Asianet News TeluguAsianet News Telugu

రూ. 9 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్‌

నూతన ఆర్థిక సంవత్సరం తొలి రోజు స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. బీఎస్ఈ ఇండెక్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ తొలిసారి 39 వేల మార్కును, దాటింది.

RIL touches record high; m-cap inches close to Rs9 lakh crore
Author
Mumbai, First Published Apr 2, 2019, 11:04 AM IST

స్టాక్‌ మార్కెట్లతోపాటు దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రికార్డులు నమోదు చేసే దిశగా సాగుతోంది. సోమవారం బీఎస్ఈలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9 లక్షల కోట్లకు చేరువగా వెళ్లింది. 

అంతర్గత ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్‌ షేర్ రూ.1406.50 గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8.91 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.8,82,061 కోట్లకు తగ్గింది.

ఇంతకు ముందు 2018 ఆగస్టు 23న ఆర్‌ఐఎల్‌ రూ.8 లక్షల మార్కెట్‌ క్యాప్‌ను సాధించింది. కాగా సోమవారం బీఎస్ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 2.09 శాతం లాభంతో రూ.1,391.55 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్ఈలోనూ రెండు శాతం లాభంతో రూ.1,391.85 వద్ద క్లోజైంది.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దూకుడుగా ప్రారంభించాయి. మరో రెండు రోజుల్లో ఆర్‌బీఐ నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి వంటి అంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో జోష్‌ను నింపాయి. 

దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి రోజున (ఏప్రిల్‌ 1) బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ.. ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను తాకి రికార్డులను సృష్టించాయు. సోమవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ అంతర్గత ట్రేడింగ్‌లో తొలిసారి 39 వేల మార్కును అధిగమించగా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 11738 పాయింట్లను తాకింది.

అయితే ఇండెక్స్‌లు ఇంట్రాడేలో సాధించిన ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ ఆరంభంలో 38858.88 పాయింట్ల వద్ద ప్రారంభమై దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి తొలిసారిగా 39115.57 పాయింట్లను తాకింది. 

తర్వాతఅమ్మకాలు వెల్లువెత్తటంతో బీఎస్ఈ ఒక దశలో 38808.74 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఆ తర్వాత కోలుకుని చివరకు 198.96 పాయింట్ల లాభం (0.51 శాతం)తో 38871.87 పాయింట్ల వద్ద క్లోజైంది.

మరోవైపు ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్‌ ప్రారంభమై 11738.10 పాయింట్లను తాకి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై చివరకు 45.25 పాయింట్ల లాభం (0.39 శాతం)తో 11,669.15 పాయింట్ల వద్ద స్థిరపడింది.
 
సోమవారం మార్కెట్లు రికార్డులు సృష్టించటంలో టాటా మోటార్స్‌, వేదాంత, భారతి ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, లార్సన్‌ అండ్‌ టర్బో (ఎల్ అండ్ టీ) కీలకంగా వ్యవహరించాయి.

ఈ కంపెనీల షేర్లన్నీ దాదాపు 7.37 శాతం మేర లాభపడ్డాయి. కాగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, యెస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా షేర్లు కూడా లాభపడ్డ వాటిల్లో ఉన్నాయి.

మరోవైపు నష్టపోయిన షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్స్ ఉన్నాయి. మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం లాభపడగా ఐటీ, టెక్‌, ఇండస్ట్రియల్స్‌, ఎనర్జీ, టెలికాం, ఆటో ఇండెక్స్‌లు మంచి లాభాలను నమోదు చేశాయి. అయితే రియల్టీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఇండెక్స్‌లు మాత్రం నష్టాలను మూటగట్టుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios