Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ పేమెంట్ సంస్థలకు వాల్ మార్ట్ సవాల్.. భారీ పెట్టుబడితో రంగంలోకి

ఆన్‌లైన్ గ్లోబల్ రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’.. భారత మార్కెట్లో కీలక నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పేలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థలో పెట్టుబడులతో రిటైల్, ఆన్‌లైన్ సంస్థలకు సవాల్ విసిరిన వాల్‌మార్ట్.. తాజా నిర్ణయంతో పేటీఎం, గూగుల్ పే, షియోమీ ఎంఐ పే   తదితర సంస్థల లావాదేవీలకు చెక్ పెట్టనున్నది.

Walmart Pumps in Rs 763 crore in PhonePe
Author
New Delhi, First Published Mar 23, 2019, 2:54 PM IST

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆన్‌లైన​ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ తీసుకున్న కీలక నిర్ణయం పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌కు షాకివ్వనున్నది. ఇప్పటికే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మెజార్టీ వాటాను కొనేసిన వాల్‌మార్ట్‌. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ సొంతమైన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేలో భారీ పెట్టుబడులను పెడుతోంది.

సమీర్ నిగమ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని, ప్రత్యేకించి రానున్న ఐపీఎల్ సీజన్లో ప్రకటనలు, ప్రమోషన్లపై  వెచ్చించాలని భావిస్తు‍న్న సమయంలో తాజా నిధులు అందడం విశేషం. డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో రానున్న విప్లవాత్మక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాల్‌మార్ట్‌ ఈ పెట్టుబడులను పెడుతోంది.

ఫోన్‌ పే సంస్థలోకి రూ. 763 కోట్ల (సుమారుగా 111 మిలియన్ డాలర్లు) వాల్ మార్ట్ పెట్టుబడులు సమకూర్చింది. 2019లో కంపెనీకి తొలి పెట్టుబడి నిధిగా భావిస్తున్నారు.  బెంగళూరుకు చెందిన సమీర్‌ నిగమ్‌ స్థాపించిన మొబైల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్‌ 2016లో కొనుగోలు చేసింది. 

2017లో 500 మిలియన్‌ డాలర్ల నిధులను ఫోన్ పేకు ఫ్లిప్‌కార్ట్ సమకూర్చింది. దీంతో  డిజిటల్‌  చెల్లింపుల రంగంలో మార్కెట్‌ లీడర్‌గా దూసుకెళుతోంది. 50 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులతో, ప్రత్యర్థులకు ధీటుగా  దూసుకుపోతోంది.  పేటీఎం,  గూగుల్‌ పే, అమెజాన్‌ పే, వాట్సాప్‌ పేమెంట్స్‌, జియోతోపాటు కొత్తగా షియోమీ ఎంఐ పే ఇటీవల డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి  ఎంట్రీ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios