Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్‌వేస్ కోసం క్యూ కట్టిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు....

టాటాసన్స్, ఎతిహాద్, డెల్టా ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ లైన్స్ ఇంకా క్యూ భారీగానే ఉంది. ఇదంతా ఏమిటంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం జోక్యంతో బ్యాంకులు టేకోవర్ చేసుకున్న ‘జెట్ ఎయిర్వేస్’ సంస్థను కైవసం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు. దాని నిర్వహణకు బ్యాంకర్ల కన్సార్టియం నుంచి వాటాలను కొనుగోలు చేయడంతోపాటు అదనంగా రూ.4500 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్ అయితే టికెట్ ధరలు తగ్గివస్తాయని అంచనా వేస్తున్నారు. 
 

Tata Sons, Etihad Airways, Delta Air Lines and Qatar Airways - Long list of suitors for Jet Airways
Author
New Delhi, First Published Mar 27, 2019, 3:10 PM IST

ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రమోటర్ నరేశ్ గోయల్ నుంచి ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం చేతికొచ్చిన జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థను చేజిక్కించుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో టాటా సన్స్‌, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. 

ఇండిగో కూడా జెట్ ఎయిర్వేస్ కోసం పోటీ పడొచ్చు
ప్రస్తుతం భారత్‌లో అగ్రశ్రేణి ఎయిర్‌లైన్స్‌గా ఉన్నఇండిగో సైతం పోటీ పడే అవకాశం ఉంది. జెట్‌ టేకోవర్‌ ద్వారా అంతర్జాతీయ మార్గాల్లోనూ సేవలందించే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. జెట్‌లో వాటా కొనుగోలు చేసేందుకు గడిచిన రెండేళ్లలో ఇండిగో మినహా మిగతా నాలుగు కంపెనీలు ప్రయత్నించాయి. కాబట్టి, బ్యాంకర్లు ‘జెట్‌’ విక్రయం కోసం ఈ నాలుగు సంస్థలను సంప్రదించే అవకాశాల్లేకపోలేవని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

ఇంటర్నేషనల్‌గా పటిష్ఠ నెట్‌వర్క్
మార్కెట్‌లో వాటా పరంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌. దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను అందిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ మార్గాల్లో పటిష్ఠమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండటం. జెట్‌ ప్రస్తుతం 20 దేశాలకు సర్వీసులు నడుపుతోంది.

20 ఎయిర్ లైన్స్ సంస్థలతో కోడ్ షేరింగ్ కాంట్రాక్టులు
ఎతిహాద్‌తోపాటు 20 ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో కోడ్‌ షేరింగ్‌ కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకుంది. జెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా పలు ఆకర్షణీయ మార్గాల సర్వీసుల నెట్‌వర్క్‌ దక్కడమంటే సువర్ణావకాశమేనని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు రూ.4,500 కోట్ల కేపిటల్ కావాలి
జెట్‌ ఎయిర్వే‌సను కొనుగోలు చేయబోయే కొత్త ఇన్వెస్టర్‌ కంపెనీ నిర్వహణ కోసం రూ.4,500 కోట్ల మూలధనం సమకూర్చాల్సి రావచ్చని ఎస్‌బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌లైన్స్‌ను చేజిక్కించుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన అన్నారు.‘కొత్త కొనుగోలుదారు ఆర్థిక పెట్టుబడుదారు కావొచ్చు. లేదా విమానయాన సంస్థ కావొచ్చు. నరేశ్‌ గోయల్‌ కూడా కావొచ్చు’అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఎస్బీఐ రుణ పరిష్కార ప్రణాళికకు జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం
ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికకు సోమవారం జెట్‌ బోర్డు ఆమోదం తెలిపింది. పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈ ఎయిర్‌లైన్స్‌ చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల బకాయిలకు బ్యాంకుల కన్సార్షియానికి 51 శాతం ఈక్విటీ వాటా కేటాయించనుంది. 

తమ వాటాను విక్రయించనున్న బ్యాంకుల కన్సార్టియం
బ్యాంకుల కన్సార్టియం జెట్‌ ఎయిర్వేస్ సంస్థలో తమకు దక్కిన మెజారిటీ వాటాను బ్యాంకుల కన్సార్షియం తిరిగి విక్రయించనుంది. మే 31 నాటికి జెట్‌ కొత్త ఇన్వెస్టర్‌ చేతుల్లోకి వెళ్లవచ్చని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అన్నారు. జెట్‌ టేకోవర్‌కు ఆసక్తి చూపే వారికి, రుణదాతల బృంద సారధి అయిన ఎస్‌బీఐ వచ్చే నెలలో ఆహ్వానం పలకనుంది. మే చివరకల్లా కొత్త పెట్టుబడుదారును ప్రకటిస్తుంది. 
 
తగ్గుముఖం పట్టనున్న విమాన చార్జీలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం కొలిక్కిరానుండటంతో విమాన చార్జీలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే, లీజు అద్దె చెల్లించలేక ఇతర కారణాలతో గత కొన్ని రోజుల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ పలు విమానాలను నిలిపివేసింది. ఈ ఎయిర్‌లైన్స్‌కు మొత్తం 119 విమానాలుండగా.. ఇప్పటివరకు 80కి పైగా నిలిపివేసింది. దాంతో వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యా యి.

బోయింగ్ విమానాలపై నిషేధం.. ఇండిగో ఇలా సర్వీసుల రద్దు
ఇందుకుతోడు, బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానాలపై కేంద్రం నిషేధం విధించడం, పైలట్ల కొరత కారణంగా ఇండిగో సైతం కొన్ని సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో, విమాన సేవలకు భారీ కొరత ఏర్పడి, గత నెలలో చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా బ్యాంకులు జెట్‌ ఎయిర్వేస్‌కు రూ.1,500 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ నిధులతో విమానాల అద్దె, పైలట్లు ఇతర సిబ్బంది జీతాలు చెల్లించనుంది. తద్వారా ఈ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు పునరుద్ధరించుకోగలిగితే చార్జీలు తగ్గుముఖం పట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

పైపైకి దూసుకెళ్లిన జెట్‌ షేర్ 
జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ వరుసగా రెండో రోజూ భారీగా పెరిగింది. మంగళవారం బీఎస్ఈలో జెట్‌ షేర్ ధర మరో 6.48 శాతం బలపడి రూ.271 వద్ద క్లోజైంది. ఎన్‌ఎస్ఈలో 5.37 శాతం ఎగబాకి రూ.267.75 వద్ద స్థిరపడింది. సోమవారం నాడు ఎయిర్‌లైన్స్‌ షేరు 15 శాతానికి పైగా లాభపడింది.
 
ఎస్బీఐ చైర్మన్ ముందుకు పైలట్ల వేతన ఇష్యూ
పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలపై చర్చించేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ను జెట్‌ఎయిర్‌వేస్‌ దేశీయ పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) కోరింది.  వేతన బకాయిలు చెల్లించడంతో పాటు, మార్చి 31లోగా పునరుద్ధరణ ప్రణాళికపై ఓ స్పష్టత ఇవ్వకుంటే ఏప్రిల్‌ 1 నుంచి తమ 1,100 మంది సభ్యులు విమానాలు నడపడం ఆపేస్తారని గత వారం ఎన్‌ఏజీ ప్రకటించింది. 

సమస్య పరిష్కరించాలని కోరిన ఎన్ఏజీ
‘మేం, మా ఇంజినీర్లు కొంత కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వేతన బకాయిలు చెల్లించడం ద్వారా సమస్యను పరిష్కరించాలి’అని రజనీశ్‌ కుమార్‌కు పంపిన ఈ-మెయిల్‌లో ఎన్‌ఏజీ జనరల్‌ సెక్రటరీ తేజ్‌ సూద్‌ కోరారు. 

ఎస్భీఐకి ఎన్‌ఏజీ ధన్యవాదాలు 
జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభ పరిష్కారానికి మార్గం చూపినందుకు ఎస్‌బీఐకి జెట్‌ఎయిర్‌వేస్‌ దేశీయ పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ జనరల్ సెక్రటరీ తేజ్ సూద్ ధన్యవాదాలు తెలియజేశారు. తమకు కొంత సమయం కేటాయించి, భవిష్యత్‌ ప్రణాళికపై ఆలోచనలు పంచుకునే అవకాశం కల్పిస్తే, సిబ్బంది విశ్వాసం ఇనుమడించేందుకు, అనిశ్చితులు తొలగిపోయాయనే భరోసా కలిగేందుకు  ఉపకరిస్తుందని తెలిపారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు పైలట్లు సంస్థకు అండగా నిలిచిన విషయాన్ని సూద్‌ గుర్తుచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios