Asianet News TeluguAsianet News Telugu

హార్డ్‌వర్క్‌‌కు ఇండియన్లు పెట్టింది పేరు.. అందుకే

చిన్నతనం నుంచి కట్టుదిట్టమైన క్రమశిక్షణతోపాటు ఆంగ్లభాషపై పట్టు సాధించి.. ఆపై ఎటువంటి పని ఒత్తిళ్లనైనా ఎదుర్కోవడానికి భారతీయులు వెనుకాడరు. అందుకే వారిని ఉన్నతమైన అవకాశాలు వెన్నంటి వస్తాయి. దానికి నిదర్శనం సుందర్ పిచ్చాయ్.. సత్య నాదెళ్ల.. ఇంద్రానూయి.. జెఎంలాల్‌.. ప్రకాశ్‌ టాండన్.. అందుకే ఇండియన్ మేనేజర్లు వరల్డ్ వైడ్ విస్తరించారు. 

What makes Indian managers hit worldwide, reveals new book
Author
New Delhi, First Published Nov 19, 2018, 10:40 AM IST

న్యూఢిల్లీ: ఇంగ్లీష్ భాషపై పట్టు, ఎంత తీవ్రమైన పోటీనైనా తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోగల నేర్పరితనం, శ్రమించే స్వభావమే ఇండియన్లను అంతర్జాతీయ సంస్థల్లో నాయకత్వ స్థానానికి తీసుకెళ్లిందని ‘మేడ్‌ ఇండియా మేనేజర్’ పుస్తక రచయితలు స్పష్టం చేశారు. ఈ లక్షణాలే మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్యనాదెళ్ల, గూగుల్‌ సారథి సుందర్‌ పిచాయ్‌, పెప్సీ సారథి ఇంద్రానూయి విజయ రహస్యమని వారు తెలిపారు. వ్యాపార రంగ నిపుణుణు ఆర్‌ గోపాలకృష్ణన్‌, రంజన్‌ బెనర్జీ ఈ పుస్తకం రచించారు. 

భారతదేశానికి చెందిన వ్యక్తులు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సారథులు కావడానికి దారితీసిన ప్రత్యేక లక్షణాలపై వారు ఈ పుస్తకంలో సమూలంగా, సమగ్రంగా చర్చించారు. భారత్‌లోనే 18 ఏళ్లు, ఆ పై కొన్నేళ్ల వయసు వరకు విద్యనభ్యసించి ప్రపంచ శ్రేణి సంస్థలకు అధినాయకులుగా ఎదిగిన వారినే మేడ్‌ ఇన్‌ ఇండియా మేనేజర్‌ పుస్తకంలో పరిగణనలోకి తీసుకున్నారు. విదేశాల్లోనే జన్మించి అక్కడే పెరిగిన భారతీయ సంతతి వారు దీని పరిగణనలోకి రాలేదు. ఎస్‌ అండ్‌ పి 500 కంపెనీల సారథులుగా అమెరికన్‌ జాతీయుల తర్వాత భారతీయ సీఈఓలే అధిక సంఖ్యలో ఉన్నారు.
 
ప్రధానంగా భారత్‌లో ఉన్న విలక్షణమైన సవాళ్లు, ఎదుగుతున్న సమయంలో ఆ సవాళ్లన్నింటినీ తట్టుకుంటూ ముందుకు సాగిన తీరే వారిలో భిన్న సామర్థ్యాలను పెంచిందని రచయితలు పేర్కొన్నారు. భారతీయులు ఎంత కఠినమైన పోటీని ఎదుర్కొని ముందడుగేశారో తెలియచేసేందుకు ఉదాహరణ ఇస్తూ భారత్‌లోని అత్యున్నత శ్రేణి విద్యాసంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్న వారిలో కేవలం రెండు శాతం మందికే సీటు లభిస్తుందని పేర్కొన్నారు.
 
ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తే ఒక సందర్భంలో తన కుమారునికి ఐఐటీలో సీటు రాకే కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో చేరాడని చెప్పారని, భారతీయ విద్యాసంస్థల్లో నెలకొన్న గట్టి పోటీకి ఇంతకు మించిన తార్కాణం మరొకటి ఉండదని వారు తెలిపారు. భారత ఐఐటీలు మేధావులను తయారుచేసే కర్మాగారాలుగా పేరు పొందడానికి ఇదే కారణమని వారన్నారు.
 
భారతదేశ విద్యావంతులు అంతర్జాతీయ సంస్థల సారథులు కావడం 1959లోనే మొదలయిందని తెలిపారు. 1959 లో ఐసీఐ యుకె చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమితుడైన తొలి భారతీయుడు జెఎంలాల్‌ అని, ఆ తర్వాత 1961లో యునిలీవర్‌ చైర్మన్‌గా ప్రకాశ్‌ టాండన్‌, 1969లో ఇంపీరియల్‌ టుబాకో (యుకె)సంస్థ ఐటీసీ ఇండియా చైర్మన్‌గా అజిత్‌ హస్కర్‌ను నియమించాయని పేర్కొన్నారు. అప్పటి నుంచి మేడ్‌ ఇన్‌ ఇండియా మేనేజర్లు ప్రపంచ శ్రేణి కంపెనీల మాతృసంస్థల సారథులుగా నియమితులు కావడం మొదలైంది. 1979లో హెచ్‌ఎల్‌ఎల్‌ చైర్మన్‌ టి థామ్‌సను యునిలీవర్‌ బోర్డులోకి తీసుకుందని 1994లో రజత్‌ గుప్తాను మెకిన్సే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించిందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios