ట్రోల్ చేస్తున్న మీమ్స్ కనిపించడం గమనార్హం. మొత్తానికి పంత్ మరోసారి బుక్కయ్యాడు. ఇలానే కంటిన్యూ అయితే.. పంత్ కి  అవస్థలు తప్పవు. 

Follow Us:
Download App:
  • android
  • ios