Asianet News TeluguAsianet News Telugu

ఇది ఇండస్ట్రియల్, బ్యాంకింగ్ బడ్జెట్: బడా వ్యాపారవేత్తల స్పందనిదే

 బడ్జెట్ ప్రతిపాదనల పట్ల బ్యాంకర్లు, పారిశ్రామిక వర్గాలు ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే రైతులు, వేతన జీవులను సంత్రుప్తి పరిచేలా ఉన్నా.. చిన్న పరిశ్రమలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తమైంది. 

Union Budget 2019-20: Here's how the industry reacted
Author
New Delhi, First Published Feb 2, 2019, 11:37 AM IST

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు కార్పొరేట్‌, పారిశ్రామిక వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఈ బడ్జెట్‌ ఆర్ధిక వ్యవస్థకు మద్దతు చేస్తుందని పారిశ్రామిక వర్గాలు, బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. రైతులకు, మధ్య తరగతికి లబ్ధి చేకూర్చేలా ఉందన్నా, చిన్న పరిశ్రమలను పట్టించుకోలేదన్న ఆవేదన వ్యక్తమైంది. 

వృద్ధికి ఉత్ప్రేరకం: సీఐఐ
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేసే కీలక అంశాలను బడ్జెట్‌ స్పృశించిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ప్రధాన వినియోగ వర్గాలైన మధ్యతరగతి, రైతులు, అసంఘటిత వ్యవస్థలోని కార్మికుల ఆదాయ స్థితిని పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉన్నాయని చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు.

పలు ప్రోత్సాహకాల కలయిక: డాబర్ ఇండియా
మధ్యతరగతి, రైతులు, లక్షలాది మంది వేతన జీవులకు ప్రకటించిన ఎన్నో ప్రోత్సాహకాల కలయిక ఈ బడ్జెట్‌ అని డాబర్‌ ఇండియా సీఈఓ సునీల్‌ దుగ్గల్ చెప్పారు. వినియోగదారుడి విశ్వాసం పెరిగి.. గిరాకీ పెరిగేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చేసిన కేటాయింపులు, రైతుల ఆదాయ వృద్ధికి తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ ఆర్థిక స్థితికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

మేలుచేసే బడ్జెట్: ఐటీసీ
ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే బడ్జెట్‌ ఇది. బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు వినియోగం పుంజుకునేందుకు తోడ్పడుతాయని ఐటీసీ ఎండీ సంజీవ్ పురి చెప్పారు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, మధ్యతరగతి వర్గానికి మేలు జరుగుతుందని ఐటీసీ ఎండీ సంజీవ్‌ పురి తెలిపారు. 

15 కోట్ల మందికి లబ్ది : ఫిక్కీ
మధ్యంతర బడ్జెట్‌ వల్ల 15 కోట్ల మంది లబ్ధి పొందనున్నారని ఫిక్కీ అధ్యక్షుడు సందీప్‌ సోమాని పేర్కొన్నారు. ఇందులో 12 కోట్ల మంది రైతులు, 3 కోట్ల మంది వేతన జీవులు ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న 95 శాతం మంది కార్మికులకు లబ్ధి పొందనున్నారన్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే నిర్ణయాలు 
బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. రైతు పెట్టుబడి పథకం స్వాగతించాల్సిన విషయం అని మారికో సీఈఓ సౌగటా గుప్తా తెలిపారు.. చిన్న, సన్నకారు రైతులకు ఇది మేలు చేకూరుస్తుంది. ఆదాయం పన్ను రిబేట్‌ను పెంచడం వల్ల మధ్యతరగతిపై పన్ను భారం తగ్గడమే కాక, పన్ను పరిధిలోకి మరింత మంది వచ్చేందుకు తోడ్పడుతుందన్నారు. 
 
వినియోగదారుడి ప్రాధాన్య బడ్జెట్
వినియోగదారుడి ప్రాధాన్య బడ్జెట్‌ ఇది అని గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ సీఈఓ వివేక్‌ గంభీర్‌ చెప్పారు. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ వృద్ధికి అవసరమైన తోడ్పాటును ఇది అందిస్తుందని భావిస్తున్నాం అని తెలిపారు. ద్రవ్యలోటుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే వృద్ధికి, ప్రజలకు మేలు చేకూర్చడమే తమ అభిమతమని బడ్జెట్‌ నిర్ణయాలతో ప్రభుత్వం పునరుద్ఘాటించిందని గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ సీఈఓ వివేక్‌ గంభీర్‌ వివరించారు. 

ఐటీ మినహాయింపుతో ‘రిటైల్’కు లబ్ధి
ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతో మధ్యతరగతి ప్రజల చేతిలో మరింత డబ్బు మిగులుతుందని రిటైలర్స్ అసోసియేషన్ సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. దీంతో వినియోగం పెరిగి రిటైల్‌ రంగానికి ప్రయోజనం కలుగుతుందని కుమార్‌ రాజగోపాలన్‌ చెప్పారు.

స్థిరాస్థి రంగానికి ప్రయోజనం ఇలా
స్థిరాస్థి రంగానికి ప్రయోజనం కలిగేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉన్నాయని అనరాక్‌ ప్రోపర్టీ కన్సల్టెంట్‌ అనుజ్‌ పురి పేర్కొన్నారు. నిర్మాణదారులతోపాటు పన్ను చెల్లింపుదార్లు, పెట్టుబడిదార్లు ఇలా మూడు వర్గాలకు మేలు చేకూర్చేందుకు బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తోందన్నారు.
 
రైతు ఆదాయం పెంచే ప్రతిపాదనలు
రైతుల ఆదాయ స్థితిని మెరుగుపర్చేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయని వాల్ మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతం, మధ్యతరగతి లాంటి సరైన వర్గాలపై బడ్జెట్‌ దృష్టి పెట్టిందని క్రిష్‌ అయ్యర్ వివరించారు. 

కొనుగోలు శక్తి పెరగనుంది : ఎస్‌బీఐ
ఆదాయం పన్ను పరిమితిని రూ.5 లక్షలకు చేర్చడం సంతోషకరమని, దీని వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరగనుందని ఎస్‌కబీఐ ఛైర్‌పర్సన్‌ రజనీశ్  కుమార్‌ పేర్కొన్నారు. చిన్న, సన్న కారు రైతులకు ఆర్ధిక మద్దతును అందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డిపాజిట్లపై టిడిఎస్‌ పరిమితిని పెంచడం వల్ల కొత్త డిపాజిట్లు పెరగనున్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు మద్దతు: కేపీఎంజీ
ప్రస్తుత బడ్జెట్‌ వల్ల గ్రామీణ ప్రాంత రంగాలు నిలదొక్కుకోనున్నాయని కెపిఎం జి ఇండియా ఛైర్మన్‌ అరుణ్‌ ఎం కుమార్‌ పేర్కొన్నారు.అదే విధంగా మధ్య తరగతిపై భారం తగ్గనుందని, ఆర్ధిక వ్యవస్థ విస్తరించడానికి దోహదం చేయనుందని తెలిపారు. 

అవకాశాన్ని జారవిడువం: అపోలో హాస్పిటల్స్‌
కేంద్ర ప్రభుత్వం అందించాలనుకున్న అందరికీ ఉచిత వైద్యం అంకితభావంతో కూడిందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తామూ జారవిడుచుకోబోమని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios