Asianet News TeluguAsianet News Telugu

కూర్చుని సెటిల్ చేసుకోండి: అంబానీ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు హితవు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి స్పెక్ట్రం, ఇతర ఆస్తుల కొనుగోలు విషయమై అంబానీ సోదరులిద్దరూ కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక స్వీడన్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిలను చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారో నెల రోజుల్లో తెలియజేయాలని అనిల్ అంబానీని న్యాయస్థానం ఆదేశించింది.
 

Supreme Court seeks response from RCom chief Anil Ambani on Ericsson's contempt petition
Author
Mumbai, First Published Jan 8, 2019, 8:07 AM IST

ఎరిక్సన్‌కు బకాయిల చెల్లింపుల్లో ఎందుకు విఫలమయ్యారో తెలియజేయాలని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌-కామ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీకి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది.

గతంలో చేసిన వాగ్ధానం మేరకు ఎరిక్సన్‌ సంస్థకు బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆయనపై ధిక్కరణ అభియోగం కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దో వెల్లడించాలని అనిల్‌ను కోరింది.

నాలుగు వారాల్లో జవాబివ్వాలని అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఆదేశం
కోర్టు ధిక్కార పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా జవాబివ్వాలని జస్టిస్ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతత్వంలోని ధర్మాసనం సోమవారం అంబానికి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రూ.550 కోట్ల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన ఆర్‌-కామ్‌ అధినేత అనిల్‌ అంబానీపై స్వీడన్‌ టెలికాం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్‌ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అనిల్, ఆర్-కామ్ అధికారులను జైలుకు పంపాలన్న ఎరిక్సన్
తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్‌ అవుతున్న అనిల్‌ను, ఆయనతో పాటు మరో ఇద్దరు కంపెనీ ఉన్నతాధికారులను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. దీనిపై తాజాగా నారిమన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది.

ఆర్ - కామ్ ప్రతిపాదనకు ఎరిక్సన్ ఇలా తిరస్కరణ
కాగా బకాయి కింద రూ.118కోట్లను చెల్లించడానికి ఆర్‌కామ్‌ సిద్దంగా ఉందని, ఈ మొత్తాన్ని ఎరిక్‌సన్‌ అంగీకరించాలని ఆర్‌కామ్‌ తరపు సీనియర్‌ అడ్వకేట్లు కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహత్గి కోరారు. ఈ ప్రతిపాదనను ఎరిక్‌సన్‌ తిరస్కరించింది. దీంతో ఆ మొత్తాన్ని డిమాండ్‌ డ్రాప్ట్ రూపంలో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్‌ చేయాల్సింగా ఆర్‌కామ్‌ను కోర్డు ఆదేశించింది.

ఆర్ కాం తీరును కోర్టు ద్రుష్టికి తెచ్చిన ఎరిక్సన్
ఆర్‌కామ్‌ ఆస్తులు విక్రయించగా రూ.3,000 కోట్లు పొందినా తమకు చెల్లింపులు చేయలేదని ఎరిక్‌సన్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది.

బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్‌ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా  ఉల్లంఘించారని ఎరిక్సన్‌ ఇది వరకు తన పిటిషన్‌లో పేర్కొంది. 

స్పెక్ట్రం కొనుగోళ్లపై అంబానీ బ్రదర్స్ మాట్లాడుకోవాలి
ఆర్‌-కామ్‌ ఆస్తుల కొనుగోలుపై అంబానీ అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలని కోర్టు తాజాగా సూచించింది. పరస్పరం మాట్లాడుకొని స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లింపు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్‌ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్‌- కామ్‌ కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కోర్టు ప్రశ్నించింది. 

బకాయిలపై ఫిజికల్ గ్యారంటీకి జియో నో
ముందస్తు బకాయిల నేపథ్యంలో ఆర్‌కామ్‌కు ఫిజికల్‌ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో ట్రాయ్ నిబంధనలను పాటించాల్సి ఉందని అన్నారు.

ఆర్-కామ్‌పై ఎరిక్సన్ దివాళా పిటిషన్ ఇలా
దేశవ్యాప్తంగా ఆర్‌-కామ్‌ టెలికాం నెట్‌వర్క్‌ నిర్వహణపై 2014లో ఎరిక్సన్‌ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. 2016 నుంచి చెల్లింపులు చేయకపోవడంతో సెప్టెంబర్‌ 2017లో ఆర్‌కామ్‌తో పాటు ఆ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌, రిలయన్స్‌ టెలికంలపై ఎరిక్సన్‌.. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ వేసింది. 

ఎరిక్సన్ బకాయిల చెల్లింపునకు డిసెంబర్ 15 వరకు గడువు
ఈ కేసు పలు పరిణామాల మధ్య తుదకు 2017 సెప్టెంబర్‌ నాటికి రూ.550 కోట్లు చెల్లించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎరిక్సన్‌ మళ్లీ కోర్టుకెళ్లడంతో డిసెంబర్‌ 15 నాటికి అవకాశం కల్పించింది. బకాయిల చెల్లింపులో ఆర్‌కామ్‌ రెండు సార్లు విఫలమైంది. దీంతో తాజాగా ఎరిక్సన్‌ అభ్యర్థన మేరకు సుప్రీం మరోసారి కల్పించుకుంది.

రూ.46 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఆర్ కామ్
ప్రస్తుతం ఆర్‌కామ్‌ రూ.46వేల కోట్ల పైగా అప్పుల్లో ఉంది. ఆస్తుల విక్రయం ద్వారా ఈ అప్పులను రూ.6,000 కోట్లకు తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. టెలికం శాఖ నిబంధనలతో ఈ ఆస్తుల అమ్మకంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios