Asianet News TeluguAsianet News Telugu

రికార్డుల రారాజు రిలయన్స్.. ప్రాఫిట్స్ @ రూ.11,262 కోట్లు


కార్పోరేట్ రంగంలో రిలయన్స్ రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 18 శాతం పురోగతి సాధించి రూ.11,262 కోట్ల నికర లాభం సాధించారు. 2012-13లో చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థ గడించిన రూ.14,512.81 కోట్ల లాభం తర్వాత తాజాగా రిలయన్స్ సాధించిన లాభాలే గరిష్టంగా నిలిచాయి.

Reliance Industries Q2 net profit jumps 18 percent to arecord 11crore
Author
Hyderabad, First Published Oct 19, 2019, 10:36 AM IST

కార్పొరేట్ రంగంలో రిలయన్స్ ప్రభంజనం కొనసాగుతున్నది. దేశంలో అత్యంత విలువైన సంస్థగా రికార్డు సృష్టించిన రిలయన్స్.. అటు ఆర్థిక ఫలితాల్లోనూ మరో శిఖరాగ్రానికి చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ రూ.11,262 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పెట్రోకెమికల్, రిఫైనింగ్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబరిచినా రిటైల్, టెలికం రంగాల ఇచ్చిన దన్నుతో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసుకున్నది. 

చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీ గత త్రైమాసికంలో ఒక్కో షేర్‌పై రూ.18.6 ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,516 కోట్లు లేదా ప్రతిషేర్‌కు రూ.16.1 నమోదైంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించిన సంస్థ రిలయన్సే కావడం విశేషం.

ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) జనవరి-మార్చి 2013లో రూ.14,512.81 కోట్ల లాభాన్ని గడించింది. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి ప్రాఫిట్. గత త్రైమాసికంలో సంస్థ రూ.9,702 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసుకున్నది. రూ.1,63,854 కోట్ల ఆదాయం గడించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయంలో 4.8 శాతం పెరుగుదల కనిపించింది. 
సమీక్షాకాలంలో 337 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయగా, 2.4 కోట్ల మంది వినియోగదారులు జియో నెట్‌వర్క్ పరిధిలోకి రావడం లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకోవడానికి దోహదపడింది. సంప్రదాయక చమురు రిఫైనింగ్, పెట్రోకెమికల్ బిజినెస్‌లు బలహీనా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం విశేషం. కంపెనీకి వచ్చిన మొత్తం లాభంలో రిటైల్, టెలికం రంగాల వాటా రెండింట మూడోవంతు. 

పెట్రోకెమికల్ వ్యాపారం ద్వారా నికర లాభం 6.4% తగ్గి రూ.7,602 కోట్లకు పడి పోయింది. ఇంధన ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణం. వరుసగా 6 త్రైమాసికాలుగా వృద్ధిని నమోదు చేసుకున్న ప్రపంచంలో అతిపెద్ద చమురు క్షేత్రం ఈసారి నిరాశపరిచింది. పన్ను చెల్లించకముందు ఈ విభాగం 7 శాతం పడిపోయి రూ.4,957 కోట్లకు జారుకున్నది.

ప్రతి బ్యారెల్‌ ముడి చమురు శుద్ది చేయడం ద్వారా సంస్థ 9.4 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది రిలయన్స్. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వచ్చిన 8.1 డాలర్లతో పోలిస్తే అధికం కాగా, క్రితం ఏడాది వచ్చిన 9.5 డాలర్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.

గత త్రైమాసికంలో సంస్థ 16.7 మిలియన్ టన్నుల ముడి చమురు వెలికితీసింది. ఏడాది క్రితం 17.7 మిలియన్ టన్నులుగా ఉన్నది. చమురు నుంచి కన్జ్యూమర్ బిజినెస్‌లో వాటాను సౌదీ అరామ్‌కోకు విక్రయించింది. ఒప్పందం విలువ 75 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం వచ్చే ఏడాది పూర్తికానున్నది.

సెప్టెంబర్ 30 నాటికి రిలయన్స్ సంస్థకు రూ.2,91,982 కోట్ల స్థాయిలో అప్పు ఉన్నది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న రూ.288,243 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గత త్రైమాసికంలో 337 రిటైల్ ఔట్‌లెట్లు సంస్థ ప్రారంభించింది. 

దీంతో మొత్తం రిలయన్స్ స్టోర్ల సంఖ్య 10,901కు చేరుకున్నాయి. సంస్థ నిర్వహిస్తున్న రిటైల్ ఔట్‌లెట్లలో రెండింట మూడోవంతు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం గమనార్హం. రిలయన్స్ రిటైల్ 200వ స్మార్ట్ స్టోర్‌ను ప్రారంభించగా, వీటిలో 100 స్టోర్లు ఉన్నాయి.

రిలయన్స్ రిటైల్ కూడా విశ్లేషకుల అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో రిటైల్ పన్నులు చెల్లించకముందు రూ.2,322 కోట్ల లాభాన్ని గడించింది. స్టోర్ల ఉత్పాదకత అధికమవడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగవడం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు కారణమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

గత ఏడాది ఇదే సమయంలో రిలయన్స్ రిటైల్ లాభాం రూ.1,392 కోట్లుగా ఉన్నది. గత త్రైమాసికంలో రిటైల్ రంగ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27.02% ఎగబాకి రూ.41,202 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.32,436 కోట్లుగా ఉన్నది. ఒక విభాగంలో రూ.40 వేల కోట్ల మైలురాయికి చేరుకోవడం ఎంతో సంతోషమని పేర్కొంది. 

ఆర్‌ఐఎల్ జాయింట్ సీఎఫ్‌వో శ్రీకాంత్ మాట్లాడుతూ..రిటైల్ రంగాన్ని శరవేగంగా విస్తరించడానికి గత త్రైమాసికంలో రూ.2 వేల కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు, దీంతో వ్యాపారం భారీ వృద్ధిని సాధించిందన్నారు. ఆర్థిక మాంద్యం చాయలు ఇతర దేశాలపై ఉన్నా రిటైల్ రంగంపై పెద్దగా ప్రభావం లేదని వ్యాఖ్యానించారు.

ఆర్థిక ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మరో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగలిగాం. చమురు నుంచి కెమికల్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో నమోదవడం, వీటికితోడు కన్జ్యూమర్ బిజినెస్ రాణించడం ఇందుకు దోహదం చేసింది. రిటైల్ రంగం నిరాటంకంగా కొనసాగుతున్నది’ అని తెలిపారు. 

‘వినియోగదారులకు అత్యంత విలువైన ఉత్పత్తిని అందించడానికి సంస్థ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నది. దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా జియో అవతరించింది. 4జీ సబ్‌స్ర్కైబర్లు, 4జీ డాటా టారిఫ్‌లో జియోకు అత్యధిక మార్కెట్ వాటా ఉన్నది. బ్రాడ్‌బ్యాండ్ చరిత్రను తిరగరాసిన జియో..త్వరలో ఫైబర్ సేవలను అందుబాటులోకి తేనున్నాం’ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios