Asianet News TeluguAsianet News Telugu

మా పనిలో మీ జోక్యమేంటి?: కేంద్రంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫైర్

కేంద్రం మా విధుల్లో జోక్యం చేసుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య మండి పడ్డారు. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు నియంత్రణ కష్ట సాధ్యంగా మారిందని పేర్కొన్నారు.
 

Respect Central Bank Independence Or Face Markets' Wrath, Says RBI No. 2
Author
Delhi, First Published Oct 29, 2018, 10:16 AM IST

మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది నరేంద్ర మోదీ సర్కార్ పరిస్థితి. అసలే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పనితీరులో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది.

తాము టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంటే కేంద్రం మాత్రం టీ-20 క్రికెట్ తరహా నిర్ణయాలను తీసుకుంటున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. తద్వారా మరోసారి తెరపైకి ఆర్బీఐ స్వయంప్రతిపత్తి అంశాన్ని తీసుకొచ్చారు.

శుక్రవారం ఇక్కడ ఏడీ ష్రాఫ్ మెమోరియల్ స్మారకోపన్యాసాన్ని ఆచార్య ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదంటూ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఈ తరహా మోసాలకు ఆర్బీఐ వంటి నియంత్రిత సంస్థలు బాధ్యత వహించట్లేదని, రాజకీయ నాయకుల్నే ప్రజలు దోషులుగా చూస్తున్నారని జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు జైట్లీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతీ విదితమే. దీనిపై విఠల్ ఆచార్య స్పందిస్తూ ఆర్బీఐకి అసలు స్వేచ్ఛ ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ కోసం ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సిందేనన్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య మార్పులు, బోర్డుల్లో డైరెక్టర్ల నియామకాలు, లైసెన్సుల రద్దు, విలీనాలు, అమ్మకాల్లో తీర్మానాలు వంటి అంశాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయమై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పరోక్షంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇది కుదరడం లేదని ఆచార్య సంకేతాలిచ్చారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) వ్యవహారంపైనా స్పందిస్తూ పర్యవేక్షణ, నియంత్రిత ప్రమాణాల్లో రాజీ పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని ఎండగట్టారు.

చివరకు ఆర్బీఐ ద్రవ్యవిధాన నిర్ణయాల్లోనూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పేరుతో తలదూర్చడాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏమాత్రం మంచివి కావంటూ ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవించకపోతే ఆర్థిక మార్కెట్లకు కష్టాలు తప్పవన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios