Asianet News TeluguAsianet News Telugu

కరంట్ ఖాతా గ్యాప్ మరింత? ఇరాన్‌పై ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్ ఇలా..

ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది. తదుపరి ఏ దేశానికి కూడా మినహాయింపులు ఉండబోవని ట్రంప్ తేల్చేయడంతో ముడి చమురు ధర పెరిగి క్యాడ్ ఆ పై ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Rising crude prices to roil CAD,rupee,inflation metrics:Report
Author
New Delhi, First Published Apr 24, 2019, 11:22 AM IST

న్యూఢిల్లీ/ముంబై: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు అమలులోకి రావడంతో మున్ముందు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఫలితంగా కరంట్ ఖాతా లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పది శాతం ముడి చమురు ధర పెరిగితే కరంట్ ఖాతా లోటు 0.40 శాతం పెరుగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువపై 0.24 శాతం ప్రభావం చూపుతుంది. 

తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రెండు దఫాలుగా వడ్డీరేట్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఇక ముందు ఆ సాహసం చేయకపోవచ్చునని రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి. 

ఇరాన్‌ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే ఏ దేశానికి ఇక నుంచి మినహాయింపులు ఇవ్వబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి భారత్‌ ముడి చమురు దిగుమతులను నిలిపివేయనుంది. 

ట్రంప్‌ ఆంక్షల వల్ల అత్యధికంగా ఇబ్బంది పడే దేశాల్లో చైనా తర్వాత మనమే ఉంటాం. ఎందుకంటే ముడి చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సౌదీ అరేబియా వద్ద ఉన్న మిగులు చమురు నిల్వలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి.

‘మినహాయింపులు ఇవ్వనంత వరకూ ఇరాన్‌ నుంచి భారత్‌ ముడి చమురును కొనుగోలు చేయదు. త్వరలోనే ఆ దేశం నుంచి ఆయిల్‌ దిగుమతిని నిలిపివేస్తాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  ఇరాన్‌ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. 

గత నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2018-19) 24 మిలియన్‌ టన్నుల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. కాగా, అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ‘ఇండియన్‌ రిఫైనరీలకు సరిపడినంత ముడి చమురందించడానికి మా వద్ద తగిన ప్రణాళిక ఉంది. చమురును ఉత్పత్తి చేస్తున్న విదేశాల నుంచి ఆ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటాం. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియన్‌ రిఫైనరీలు అన్నింటికీ సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

మే రెండో తేదీ నుంచి రాయితీలు ఎత్తి వేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందుకు సంబంధించిన ప్రణాళికతోనూ సిద్ధంగా ఉన్నామని పెట్రోలియంశాఖ కూడా ప్రకటించింది. దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌లో 10 శాతం ఇరాన్ నుంచి లభిస్తున్నది. 

ప్రపంచ దేశాల్లో ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, జపాన్, భారత్ ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత భారత్‌తో సహా ఏడు దేశాలకు ఆరునెలల పాటు మినహాయింపులు ఇచ్చింది. మే 2వ తేదీతో ఈ గడువు ముగియనుంది. 

ఈ నేపథ్యంలో ఇక మినహాయింపులు ఇవ్వబోమని ట్రంప్‌ ప్రకటించారు. కాగా, ఇరాన్‌ నుంచి భారత్‌ మినహాయింపులు పొందడానికి నెలకు 1.25 మిలియన్‌ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంది. 2018-19లో ఏకంగా 24మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకుంది. 

2017-18లో ఇది 22.6 మిలియన్‌ టన్నులుగా ఉంది. భారత రిఫైనరీలు ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు పెద్ద స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. 

ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకోకపోవడం ద్వారా ఏర్పడే లోటును భర్తీ చేయడానికి విదేశాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా భర్తీ చేస్తామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. 

ఈ ఏడాదిలో మెక్సికో నుంచి 0.7మిలియన్‌ టన్నులు, సౌదీ అరేబియా నుంచి 2 మిలియన్‌ టన్నులు, కువైట్‌ నుంచి 1.5మిలియన్‌ టన్నులు, యూఏఈ నుంచి మరో మిలియన్‌ టన్ను ముడి చమురును దిగుమతి చేసుకోవచ్చు.

‘ఆయిల్‌ దిగుమతి కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు సులభంగానే లభిస్తుంది. అయితే, ధరలపై ఎంత ప్రభావం చూపుతుందనే మాత్రం ఇప్పుడే చెప్పలేను’ అని ఐఓసీ చైర్మన్ సంజీవ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios