Asianet News TeluguAsianet News Telugu

కార్డు లేకున్నా నో ప్రాబ్లం: ఎస్బీఐ ‘యోనో క్యాష్’ ఆవిష్కరణ

దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ తన ఖాతాదారులకు ఊరట కలిగించే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందే అమలులోకి తెచ్చిన యోనో యాప్ కు అనుబంధంగా యోనో క్యాష్ యాప్ ఆవిష్కరించింది

YONO Cash: Now, SBI customers can withdraw cash without ATM cards
Author
New Delhi, First Published Mar 17, 2019, 1:56 PM IST

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను ప్రారంభించింది.

దీంతో దేశవ్యాప్తంగా16,500కు పైగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలలో డెబిట్‌ కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేసు​కోవచ్చని బ్యాంక్‌ తెలిపింది. ప్రధానంగా ఏటీఎం కార్డు ద్వారా నగదు ఉపసంహరణ, వినియోగంలో జరుగుతున్న​మోసాలకు చెక్‌ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ తమదేనని ఎస్బీఐ  ప్రకటించింది.  ఈ వసతి గల ఏటీఎంలను ‘యోనో క్యాష్‌ పాయింట్‌’గా  వ్యవహరిస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. 

యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది. 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యోనో యాప్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

యాప్‌లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆరు అంకెల ‘యోనో క్యాష్ పిన్’ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ నంబర్ కేవలం అర్ధగంట మాత్రమే పని చేస్తుంది.

వెంటనే సమీప యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లి.. ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. అటుపై యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
తరువాత యాప్‌లో క్రియేట్‌ చేసిన ఆరు అంకెల ‘యోనో క్యాష్ పిన్‌’ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. తమ ఖాతాదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చడమే తమ లక్ష్యమని ఎస్బీఐ  ఛైర్మన్  రజినీష్‌ కుమార్ చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios