Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక సంక్షోభంలో జీ గ్రూప్... జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటా కొనుగోలుకు సోని ఆసక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర పలు రకాల సుడిగుండంలో చిక్కుకున్నారు. జీ గ్రూపులో వాటాల విక్రయాన్ని ఒక ప్రతికూల శక్తి అడ్డుకున్నదని ఆరోపించిన సుభాష్ చంద్ర.. తన  కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నదని రుణ దాతలకు రాసిన బహిరంగ లేఖలో ఒప్పుకున్నారు. ఇక ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత పరిస్థితి అదుపు తప్పిందని, ఈ పరిస్థితి వచ్చినందుకు బ్యాంకర్లకు, వాటాదార్లకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. అన్ని రుణాలనూ తీరుస్తానని హామీ ఇచ్చారు. 

Subhash Chandra alleges 'negative forces' hampering ZEEL's stake sale
Author
Mumbai, First Published Jan 26, 2019, 1:48 PM IST

ముంబై: కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర అంగీకరించారు. మౌలిక రంగం విషయంలో వేసిన తప్పుడు బిడ్లు కాస్తా.. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత పరిస్థితులు అదుపు తప్పాయని పేర్కొన్నారు. ‘గ్రూప్‌లో దిగ్గజ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో వ్యూహాత్మక వాటా విక్రయంతో నిధులు సమీకరించాలన్న ప్రయత్నాలను ప్రతికూల శక్తి ఒకటి అడ్డుకుంటోంది’అని ఆఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర ఆరోపించారు. 

ఇలా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ప్రకటన‘మా తాత జగన్నాథ్‌ గోయెంకా నుంచి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. రుణదాతలతో ఎపుడూ నేరుగా చర్చిస్తుండాలని.. ఒకవేళ ఏవైనా రుణాలు చెల్లించలేని పరిస్థితి వస్తే ముందుగా ఆ విషయాన్ని వారికి తెలియజేయాలని నాకు చెప్పారు.’ అని అందులో వివరించారు. శుక్రవారం జీ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో సుభాష్‌ చంద్ర ఈ ప్రకటన చేయడం గమనార్హం. 
 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ క్రైసిస్ తర్వాత విషమ పరిస్థితులు
‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత అప్పులను అదుపులోకి తీసుకురావడం క్లిష్టమైంది. డిసెంబర్ వరకు రుణ వాయిదాలన్నీ మా గ్రూప్‌ కట్టగలిగింది. మా బ్యాంకర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్‌లకు క్షమాపణ చెబుతున్నా. నేను అత్యుత్తమంగా ప్రయత్నించినా కూడా.. మీ అంచనాలను అందుకోలేకపోతున్నా’అని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు. 

వీడియోకాన్ ‘డీ2హెచ్’ బిజినెస్ కూడా ఓ కారణం

 ఇక వీడియోకాన్‌ డీ2హెచ్‌ వ్యాపారం కొనుగోలు వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర చెప్పారు. అన్ని బకాయిలను తీరుస్తానని రుణదాతలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే ఎపుడు చెల్లిస్తామో ఇపుడే చెప్పలేనని అందులో పేర్కొన్నారు.వీడియోకాన్ ఆధ్వర్యంలోని డీ2హెచ్ వ్యాపారాన్ని 2016 నవంబర్ నెలలో కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయం 2018 మార్చిలో పూర్తయింది. ఈ నిర్ణయం కూడా ఇబ్బందుల పాలు చేసిందని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర తెలిపారు. అది తన సోదరుడు జవహర్‌ గోయెల్‌కు కలిసివచ్చిందని అన్నారు. కుటుంబ వ్యాపారాల విభజన సమయంలో గ్రూప్‌ కంపెనీలన్నిటి రుణాలను తీసుకోవాలన్న నిర్ణయం కూడా ‘పొరపాటే’నని తెలిపారు. చాలావరకు కొత్త వ్యాపారాలేవీ కలిసిరాక అప్పులు పెరిగాయన్నారు.

గతేడాది జూన్ నుంచే సమస్యలు ఇలా ప్రారంభం
‘2018 జూన్‌ నుంచీ సమస్యలు మొదలయ్యాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌లు, వాటాదార్లకు కొన్ని అజ్ఞాత లేఖలు వెళ్లాయి’ అని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర  ఆరోపించారు. గ్రూప్‌లోని ఏ ఒక్క కంపెనీ కూడా సమస్యలను ఎదుర్కోవడం లేదని, కేవలం ప్రమోటర్లు మాత్రమే వివిధ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

సంస్థల నిర్వహణలో తప్పిదాలకు పాల్పడిన మాట నిజమే
వివిధ సంస్థల నిర్వహణలో కొన్ని తన తప్పులు కూడా ఉన్నాయని, వాటివల్ల ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా విషయంలోనే రూ.4,000-5,000 కోట్ల వరకు నష్టాలను పొందామని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర చెప్పారు. మరికొన్ని మౌలిక కంపెనీల్లోనూ కొన్ని తప్పుడు బిడ్లను వేశామని అంగీకరించారు. 

పరిస్థితుల నుంచి తప్పించుకుని పారిపోబోమని స్పష్టీకరణ 
సాధారణంగా మౌలిక కంపెనీలు చేతులు ఎత్తేసి.. రుణదాతలను నిరర్థక ఆస్తులతో ముంచెత్తుతుంటాయి. కానీ తాము పరిస్థితుల నుంచి పారిపోయే వాళ్లం కాదు. అదే మాకు రూ.4000-5,000 కోట్ల వరకు నష్టాలు వచ్చేలా చేసింని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర వివరించారు.

వ్యవస్థ మద్దతు ఇవ్వాలని ఇలా సుభాష్ చంద్ర అభ్యర్థన
గతేడాది నవంబర్ నుంచీ పోలీసులు, మహారాష్ట్ర హోం మంత్రి, సెబీలకు చాలా ఫిర్యాదులు చేసినా ఏదీ ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు. ‘నేను చెప్పినట్లుగా ప్రతికూల శక్తి నుంచి పలు కృత్రిమ దాడులు జరిగినా.. వాటి నుంచి మాకు రక్షణ లభించలేదు. అయినా మేం వ్యవస్థ మద్దతునే కోరుతున్నాం. ఈ విషయాన్ని కూలంకషంగా దర్యాప్తు చేయాలని అడుగుతున్నాం’అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

‘ఒక వేళ ఏదైనా రుణం విషయంలో గ్రూప్‌ డిఫాల్ట్‌ అయితే దయచేసి రుణదాతలు ఇంకో విధంగా అడుగులు వేయవద్దు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటా విక్రయ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓపికపట్టండి’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘వాటా విక్రయానంతరం మా బకాయిలన్నీ చెల్లించగలం. ఒక వేళ రుణదాతలు మరీ ఎక్కువ ఆందోళన చెందితే అది వాళ్లకు, మాకూ ఇబ్బందేన’ని తెలిపారు. ఏ ప్రమోటర్ కూడా ఎటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ తన ‘మకుటంలోని కలికితురాయి’ (జీ ఎంటర్‌టైన్‌మెంట్‌)ని విక్రయించుకోవాలని భావించడు’ అని వివరించారు. 

సమస్య నుంచి పారిపోను 

‘నా వైపు పొరబాట్లు జరగలేదని చెప్పడం లేదు. అయితే ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నా. సమస్య నుంచి పారిపోవడం లేదు. ప్రతి వ్యక్తికీ, ప్రతి బకాయినీ తీరుస్తా’నని స్పష్టం చేశారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. అన్ని కంపెనీలు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఎటువంటి సమస్యా లేదు’ అని ఆయన అన్నారు. 

ఆ వార్తలపై చట్టపరమైన చర్యలు 

నిత్యాంక్‌ ఇన్‌ఫ్రాపవర్ ‌(ఒకప్పటి డ్రీమ్‌లైన్‌ మ్యాన్‌పవర్‌) పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.3,000 కోట్లకు పైగా డిపాజిట్లు చేసిందన్న విషయమై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్‌ఎఫ్‌ఐఓ) ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. సుభాష్‌ చంద్రకు చెందిన కొన్ని కంపెనీలతో నిత్యాంక్‌ ఇన్‌ఫ్రాపవర్‌, కొన్ని డొల్ల కంపెనీలు 2015-2017 మధ్య ఆర్థిక లావాదేవీలు జరిపాయని ‘ద వైర్‌’ అనే వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.

జీ షేర్ పతనానికి వార్త కథనానికి మధ్య లింక్
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు పతనం వెనక గల కారణాల్లో ఈ కథనం కీలకమని తెలుస్తోంది.‘ది వైర్‌ వెలువరించిన కథనంతో మాకు సంబంధం లేదు. ఇప్పటికే మేం ద వైర్‌ మీడియా గ్రూప్‌పై చట్టబద్ధ చర్యలు తీసుకున్నామ’ని వాటాదార్లతో జరిపిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఎస్సెల్‌ గ్రూప్‌ తెలిపింది. ‘ది వైర్‌’వెలువరచిన కథనంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కానీ, కంపెనీ ప్రమోటర్లకు కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేదని ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ స్పష్టం చేసింది.

‘జీ’ వాటా కొనుగోలు రేసులో సోనీ! 
గతేడాది నవంబర్ నెలలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటాను విక్రయించాలని ప్రమోటర్లు ప్రకటించారు. అయితే ఈ వాటా కొనుగోలు రేసులో సోనీ కార్పొరేషన్‌ చేరినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీన్‌బీసీ-టీవీ18 పేర్కొంది. జీ ప్రమోటర్ ఎస్సెల్‌ గ్రూప్‌తో ఆ మేరకు సోనీ చర్చిస్తోందని ఆ విశ్వసనీయ వర్గాల కథనం. చైనాకు చెందిన టెన్సెంట్‌, అలీబాబా కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌పై ఆసక్తి చూపినట్లు సమాచారం. అమెజాన్‌ కూడా ఈ రేసులో చేరే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో తొలి దశ బిడ్డింగ్‌ జరగవచ్చని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారు పేర్లను బయటకు వెల్లడించలేమని జీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఎస్సెల్ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలు 
ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన పలు నమోదిత కంపెనీల షేర్లు శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో కుదేలయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, జీ మీడియా కార్పొరేషన్‌, డిష్‌ టీవీలు అందులో ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ఒక దశలో 33 శాతం నష్టపోయి రూ.288.95 వద్ద 44 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 26.43% నష్టంతో రూ.319.35 వద్ద ముగిసింది. ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ 16.08% తగ్గి రూ.98.10 వద్ద, జీ మీడియాకార్పొరేషన్‌ 9% నష్టంతో రూ.22.10 వద్ద ముగిసింది. డిష్‌ టీవీ కూడా అదే బాటలో నడిచి 32.74% కోల్పోయి రూ.22.60 వద్దకు చేరింది. గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ విలువ రూ.14,000 కోట్ల మేర తగ్గింది. 

షేరు క్షీణత వెనుక ప్రతికూల శక్తి!
నవంబర్ నెలాఖరులో ఎంటర్‌టైన్‌మెంట్‌లో వ్యూహాత్మక వాటా విక్రయాన్ని ప్రకటించారు. దీని ప్రకారం.. ప్రమోటర్ల వాటా సగానికి తగ్గుతుంది. అయితే ఒక ప్రతికూల శక్తి షేరు ధరను క్షీణింపజేయడం ద్వారా ఆ పనులకు అడ్డుపడుతోందన్నది సుభాష్‌ చంద్ర ఆరోపణ. లండన్‌లో ఇటీవల పెట్టుబడుదార్లతో జరిగిన సమావేశాల్లో ఈ వాటా విక్రయానికి సంబంధించి మంచి ముందడుగు పడింది. అయితే శుక్రవారం ఏకంగా 26% మేర షేర్ ధర కుంగడం విక్రయ ప్రక్రియను అడ్డుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios