Asianet News TeluguAsianet News Telugu

తొందరేం లేదు: జెట్ ఎయిర్వేస్‌కు 200$ కోట్లు చెల్లించాలన్న టాటా?

ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థను స్వాధీనం చేసుకునే విషయమై టాటా సన్స్ ఆచితూచి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ సిబ్బంది సెప్టెంబర్ నెల వేతనం సగం, అక్టోబర్ నెల వేతనం పూర్తిగా బకాయి పడిందని చెబుతున్నారు. సిబ్బంది వెళ్లిపోతుండటంతో ఇప్పటి వరకు ఉన్నవారిపై అదనపు పని భారం పడుతున్నదని పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

Tatas To Go Slow On Deal To Acquire Debt-Laden Jet Airways: Report
Author
New Delhi, First Published Nov 20, 2018, 2:18 PM IST

న్యూఢిల్లీ: రుణ వాయిదాలు, లీజు చెల్లింపులు.. ఆపై సిబ్బంది వేతన బకాయిల చెల్లింపులకు సరిపడా నిధుల్లేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ను కొనుగోలు చేసే విషయమై టాటా సన్స్ ఆత్రుత పడటం లేదు. నెమ్మదిగా ముందుకు సాగొచ్చని టాటా సన్స్ డైరెక్టర్లు భావిస్తున్నారు. హడావుడిగా ముందడుగు వేస్తే సదరు సంస్థ స్వాధీనానికి 200 కోట్ల డాలర్లు (రూ.143.21 బిలియన్లు) చెల్లించాలి. అందుకు సీరియస్ హోంవర్క్ చేస్తే తప్ప ముందడుగు వేయలేమని టాటా సన్స్ సన్నిహిత వర్గాల కథనం. టాటా సన్స్ కేవలం ప్రతిపాదన అనడంతోనే సోమ వారం జెట్ ఎయిర్వేస్ షేర్ పతనం అవుతున్నది.

శుక్రవారం జరిగిన టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కొందరు డైరెక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఒక ఆంగ్ల దినపత్రికలో మంగళవారం ఒక వార్త ప్రచురితమైంది. వచ్చే నెలలో జరిగే బోర్డు సమావేశం నాటికి మరిన్ని వివరాలు అందజేయాలని వారు కోరారని సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు బోర్డుకు పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధులు నిరాకరించారు. గత శుక్రవారం టాటా సన్స్ బోర్డు భేటీ తర్వాత జెట్ ఎయిర్వేస్ స్వాధీనంపై కేవలం ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని, తదుపరి ఇంకా ముందడుగేమీ వేయలేదని ఒక ప్రకటనలో తెలిపింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్దీపన ఇవ్వలేమన్న సురేశ్ ప్రభు  
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు స్పష్టం చేశారు. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ప్రైవేటు విమానయాన సంస్థల బోర్డులు, యాజమాన్యాలు సక్రమంగా పని చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, విమానాశ్రయ ఆపరేటర్లకు చెల్లింపుల విషయంలో కొంత సమయం కావాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ అడుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలోనూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. 

సిబ్బంది వేతనాలు చెల్లించలేని దుస్థితిలో జెట్ ఎయిర్వేస్
ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందితోపాటు పైలెట్లకు కూడా జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,261 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్దీపన ప్యాకేజీ గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘ఏదైనా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందే తప్ప ఒక సంస్థ కోసం ప్రత్యేకంగా ఉద్దీపన ప్యాకేజీ అందించడం చేయదు. ఆయా సంస్థల యాజమాన్యాలు తగిన సమయంలో సరైన చర్యలు చేపట్టి మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాల్సిన అవసరం ఉంద’న్నారు. ‘విమానాశ్రయ ఆపరేటర్లకు చెల్లింపులు చేసేందుకు మరింత సమయం కావాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ అడుగుతోంది. అయితే ఈ విషయం వారు వారూ చూసుకోవాలి. ఇందులో మంత్రిత్వ శాఖ ఎలాంటి జోక్యం చేసుకోలేద’ని పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే కూడా స్పష్టం చేశారు.

వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సిబ్బంది
తమకు వేతన బకాయిలు చెల్లించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. వరుస నష్టాలు, సెప్టెంబర్  జీతంలో సగం, అక్టోబర్ మొత్తం జీతం యాజమాన్యం చెల్లించలేదని పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 30లోగా తమకు బకాయి పడిన జీతాలను చెల్లించకపోతే అదనపు బాధ్యతలు నిర్వర్తించబోమని వారు తేల్చి చెప్పారు. 

నేడు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ భేటీ
వేతనాల చెల్లింపుపై చర్చించేందుకు నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించింది. దాదాపు 1600 మంది పైలట్‌లు, ఇతర సిబ్బందికి సెప్టెంబరు సగం జీతమే చెల్లించటం, అక్టోబరు జీతం ఇంకా ఇవ్వకపోవటంతో వారు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘దాదాపు 15 శాతం మంది ఉద్యోగులు సకాలంలో జీతాలు అందుకోవట్లేదు’’ అని గత వారం జరిగిన సంస్థ ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యనిర్వాహణాధికారి విజయ్‌ దుబే అన్నారు. పైలట్‌ల కొరత వల్ల నెలకు 75 నుంచి 80 గంటలు చేయాల్సిన పని కాస్తా 90 గంటలు చేయాల్సి వస్తోందని పైలట్‌లు వాపోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios