Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కష్టాల్: వన్‌ప్లస్‌తో రిలయన్స్ టై

జియోతో భారతీయ టెలికం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రిలయన్స్.. తాజాగా చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తో జట్టు కట్టింది. దీంతో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్టులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Reliance Jio targets Amazon, Flpkart with OnePlus smartphones; OnePlus 6T to be available on Reliance Digital
Author
Delhi, First Published Oct 24, 2018, 9:35 AM IST

జియో రంగ ప్రవేశంతో దేశీయ టెలికం సంస్థల యాజమాన్యాలకు నిద్రలేని రాత్రిళ్లు మిగిల్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు గట్టి షాకిచ్చింది.

దేశీయంగా విరివిగా అమ్ముడు పోతున్న చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ‘వన్ ప్లస్’తో జత కట్టినట్లు మంగళవారం ప్రకటించింది. గతవారమే జియో దీపావళి ఆఫర్ పేరిట 100 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అంతేకాదు రూ.1699తో రీచార్జి చేసుకునే నూతన కస్టమర్లకు పండుగ సందర్భంగా అన్ లిమిడెడ్ రీచార్జీ ఆఫర్ ప్రకటించింది.  

మరోవైపు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై చైనా మొబైల్‌ తయారీదారు వన్‌ప్లస్‌ కన్నేసింది. అందుకే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ డిజిటల్‌తో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

రిలయన్స్ డిజిటల్ ద్వారా తన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు వన్‌ ప్లస్‌ ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట రిలయన్స్ డిజిటల్  ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వన్‌ప్లస్‌ ఉత్పత్తులు లభ్యమవుతాయి. దేశంలోని  పలు నగరాల్లో రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్ల ద్వారా వన్‌ప్లస్‌ తాజా స్మార్ట్‌ఫోన్‌ 6టీ  ఆవిష్కరణ  ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.  

దేశంలోనే నెంబర్‌వన్‌, అతి వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ రిలయన్స్‌ డిజిటల్‌తో వన్‌ప్లస్ ఒప్పందాన్ని చేసుకుందని రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో  తాజా భాగస్వామ్యంతో  మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు వన్‌ప్లస్‌ ఇండియా జీఎం వికాస్‌ అగర్వాల్‌ ప్రకటించారు. భారతీయ నగరాల్లోని తమ మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోఉండేలా మరిన్ని రిటైల్ టచ్ పాయింట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ వేదికలపైనా కస్టమర్ల దరిని చేరడమే లక్ష్యంగా రిలయన్స్ డిజిటల్ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపారు. రిలయన్స్ డిజిటల్ షోరూముల్లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండటంతో కస్టమర్ల పునాది పెంచుకునేందుకు దోహద పడుతుందని భావిస్తున్నామన్నారు.

వన్‌ ప్లస్‌ సంస‍్థతో భాగస్వామ్యం పట్ల రిలయన్స్ డిజిటల్ సంస్థ సీఈవో  బ్రయాన్ బేడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ స్టోర్లలో కస్టమర్లకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తామని  తద్వారా లైవ్‌ డెమోతోపాటు, కస‍్టమర్లు తమ సందేహాలను తమ సిబ్బంది ద్వారా పత్యక్షంగా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.

న్యూయార్క్‌లో ఈ నెల 29 వ తేదీ వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభానికి ముందు ఈ భాగస్వామ్య ప్రకటన రావడం విశేషం.  అలాగే అక్టోబర్ 30 న న్యూఢిల్లీలో లాంచ్‌ చేయనుంది. ఇప్పటివరకు  టాటా గ్రూపునకు చెందిన  క్రోమా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యే వన్‌ప్లస్‌స్మార్ట్‌ఫోన్లు ఇపుడు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ నెలాఖరులో విపణిలో అడుగు పెట్టనున్న వన్‌ప్లస్‌ 6టీ ఫోన్లు ప్రధానంగా ‘6.4 అంగుళాల డిస్‌ప్లే , 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 3700ఎంఏహెచ్‌ బ్యాటరీ’ సామర్థ్యం గల  ప్రధాన ఫీచర్లు కలిగి ఉంటాయి.  భారతదేశంలో సదరు వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ ధర రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios