Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ: వారసులతో క్రికెట్ సంఘాల కిటకిట

లోధా కమిటీ సూచనలను అనుసరించి సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్య ఉద్దేశం, పాతుకుపోయి ఉన్న వ్యక్తులను క్రికెట్ బోర్డుల నుంచి తప్పించటం. కానీ దీనికి భిన్నంగా వారి పట్టు ఈ క్రికెట్ బోర్డులపై మరింత గట్టిగా పెరిగింది. 

heirs take reins of bcci
Author
New Delhi, First Published Sep 28, 2019, 11:31 AM IST

న్యూఢిల్లీ : బీసీసీఐ లో ఈ సంవత్సరం వేర్వేరు రాష్ట్ర క్రికెట్ సంఘాల నియామకాలు చూస్తుంటే ఒక అనుమానం కలుగక మానదు. బంధుప్రీతి రాజ్యమేలిందా ఈ నియామకాల్లో అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కొడుకులు,కూతుర్లు, అన్నదమ్ముల నియామకాలతో బీసీసీఐ నిండుగా తొణికిసలాడుతోంది. 

మొదటగా మనకు ఈ  లిస్టులో కనిపించే పేరు అరుణ్ ఠాకూర్. ఇతను హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఇతను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు. అనురాగ్ ఠాకూర్ కూడా గతంలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసారు. 

మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్ తమిళ్ నాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా నియమింపబడ్డారు. భారత క్రికెట్ యవనికపై శ్రీనివాసన్ పట్టు ఎటువంటిదో వేరుగా చెప్పనవసరంలేదు. 

మాజీ బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా కుమారుడు జయదేవ్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో నిరంజన్ షా ఈ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చాల కాలం సేవలందించారు. జయదేవ్ 115 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడడం అతనికి ఒకింత కలిసివచ్చే అంశమే అయినా, నిరంజన్ షా కుమారుడు కాకపోతే ఇతగాడు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు అయ్యేవాడా అని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. 

గోవా క్రికెట్  అడ్మినిస్ట్రేటర్ గా చాల కాలం సేవలందించిన వినోద్ ఫాడ్కే తనయుడు విపుల్ కూడా గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గా నియమింపబడ్డారు. 

మాజీ బీసీసీఐ అధ్యక్షుడు చిరాయు అమీన్ తనయుడు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష రేసులో ఉన్నాడు. కాబోయే అధ్యక్షుడు ఇతనే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రణబీర్ సింగ్ మహేంద్ర తనయుడు అనిరుద్ చౌదరి చాలా కాలంగా హర్యానా క్రికెట్ అసోసియేషన్ ని శాసిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుత బీసీసీఐ కోశాధికారిగా సేవలందిస్తున్న అనిరుద్ రానున్న కాలంలో కూడా హర్యానా క్రికెట్ బోర్డును ఇలానే శాసిస్తాడు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

ఇక మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వైపు చూస్తే సింధియా రాజవంశస్థులు తప్ప వేరే ఎవరూ కనపడరు. 

లోధా కమిటీ సూచనలను అనుసరించి సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్య ఉద్దేశం, పాతుకుపోయి ఉన్న వ్యక్తులను క్రికెట్ బోర్డుల నుంచి తప్పించటం. కానీ దీనికి భిన్నంగా వారి పట్టు ఈ క్రికెట్ బోర్డులపై మరింత గట్టిగా పెరిగింది. 

భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో వీరంతా ఎన్నికైన వారు. ఎన్నికల్లో నిలబడ్డ వీరి ప్యానెల్ విజయం సాధించిన తరువాతనే వీరు ఈ పదవుల్లో కూర్చున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 

కాకపోతే వ్యాపారంలో మాదిరి తల్లితండ్రుల వ్యాపార సామ్రాజ్యాన్ని బిడ్డలు నేరుగా హస్తగతం చేసుకున్నట్టుగా కాకుండా వీరంతా ఎన్నికై ఆ పదవుల్లో కూర్చున్నారు. 

సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులోని లొసుగులను వాడుకొని వీరంతా ఈ పోస్టుల్లో ప్రవేశించారనేది క్రికెట్ పండితుల అభిప్రాయం. వీరి పాలన చూడకుండానే వీరిని జడ్జ్ చేయడం తప్పు. కాకపోతే వీరంతా బలమైన మాజీల వారసులనేది మాత్రం పక్కకుపెట్టలేని సత్యం

Follow Us:
Download App:
  • android
  • ios