Asianet News TeluguAsianet News Telugu

డ్రాగన్ ‘డోంట్ కేర్’! అమెరికాతో కయ్యానికే ‘సై’

అమెరికా బెదిరింపులకు భయపడబోమని డ్రాగన్ తేల్చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై అమెరికా సుంకాలు విధించినా బెదరబోమని పేర్కొంది. వాణిజ్య యుద్ధ విరమణకు రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ దశలోనే అన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ ఆదేశించారు. ప్రతిగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపైనా ఒకటో తేదీ నుంచి సుంకాలు విధించాలని చైనా నిర్ణయించింది.
 

Unfazed China hikes tariff on US products; says will not succumb to Trump's pressure tactics
Author
Beijing, First Published May 14, 2019, 11:01 AM IST

బీజింగ్: తాజాగా తమ వస్తువుల దిగుమతిపై సుంకాలు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. ‘చైనా ఎన్నటికీ లొంగిపోదు’ అని ఘాటుగా స్పందించింది.  తద్వారా సంధి కుదరదని డ్రాగన్ తేల్చేసింది. దీంతో అమెరికా- చైనా మరోసారి సమరానికే సై అంటున్నాయని తేలిపోయింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి.

అమెరికా విధించిన సుంకాల విషయంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న చైనా.. దెబ్బకు దెబ్బ తీయాలని నిర్ణయించుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 6,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై గరిష్ఠంగా 25 శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు సోమవారం చైనా ప్రభుత్వం ప్రకటించింది. 

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈ సుంకాల వడ్డనను చైనా ప్రారంభించనున్నది. అమెరికాకు చెందిన 5,140 ఉత్పత్తులు సుంకాల పరిధిలోకి వస్తాయని చైనా టారిఫ్‌ కమిషన్‌ ఆఫ్‌ ది స్టేట్‌ కౌన్సిల్‌ పేర్కొంది.  

200బిలియన్‌ డాలర్లు విలువైన వస్తువులపై అమెరికా టారిఫ్‌లు విధించడంతో ఈ వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దీనిలో ఆజ్యం పోస్తూ ట్రంప్‌ మరో 300 బిలియన్‌ డాలర్ల వస్తువులపై కూడా టారిఫ్‌లను సిద్ధం చేయాలని తన అధికారులకు చెప్పారు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌లను పెంచినా ‘ఎన్నటికీ లొంగిపోం’ అని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. ‘పూర్తి వివరాలు వచ్చే వరకు వేచి చూడాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్‌ షంగ్‌ అన్నారు. బాహ్య ఒత్తిడులకు చైనా లొంగదు. మా  హక్కులను కాపాడుకొంటామనే నమ్మకం మాకుంది’ అని  చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్‌ షంగ్‌ తెలిపారు.

గత వారం జరిగిన చర్చల్లో మేథో హక్కుల సంరక్షణకు సంబంధించిన చైనా తీసుకోవాల్సిన చర్యలు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు బలవంతం చేయడంపై వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు ముందుకు వెళ్లలేదు.

ఈ నెల 10 నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే 20,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రభుత్వం సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. ఈ నెల 10 (శుక్రవారం) నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. 

అమెరికా ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకునే మరో 30,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలు వడ్డించే ప్రక్రియను ప్రారంభించింది. కాగా, సుంకాల విధింపు సమస్యకు పరిష్కారం కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ పేర్కొన్నారు.
 
చైనానే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, పునఃసంప్రదింపులకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో చైనా వెనక్కి తగ్గిందన్నారు. అమెరికాతో వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోకపోతే చైనాకు భారీగా నష్టపోవాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. 

లేదంటే తమ కంపెనీ చైనాను వీడి ఇతర దేశాలకు తరలిపోవాల్సి వస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగకపోవడంతో అమెరికాకు చెందిన 200 కంపెనీలు చైనాలోని తమ ప్లాంట్లను భారత్‌కు తరలించాలని భావిస్తున్నట్లు ఈమధ్య వార్తలు వచ్చాయి.
 
చైనా-అమెరికా మధ్య పోరు పోటెక్కడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చైనా ప్రతీకార సుంకాల వార్తల నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్‌ సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లో భారీ నష్టాలు చవిచూశాయి. 

డోజోన్స్‌ ఏకంగా 460 పాయింట్లు (1.8 శాతం) పతనమైంది. ఎస్‌ అండ్‌ పీ 500 కూడా 1.8 శాతం మేర క్షీణించింది. నాస్‌డాక్‌ 2.3 శాతం జారుకుంది. యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగాయి. లండన్‌ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీ ఎఫ్‌టీఎ్‌సఈ 100 అర శాతం తగ్గగా.. జర్మనీ, ఫ్రాన్స్‌ మార్కెట్ల సూచీలు 1 శాతం పైగా పడిపోయాయి. చైనా మార్కెట్లలో. షాంఘై కాంపొజిట్‌ ఇండెక్స్‌ 1.21 శాతం, షెంజెన్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 1.08 శాతం తగ్గాయి.

Follow Us:
Download App:
  • android
  • ios