Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్‌లో సొంతిల్లు.. ఇదీ ఇండియన్ బిలియనీర్ డిజైర్

వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న దేశం భారత్. అలాగే ఏయేటికాయేడు కుబేరుల జాబితా కూడా పెరుగుతూనే ఉన్నది. అటువంటి కుబేరుల్లో చాలా మంది బ్రిటన్‌లో గానీ, అమెరికాలో గానీ, ఆస్ట్రేలియా, కెనడాల్లో గానీ సొంతిల్లు కొనుగోలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Richest Indians Prefer Buying Properties In US, UK, Says Knight Frank
Author
Hyderabad, First Published Mar 7, 2019, 2:22 PM IST

సంపన్న వర్గాల అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ దేశాల్లో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో ఒక్క వెలుగు వెలుగుతున్న భారత్‌లో కుబేరులు ఏడాది ఏడాదికి అధికం అవుతున్నారు. 

వారిలో ఎక్కువ శాతం మంది బ్రిటన్‌లో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే ఒకటి పేర్కొంది. బ్రిటన్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు 74 శాతం మంది ధనవంతులు,  అమెరికాలో ఇల్లు కొనడానికి 39 శాతం మంది భారత పన్నులు మొగ్గు చూపుతున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తన ‘వెల్త్‌రిపోర్ట్‌-2019’లో తెలిపింది. 

ఆయా దేశాల్లోని సేవల నాణ్యతకు వీరు ఫిదా అయిపోయారని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ పేర్కొన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులను కొనుగోలు చేస్తూ.. అంతర్జాతీయ సంపద సృష్టిలో భారతీయులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారని ఆయన అన్నారు. 

భారతీయ కుబేరులు వ్యాపారం చేయడంతోపాటు ఆస్తులను కొనుగోలు చేసేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా బ్రిటన్‌, అమెరికా వైపు ఆసక్తి చూపుతున్నారు. 79 శాతం మంది ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్‌ను ఎంచుకుంటున్నారు. కొత్త ఇల్లు కొనడానికి 13 శాతం మంది ఆస్ట్రేలియాను, 16 శాతం మంది కెనడాను, 19% మంది సింగపూర్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

తొలి, రెండో ఇంటితోపాటు పెట్టుబడులను పెట్టడానికి ఆస్ట్రేలియా, సింగపూర్‌లను ఎంచుకుంటామని 14% మంది,  కెనడాపై దృష్టి సారిస్తామని 10% ఇండియన్ బిలియనీర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, 2013 నుంచి 2018 మధ్యకాలంలో దేశీయ సంపన్న వర్గాల్లో వృద్ధి 116 శాతం కాగా, వచ్చే ఐదేళ్లలో అంటే 2023 నాటికి ఈ సంఖ్య మరో 39 శాతం పెరుగనున్నారని నైట్ ఫ్రాంక్ సర్వే తెలిపింది. సంఖ్య పరంగా చూస్తే భారత కుబేరుల జాబితాలో మరో 750 మంది జత కానున్నారు. 

ఆసియా దేశాల విషయానికి వస్తే ఈ ప్రాంతంలో శ్రీమంతులు 27 శాతం పెరుగనుండగా, అదే ఉత్తర అమెరికాలో 17 శాతం, యూరప్‌లో 18 శాతం పెరుగనున్నదని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో తెలిపింది. గత ఐదేండ్లలో నమోదైన వృద్ధితో పోలిస్తే మాత్రం స్వల్పమే.

ప్రస్తుత సంవత్సరంలో రాజకీయంగా, ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో కుబేరుల సంపాదనపై ప్రభావం చూపనున్నదని నివేదిక అభిప్రాయపడింది. 2023 నాటికి అంతర్జాతీయంగా ఉన్న పది మంది సంపన్న వర్గాల్లో ఎనిమిది మంది ఆసియా దేశాల నుంచి ఉండనున్నారని పేర్కొంది.

30 మిలియన్ డాలర్ల కంటే అధికంగా వ్యక్తిగతంగా సంపాదించిన వారిని అపర కుబేరులుగా గుర్తించనున్నది నైట్ ఫ్రాంక్. 2018 నుంచి 2023 నాటికి వీరి సంపాదన ఆధారంగా లెక్కిస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసిన సంస్థ..వీటిలో టాప్-10లో ఎనిమిది ఆసియా దేశాలు ఉన్నాయి.

కాగా, భారత్‌లో ప్రస్తుతం 1,947 మంది శ్రీమంతులు ఉండగా, 2023 నాటికి ఈ సంఖ్య 2,697కి చేరుకోనున్నారని నివేదిక అంచనావేస్తున్నది. అంటే 39 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదన్న మాట. ఇతర దేశాలతో పోలిస్తే ఇదే గరిష్ఠ వృద్ధిరేటు కావడం విశేషం. 

భారతదేశంలోని నగరాల విషయానికి వస్తే బెంగళూరులో అపర కుబేరులు మరింత పెరుగనున్నారని పేర్కొంది. ఈ నగర జనాభా ఆధారంగా కుబేరుల సంఖ్యలో 40 శాతం ఎదుగుదల కనిపించనున్నదని తెలిపింది. ప్రపంచ టాప్-5 నగరాల్లో బెంగళూరు ఉండనున్నదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నది. 

ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ ఉండనున్నాయి. ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడటంతో గత సంవత్సరంలో వ్యక్తిగత సంపాదనలో 63 శాతం పెరుగుదల నమోదైందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios