Asianet News TeluguAsianet News Telugu

జీవిత కాలం కనిష్టానికి రూపీ: మార్కెట్ విలవిల

అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లతో 2018లో రూపాయి ఒక ఆట ఆడుకుంది.

Rupee tanks 32 paise to hit fresh lifetime low of 74.39
Author
New Delhi, First Published Dec 30, 2018, 11:12 AM IST

న్యూఢిల్లీ: అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లతో 2018లో రూపాయి ఒక ఆట ఆడుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకు క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామాన్ని సృష్టించింది. తొలి ఆరు నెలల్లో 5 శాతం వరకు పతనమైన రూపాయి ఆ తర్వాత విశ్వరూపం చూపింది. 70.. 71.. 72.. 73.. 74. ఇలా విశ్లేషకుల అంచనాలకు అందకుండా రోజుకో రికార్డు కనిష్ఠానికి పడిపోయి కలవరపాటుకు గురిచేసింది. 

ఫలితమివ్వని ఆర్బీఐ నియంత్రణ చర్యలు
రూపాయి పతనం నియంత్రణకు ఆర్బీఐ చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితమివ్వలేదు. అక్టోబర్ నెల తొమ్మిదో తేదీన 74.39 వద్దకు జీవనకాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అక్కడ నుంచి మళ్లీ అంతే వేగంగా రూపాయి కోలుకుంది. ఇప్పుడు 70 స్థాయుల్లో కదలాడుతోంది. ప్రధానంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలరుకు అధిక గిరాకీ, అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం ఆ సమయంలో రూపాయి క్షీణతకు దారితీశాయి. ఇప్పుడు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ రూపాయి తిరిగి పుంజుకోవడం మొదలుపెట్టింది.

రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఇలా ఊరట
ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన ప్రధాన ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్ కు ఈ ఏడాది ఊరటనిచ్చింది. కంపెనీ వ్యాపార పునర్‌ వ్యవస్థీకరణను చేపట్టింది. అప్రాధాన్య వ్యాపారాల విక్రయం, వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. అందరూ ప్రవేశించలేని ఔషధాల మార్కెట్లోకి ప్రవేశించాలని, ప్రతి ఏడాది 5-6 జనరిక్‌ ఔషధాలను అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో పావులు కదిపింది. ఎరేజ్‌ ఇజ్రాయెలి కొత్త సీఓఓగా బాధ్యతలు చేపట్టారు. 

ఇలా రెడ్డీస్.. అరబిందో ముందడుగు
వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రెడ్డీస్ ల్యాబ్స్ హైదరాబాద్‌లోని ఏపీఐ ప్లాంట్‌ను నియోఫార్మాకు, చర్మవ్యాధుల క్లోడెర్మ్‌ క్రీమ్‌ను అమెరికా కంపెనీకి విక్రయించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాంట్ల నవీకరణ చేసే ప్రకియ్రను కొనసాగించింది. ఉన్న మార్కెట్లలో మరిన్ని ఔషధాలను ప్రవేశపెట్టి బలం పుంజుకోవడంతోపాటు యూరప్‌ మార్కెట్‌లో పట్టు సాధించాలనే లక్ష్యంతో అరబిందో ఫార్మా ఈ ఏడాది అడుగులు వేసింది. అమెరికాలోని శాం డోజ్‌ బ్రాండ్‌తో నోవార్టిస్‌ చేస్తున్న వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. కెనడాకు చెందిన అపోటెక్స్‌కు ఉన్న ఐదు యూరప్‌ దేశాల్లోని కార్యకలాపాలను సొంతం చేసుకుంది.

విస్తరణ బాటలో దివిస్
గత ఏడాదిలో యూఎస్ఎఫ్‌డీ తనిఖీలతో ఆటుపోట్లను ఎదుర్కొన్న దివీస్‌ లేబొరేటరీస్‌ 2018లో మళ్లీ వెలుగులో నిలిచింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలను పెంచుకోవడానికి హైదరాబాద్‌, విశాఖపట్నంలోని ప్లాంట్ల విస్తరణకు భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. కోర్టు వివాదాలు పరిష్కారం వంటి సానుకూల అంశాలు నాట్కోను బలోపేతం చేశాయి. కేన్సర్‌ ఔషధాల్లో పట్టున్న ఈ కంపెనీ చైనా మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చైనాలో కేన్సర్‌ రోగులు బాగా పెరగడం.. అక్కడ బహుళ జాతి కంపెనీలు ఔషధాలను ఎక్కువ ధరలకు విక్రయించడం వంటి అంశాలు ఆ మార్కెట్‌పై నాట్కో కన్నేయడానికి ప్రధాన కారణం. మరో లిస్టెడ్‌ కంపెనీ లారస్‌ లాబ్స్‌ అమెరికా మార్కెట్లోకి జనరిక్‌ ఔషధాలను విడుదల చేసే ప్రణాళికను ముమ్మరం చేసింది. బల్గ్‌ డ్రగ్స్‌లో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లారస్‌ లాబ్స్‌ జనరిక్‌ ఔషధాల్లో కూడా పట్టు సాధించాలని యోచిస్తోంది.
 
ఆసక్తికర మలుపుల్లో ఫోర్టిస్‌ అడుగులు
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ నిర్వహణ సంస్థ ఫోర్టిస్‌ విక్రయం ఆసక్తికర మలుపులు తిరిగింది. హాస్పిటళ్లు, డయాగ్నోస్టిక్స్‌ సేవల వ్యాపారాలను మణిపాల్‌కు విక్రయించేందుకు ఫోర్టిస్‌ తొలుత ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ మరిన్ని సంస్థలు ఫోర్టిస్‌ వ్యాపారాల కొనుగోలుకు ఆసక్తి కనబర్చాయి. ముంజాల్‌-బర్మన్స్‌, మణిపాల్‌-టీపీజీ కన్సార్షియంలతోపాటు మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌, రేడియంట్‌ లైఫ్‌ కేర్‌, చైనా సంస్థ ఫోసన్‌ హెల్త్‌ హోల్డింగ్స్‌ పోటీపడ్డాయి. 

ఇలా ఫొర్టిస్ స్వాధీనంపై న్యాయస్థానం స్టే
ఫోర్టిస్ సంస్థ స్వాధీనానికి పోటీ పెరగడంతో ఫోర్టిస్‌ బోర్డు బైండింగ్‌ (విధిగా కట్టుబడి ఉండే) బిడ్లను మాత్రమే పరిశీలిస్తామని షరతు విధించింది. బైండింగ్‌ బిడ్డింగ్‌లో తొలుత ముంజాల్స్‌-బర్మన్స్‌ బిడ్‌కు ఫోర్టిస్‌ బోర్డు సభ్యులు ఓటు వేశారు. కానీ, ఈ బిడ్‌కు ఆమోదించిన ఐదుగురిలో నలుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి వైదొలగాల్సి రావడంతో ఫోర్టిస్‌ టేకోవర్‌ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మరోసారి జరిగిన బిడ్డింగ్‌లో ఐహెచ్‌హెచ్‌ విజేతగా నిలిచింది. సంస్థ మాజీ ప్రమోటర్లైన మాల్విందర్‌, శివీందర్‌ సింగ్‌ సోదరులకు దైచీ శాంక్యోతో నెలకొన్న వివాదం కారణంగా ఫోర్టిస్-ఐహెచ్‌హెచ్‌ మధ్య డీల్‌పై కోర్టు స్టే విధించింది.
 
రుణం భారం తగ్గించుకునే యత్నంలో మౌలిక వసతుల సంస్థలు
మౌలిక వసతుల రంగంలోని కంపెనీలు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను కొనసాగించాయి. ‘అసెట్‌ లైట్‌’ వ్యూహంతో అడుగులు ముందుకు వేశాయి. గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) రోడ్డు ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఎన్‌సీసీ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ఈ రెండు కంపెనీల 2018లో ఆకర్షణీయంగా ఆర్డర్లను సంపాదించగలిగాయి. అప్పుల భారాన్ని మరింతగా తగ్గించుకోవడానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అప్రాధాన్య వ్యాపారాల నుంచి బయటపడే ప్రయత్నం కొనసాగించింది. దేశ, విదేశాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. జీవీకే పవర్‌ సైతం రుణ భారాన్ని తగ్గించుకునేందుకు విమానాశ్రయాల వ్యాపారం ద్వారా కేపిటల్‌ మార్కెట్‌లో నిధులు సమీకరించే ప్రయత్నాలు చేపట్టింది. జీవీకే నవీ ముంబై విమానాశ్రయాన్ని, జీఎంఆర్‌.. గోవా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాయి.
 
రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు కేంద్రంగా హైదరాబాద్
ప్రభుత్వ రంగ రక్షణ పరిశోధన సంస్థలు ఉండడంతోపాటు ఈ రంగానికి విడి పరికరాలను తయారు చేసే చిన్న పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో కొద్ది సంవత్సరాలుగా రక్షణ, ఏరోస్పేస్‌ రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోంది. 2018లో కూడా ఇది కొనసాగింది. తాజాగా అదానీ డిపెన్స్‌ హైదరాబాద్‌లో ఇజ్రాయెల్‌ కంపెనీతో కలిసి అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వేషికల్స్‌ (యూఏవీ) తయారీ కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్‌కే చెందిన ఇంజినీరింగ్‌ సేవల కంపెనీ సైయెంట్‌ ఇజ్రాయెల్‌కే చెందిన బ్లూబర్డ్‌ కంపెనీతో కలిసి యూఏవీ తయారీ విభాగంలోకి అడుగు పెట్టింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కూడా హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ, ఐటీ, మొబైల్‌ తయారీ కంపెనీలు ఇక్కడ ఆర్‌ అండ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 2018లో మొగ్గు చూపాయి. ఇంటెల్‌, ఒప్పో వంటి కంపెనీలు పరిశోధన కేంద్రాలను ప్రారంభించాయి.

ఫ్లిప్‌కార్టును కైవసం చేసుకున్న వాల్‌మార్ట్
ఈ-కామర్స్‌ రంగంలో అతిపెద్ద కొనుగోలు లావాదేవీకి 2018 వేదికగా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను అమెరికా రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ సొంతం చేసుకుంది. ఒప్పందం విలువ 16 బిలియన్‌ డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా లక్ష కోట్లు. ఇప్పటివరకు వాల్‌మార్ట్‌ పెడుతున్న అత్యధిక పెట్టుబడి ఇదే. ప్రస్తుతం భారత ఈ-కామర్స్‌ విభాగంలో అమెరికా సంస్థ అమెజాన్‌దే హవా. ఆ తర్వాతి స్థానం ఫ్లిప్‌కార్ట్‌ది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను దక్కించుకోవడం ద్వారా అమెజాన్‌కు భారత్‌లో గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో వాల్‌మార్ట్‌ ఉంది. అయితే తాజాగా ఈ-కామర్స్‌ సంస్థల డిస్కౌంట్ల జోరుకు ప్రభుత్వం కళ్లెం వేయడంతో ఈ సంస్థల కార్యకలాపాలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు చూడాల్సి ఉంటుంది.

ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం విలువ రూ.90 వేల కోట్లు 
ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం అప్పులు చేసి, ఆ తర్వాత వాటిని చెల్లించడంలో విఫలమవడంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలోకి కూరుకున్నది. మున్ముందు చేయాల్సిన చెల్లింపులకు నిధులు లేకపోవడం ఆ సంస్థ భవితనే సందిగ్ధంలో పడేసింది. దీని ప్రభావం మిగిలిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపైనా పడింది. పరిస్థితి మరింత ముదిరితే మొత్తం వ్యవస్థకే ప్రమాదమని భావించిన ప్రభుత్వం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను గట్టెక్కించేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. కంపెనీని స్వాధీనం చేసుకొని.. మరిన్ని రుణ ఎగవేతలు జరగకుండా ఆపేందుకు ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌కోటక్‌కు బోర్డు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఆరుగురు ప్రభుత్వ నామినీలను నియమించి.. సంస్థ భవిష్యత్‌ కార్యాచరణను వారిచేతిలో పెట్టింది. 

చందాకొచ్చర్ కెరీర్‌పై మాయని మచ్చ ఇలా..
ఐసీఐసీఐ బ్యాంక్‌ను ప్రపంచంలోనే మేటి ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఒకటిగా తీర్చిదిద్దిన చందాకొచ్చర్‌ ఓ మాయనిమచ్చతో ఆ బ్యాంక్‌ను వీడుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ 2018లో జరిగిన ఓ కీలక వాస్తవమిది. వీడియోకాన్‌కు రుణం ఇప్పించి తద్వారా తన భర్త సంస్థకు మరో రూపంలో చందా కొచ్చర్‌ ప్రయోజనం చేకూర్చారనే ఆరోపణలు గుప్పుమనడంతో యావత్తు బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్ఘాంతపోయింది. ఆమె దర్యాప్తును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చందాను తొలుత సమర్థించిన ఐసీఐసీఐ బోర్డు కూడా ఆమెపై మరిన్ని ఆరోపణలు రావడంతో ఒకింత వెనుకడుగు వేసింది. ఆమెను సీఈఓ పదవి నుంచి తప్పించకుండా.. దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవుపై పంపింది. అయితే వాటాదార్ల ఒత్తిడో లేదంటే కొందరి బోర్డు సభ్యుల వ్యతిరేకతో గాని చివరకు ఆమె రాజీనామా చేయక తప్పలేదు. ఆమె స్థానంలో బ్యాంకు  సీఈఓ, ఎండీగా సందీప్‌ భక్షికి బాధ్యతలు అప్పగించేసింది.

ఇలా పెప్సికో నుంచి ఇంద్రా నూయి నిష్క్రమణ 
అమెరికా కార్పొరేట్‌ పరిశ్రమలో భారతీయుల సత్తా చాటిన దిగ్గజం ఇంద్రా నూయీ. పెప్సీకో లాంటి అతిపెద్ద సంస్థకు సారథ్య బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళ. కష్ట సమయంలో పెప్సీకో పగ్గాలు అందుకుని ప్రపంచంలోని మేటి సంస్థగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓ పదవిని నిర్వహించిన ఆమె ఆగస్టులో బాధ్యతల నుంచి వైదొలిగారు.  ఇకనుంచి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నింగికేగిన భారత వ్యాపార ప్రకటనల పితామహుడు అలైక్ పదమ్‌సీ
భారత వ్యాపార ప్రకటనల రంగ పితామహుడిగా పేరొందిన అలైఖ్‌ పదమ్‌సీ మరణించారు. తనదైన సృజనాత్మకతో వినియోగదారుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయే ప్రకటనలకు పదమ్‌సీ రూపశిల్పి అనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా లా.. లాలలలా.. లలలలలా అంటూ జలపాతం కింద సబ్బు రుద్దుకుంటున్న లిరిల్‌ గర్ల్‌ యాడ్‌, హమారా బజాజ్‌ ప్రకటనలను చెప్పుకోవచ్చు. వ్యాపార ప్రకటనలకే ఆయన ఓ బ్రాండ్‌ అయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios