Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్‌ అంటే మజాకా: భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు.. కానీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటంటే శిలా శాసనమే. వచ్చే ఏడాది అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో తిరిగి గెలుపొందడమే లక్ష్యంగా ‘అమెరికన్ ఫస్ట్’ నినాదానికి భావోద్వేగాన్ని రంగరించేందుకు సిద్ధమయ్యారు. 

Trump terminates preferential trade status for India under GSP
Author
Washington D.C., First Published Jun 2, 2019, 11:04 AM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తలచిందే వేదం. ఆయన అనుకున్న పని ఖచ్చితంగా చేసేస్తారు. అందులో భాగంగా భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ను  ఈ నెల ఐదో తేదీ నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 

జీఎస్పీ రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా అధికారులు పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు గతనెల మూడో తేదీతో ముగిసింది.

అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి ప్రక్రియ ఇప్పటి వరకు ఆగిపోయింది.

భారత్‌లో ఎన్నికల ముగిసిపోవడంతోపాటు నరేంద్రమోదీ సర్కార్ కొలువు దీరింది. దీంతో డొనాల్డ్ ట్రంప్‌ తన కార్యాచరణను అమలు చేయడానికి పూనుకున్నారు. ఓవైపు భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూనే మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ‘సమానమైన, సమర్థనీయ’ వాతావరణం కల్పించే విషయమై భారత్ నుంచి ఎటువంటి హామీ లభించనందున భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు మార్చిలో కాంగ్రెస్‌కు ట్రంప్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. 

అమెరికా వస్తువులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తోందన్నది ట్రంప్‌ వాదన. మరోవైపు జీఎప్పీ తొలగింపు వల్ల భారత్‌ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. 

కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే క్రమంలో అమెరికా ప్రవేశపెట్టిన విధానమే జీఎస్పీ వ్యవస్థ. భారత్ ఎగుమతి చేస్తున్న 2000 రకాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో మనదేశానికి అమెరికా  భారీ రాయితీలిస్తోంది. 

2017లో అమెరికా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఈ వ్యవస్థ కింద భారీగా అబ్ధి పొందుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో ఉంది. 2017లో భారత్‌ దాదాపు 5.7 బిలియన్‌ డాలర్ల రాయితీ పొందినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అయినా ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను అమెరికా రద్దు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని భారత్ తెలిపింది.

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో సమర్థనీయమైన మార్కెట్‌ లభించడంలేన్న ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా పంపిన అనేక అభ్యర్థనలపై భారత్‌ కొన్ని తీర్మానాలు చేసిందని.. కానీ అవేవీ అమెరికా అంగీకరించకపోవడం విచారకరం అని ప్రకటనలో తెలిపింది.

‘అమెరికాతో ఇతర దేశాల వలే భారత్‌ కూడా తన ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. దేశాభివృద్ధికి అనేక అవసరాలతో పాటు ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కూడా మెరుగైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. ఈ లక్ష్యమే ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తుంది’అని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. 

ఇలాంటి నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని భారత్ తెలిపింది. ‘జీఎస్పీ హోదా రద్దు అంశాన్ని ఓ సాధారణ ప్రక్రియగానే భావిస్తున్నాం.

అమెరికాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కృషి జరుగుతూనే ఉంటుంది. పరస్పర లబ్ధి కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉంది’ అని ప్రకటనలో తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios