Asianet News TeluguAsianet News Telugu

మెలిక: జెట్ ఎయిర్వేస్‌పై ‘టాటా’ భిన్నస్వరం.. ప్రపోజల్ ఓన్లీ

జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసే విషయమై శుక్రవారం జరిగిన టాటా సన్స్ భేటీ మెలిక బెట్టింది. కేవలం ప్రతిపాదన మాత్రమేనని పేర్కొంది. విస్తారాతోపాటు ఎయిర్ ఆసియాతో జాయింట్ వెంచర్ నడుపుతున్న టాటా సన్స్.. జెట్ ఎయిర్వేస్ స్వాధీనం చేసుకోనున్నాయని వార్తలు ఊపందుకున్నాయి.

Tata Sons on Jet Airways deal: Discussions at preliminary stage, no proposal made
Author
Mumbai, First Published Nov 17, 2018, 8:04 AM IST

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న మాట నిజమే కాని.. ఇప్పటివరకు ఎలాంటి గట్టి ప్రతిపాదనేదీ తాము చేయలేదని టాటా సన్స్‌ స్పష్టం చేసింది.  ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది.

సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో కలిసి కొనుగోలు యత్నం
నరేశ్‌ గోయల్‌కు చెందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను తన అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేసే ఉద్దేశంలో టాటా సన్స్‌ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండటంతో టాటా సన్స్‌ ఈ స్పష్టతను ఇచ్చింది. ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో విస్తారాను, ఎయిరేషియా సహకారంతో ఎయిరేషియా ఇండియాను టాటా సన్స్‌ నడుపుతోన్న సంగతి తెలిసిందే.

జెట్ ఎయిర్ వేస్ నుంచి ఏ ప్రతిపాదన రాలేదని టాటా స్పష్టత
‘జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు టాటా సన్స్‌ ఆసక్తి కనబరుస్తోందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేం దీనిపై స్పష్టత ఇవ్వదలిచాం. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనను జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎదుట పెట్టలేదు’అని బోర్డు సమావేశానంతరం టాటా సన్స్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగడం గమనార్హం. 

జెట్ ఎయిర్వేస్, టాటాసన్స్ మధ్య జోక్యం చేసుకోలేదన్న కేంద్రం
మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌, టాటా సన్స్‌ల మధ్య లావాదేవీ వ్యవహారం సజావుగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌.ఎన్‌.చౌబే కొట్టిపారేశారు. ఈ లావాదేవీని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్పులో కొంత కత్తెర వేయమంటూ బ్యాంకులను, ఎయిర్‌పోర్ట్‌ అథారిటినీ ప్రభుత్వం అడగలేదని స్పష్టం చేశారు.

జెట్ ఎయిర్వేస్ హస్తగతంపై టాటాసన్స్‌లో భిన్నాభిప్రాయాలు
ఇదిలా ఉంటే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు ప్రక్రియపై  టాటా సన్స్‌ సీఎఫ్‌ఓ సౌరభ్‌ అగర్వాల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ నరేష్‌ గోయల్‌ సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాక జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునేలా టాటా సన్స్‌ ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 

అంచనాలు మరింతగా పెంచిన టాటా సన్స్ బోర్డు భేటీ
ఏతావాతా టాటా సన్స్‌ బోర్డు సమావేశం  టాటా-జెట్‌ డీల్‌ పై అంచనాలను మరింత పెంచింది. మరోవైపు ఎయిర్‌ ఏషియాతో భాగస్వామ్యం రద్దుకు టాటాసన్స్ యోచన విస్తారాపైనే పూర్తిగా దృష్టిసారించాలన్న ఉద్దేశంతో ఎయిర్‌ ఏషియా ఇండియా భాగస్వామ్యం నుంచి బయటికొచ్చేయాలని టాటా సన్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకుగాను ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌తో చర్చిస్తోందని, చర్చలింకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిసింది. ఎయిర్‌ ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు 51 శాతం, ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌కు 49 శాతం వాటా ఉంది. గోయల్‌తో డీల్‌ కుదిరితే జెట్‌ ఎయిర్‌వేస్-విస్తారాను విలీనం చేయవచ్చంటున్నారు.

మళ్లీ దూసుకెళ్లిన జెట్ ఎయిర్వేస్ షేర్
జెట్‌ ఎయిర్‌వేస్‌ను టాటా సన్స్‌ కొనుగోలు చేయనుందన్న ఊహాగానాల కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ గత ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో 40 శాతం వరకు పెరిగింది. శుక్రవారం కూడా షేర్ 8.07%పెరిగి రూ.346.85 వద్ద ముగిసింది. టాటా సన్స్‌ బోర్డు సమావేశానంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు వ్యవహారంపై సానుకూల వార్త వినిపిస్తుందనే అంచనాలతో ఉదయం షేర్ 14 శాతం లాభంతో ప్రారంభమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios