Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీతో రేపే గంగూలీ భేటీ: ఆ తర్వాత ఎంఎస్ ధోనీతో...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొనియాడారు. రేపు కోహ్లీతో భేటీ కానున్నట్లు గంగూలీ తెలిపారు. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతోనూ సమావేశమవుతానని చెప్పారు.

Ganguly to meet Virat Kohli thursday, later with MS Dhoni
Author
Mumbai, First Published Oct 23, 2019, 4:24 PM IST

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో రేపు గురువారం సమావేశమవుతానని బిసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. బుధవారం జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత గంగూలీ అధ్యక్షతన పూర్తి స్థాయి బోర్డు సమావేశం జరిగింది. 

బోర్డు సమావేశం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. టీమిండియా ప్రస్తుతం అద్భుతంగా ఉందని, సారథి కోహ్లీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన చెప్పారు. విరాట్ కోహ్లీతో రేపు సమావేశమవుతానని చెప్పిన గంగూలీ ఎంఎస్ ధోనీతో కూడా సమావేశమవుతానని చెప్పారు. 

 

ప్రస్తుతం భారత క్రికెట్ లో అత్యంత ప్రధానమైన ఆటగాడు కోహ్లీనే అని గంగూలీ అన్నారు. గత మూడు నాలుగేళ్లుగా టీమిండియా అపూర్వమైన విజయాలు సాధించిందని అన్నారు. అన్ని విభాగాల్లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రపంచంలోనే మేటి జట్టుగా టీమిండియాను తయారు చేయాలని కోహ్లీ తాపత్రయ పడుతున్నారని అన్నారు. 

కోహ్లీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని, టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సమకూరుస్తామని చెప్పారు. టీమిండియా విన్నింగ్ టీమ్ అని అన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలువలేదు కదా విన్నింగ్ టీమ్ ఎలా అవుతుందని మీరు అడుగొచ్చు గానీ ప్రతిసారీ ప్రపంచ కప్ గెలువలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. 

ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐసీసీ నుంచి భారత్ కు రావాల్సిన బకాయిలను రాబడుతామని కూడా చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. బుధవారంనాడు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios