Asianet News TeluguAsianet News Telugu

ఫెడ్ రేట్ల పెంపుతో ‘రూపీ’కి బూస్ట్ @ 69.70

అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడం వల్ల రూపాయి బలోపేతమైంది. గురువారం ఒక్కరోజే 69 పైసలకు పైగా బలపడి 69.70 వద్ద స్థిరపడింది.

Rupee logs big recovery, gains 69 paise to settle below 70 per USD mark
Author
Mumbai, First Published Dec 21, 2018, 9:31 AM IST

ముంబై: భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్‌ ధరలు భారీ పతనం కావడంతోపటు  కరెంట్‌ అకౌంట్‌ లోటుపై తగ్గిన ఆందోళనలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 69 పైసలు రికవరీతో 69.70 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (2.25–2.5 శాతం) పెంచినా కూడా రూపాయి బలపడటానికి ప్రధాన కారణం క్రూడ్‌ ధరలు దిగిరావడమేనని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.

నాలుగు సెషన్లలో 220 పైసలు బలోపేతం
రూపాయి వరుసగా నాలుగు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ రికవరీ అవుతూ వస్తోంది. ఈ రోజుల్లో 220 పైసలు బలపడింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు స్పీడు తగ్గుతుందన్న విశ్లేషణలు అటు డాలర్‌నూ కిందకు నెట్టడం గమనార్హం.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.
   
ఏడాదిన్నర కనిష్టానికి క్రూడ్ ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయి నుంచి 30 డాలర్లకుపైగా కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్చేంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర గురువారం ఒక దశలో 45.83ను తాకింది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది.  

ఈసీబీపై ఆర్బీఐ పరిమితులు 
ఇదిలా ఉండగా, విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) విషయమై ఆర్బీఐ తాజాగా నియంత్రణలు విధించింది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో)లో ఈసీబీల పరిమాణం 6.5 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి ఈసీబీలు 160 బిలియన్‌ డాలర్లు దాటకూడదు. సెప్టెంబర్‌ 30 నాటికి ఈసీబీలు 126 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

స్థిరంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అమెరికా సహా ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా దేశీయ స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఆరంభంలో 200 పాయింట్లు నష్ట పోయినా మిడ్‌సెషన్‌ నుంచి బాగా కోలుకున్నాయి. చివరి గంటలో పుంజుకున్నకొనుగోళ్లతో వరుసగా ఆరవరోజూ కీలక సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 77 పాయింట్లు ఎగిసి 36,347 వద్ద , ఎన్‌ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 10,909 వద్ద ముగిశాయి.  ప్రధానంగా నిప్టీ 10900కి ఎగువకు చేరింది. అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత నిఫ్టి ఇండెక్స్ అత్యధికంగా క్లోజ్ కావడం ఇదే మొదటిసారి. 

మీడియా, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు లాభాల బాటే
ఒక్క మీడియా, ఐటీ  తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో మెటల్‌, ఫార్మా షేర్లు 1.5 - 0.7 శాతం మధ్య పెరిగాయి. కానీ మీడియా 4 శాతం,  ఐటీ సైతం 1 శాతం నష్టపోయాయి. సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంత, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-1.4 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నష్టపోయిన వాటిలో టాపర్స్‌గా నమోదయ్యాయి.  వీటితోపాటు యూపీఎల్‌,టెక్ మహీంద్రా, విప్రో, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఐబీ హౌసింగ్‌ నష్టాల్లో ముగిశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios