Asianet News TeluguAsianet News Telugu

నీరవ్ మోదీని అరెస్ట్ చేస్తాం: బ్రిటన్ ఆఫర్‌పై స్పందించని కేంద్రం

దేశభక్తి, అవినీతికి వ్యతిరేకంగా భారీగా ప్రచారానికి దిగే కేంద్రం.. వాస్తవంగా ఆ స్థాయిలో వ్యవహరించడం లేదని అర్థమవుతోంది. గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటపడి నీరవ్ మోదీ, అతడి మేనమామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేసిన తర్వాత స్పందించిన కేంద్రం.. విదేశాలకు లేఖలు రాసింది.

UK Sought Papers To Arrest Nirav Modi. India Didn't Respond, Say Sources
Author
London, First Published Mar 12, 2019, 11:22 AM IST

లండన్‌ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, లక్షల విలువైన దుస్తులు ధరించి వజ్రాల వ్యాపారం కూడా చేస్తోన్న పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ గురించి బ్రిటిష్ మీడియా రెండు రోజుల క్రితం ఓ వీడియోను వెలువరించింది.

దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టాయి.  భారత్‌కు తీసుకొచ్చే విషయంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం సమాధానం చెప్పింది. కానీ ఆ ప్రయత్నాల్లో పూర్తి స్థాయి వాస్తవం లేదని ఓ ఆంగ్ల మీడియా ద్వారా తెలుస్తోంది. 

నీరవ్ మోదీ అప్పగింత విషయమై సమాచారం ఇవ్వాలని బ్రిటిష్‌ అధికారులు ఎన్నోసార్లు సమాధానం కోరినా భారత్ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదని ఆ కథనం వివరించింది. ఆ కేసులో సహకరించడానికి భారత్‌కు బ్రిటన్ బృందం వస్తానని చెప్పినా, భారత్ వైపు నుంచి మాత్రం స్పందనలేదని పేర్కొంది. 

లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి రూ.13 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి నీరవ్ మోదీ.. లండన్‌కు పరారైన సంగతి తెలిసిందే. ప్రారంభంలో నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసిన వెంటనే కేంద్రం స్పందించింది.

‘మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (ఎంఎల్ఎటీ) కింద గతేడాది ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ అధికారులను సంప్రదించింది.గతంలో విదేశాలకు పారిపోయిన నిందితుల అప్పగింత కోసం చేసే ప్రక్రియ న్యాయ సాయం ఆలస్యమయ్యేది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నేరుగా సమన్లను లండన్‌లోని భారత్ హై కమిషన్‌కు ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి లండన్ సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ మద్య చర్చలు సంప్రదింపుల తర్వాత నీరవ్ మోదీ అప్పగింత విషయమై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

నీరవ్ మోదీ యూరప్, హాంకాంగ్ లో ఉన్నాడా? అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నప్పుడు గతేడాది మార్చిలోనే అతడు తమదేశంలోనే తల దాచుకున్నాడని లండన్ సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ధ్రువీకరించింది.

అంతే కాదు ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసుల్లో నిష్ణాతుడైన న్యాయవాది బ్యారీ స్టాన్ కాంబేను భారత్ కు పంపుతామని సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ప్రతిపాదించింది. కానీ కేంద్రం అందుకు మరికొన్ని పత్రాలు అవసరమని గుర్తించింది.

నీరవ్ మోదీ అప్పగింత, అంతకు ముందు అరెస్ట్ కోసం బ్రిటన్ అధికారులు మూడుసార్లు లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పందించలేదని సమాచారం. బ్రిటన్ అదికారులు ఆధారాలు తీసుకెళ్లేందుకు భారతదేశానికి వస్తామని, ఆ ఆధారాలతో నీరవ్ మోదీని అరెస్ట్ చేసేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నా మనోళ్లలో స్పందనే లేదని తెలుస్తోంది. 

భారత్ అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించిందన్న సంగతిని గుర్తించిన నీరవ్ మోదీ తన లీగల్ టీంను అప్రమత్తం చేశాడు. మిచోన్ ద్వారా ఆశ్రయం కోసం పని చేయడం మొదలు పెట్టాడు. కేంద్రం కూడా అప్పగింత కోసం బ్రిటన్‌కు లేఖలు రాసినట్లు తెలిపింది. 

రెండుసార్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేఖలు రాశాయి. కానీ అదనపు సమాచారం కోరిన సంగతి తమకు తెలియదని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు సంగతిని లండన్ సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు గతేడాది డిసెంబర్ నెలలోనే నిలిపేసినట్లు సమాచారం.

దీనిపై స్పందించేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆపీసు న్యాయవాది బ్యారీ స్టాన్ కాంబే నిరాకరించారు. దీనిపై విదేశాంగ శాఖ కూడా స్పందించడానికి నిరాకరించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) తాజా ఛార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది.

పంజాబ్‌ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మీద మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం కింద దాఖలు చేసిన ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అతడితో పాటు మరికొందరి పేర్లను చేర్చింది.

ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం దీన్ని దాఖలు చేసింది.  దాంతోపాటు అదనపు ఆధారాలను కూడా సమర్పించినట్లు అధికారులు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ కుంభకోణంలో నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ కూడా ప్రధాన నిందితుడిగా ఉండగా, వీరిరువురు కుటుంబ సభ్యులతోసహా గతేడాది జనవరిలో విదేశాలకు చెక్కేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. చోక్సీ కరేబియన్ దీవుల్లో ఉన్నాడని చెబుతుండగా, నీరవ్ లండన్‌లో ఉన్నట్లు ఇటీవలే రుజువైన సంగతి విదితమే. 

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. వాటి సాయంతో ఈ మామా అల్లుళ్లను భారత్‌కు రప్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నది.

ఇదిలావుంటే ఈ కేసులో ఇప్పటిదాకా నీరవ్‌కు చెందిన రూ.1,873.08 కోట్ల ఆస్తుల్ని పీఎంఎల్‌ఏ కింద ఈడీ జప్తు చేయగా, రూ.489.75 కోట్ల విలువైన నీరవ్, నీరవ్ కుటుంబ ఆస్తుల్నీ సీజ్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios