Asianet News TeluguAsianet News Telugu

మాల్యాజీ!! అసలు సరే.. అంతేమొత్తం వడ్డీ మాటేమిటి?!!

దాదాపు అసలు వడ్డీ కలిపి రూ.14 వేల కోట్లు ఉన్న రుణాల్లో అసలు చెల్లించేందుకు ముందుకు వచ్చిన విజయ్ మాల్యా వడ్డీ ఊసెత్తడం లేదు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణ బకాయిలు చెల్లించలేక, అరెస్ట్ చేస్తారని భయంతో లండన్ పారిపోయారు. అక్కడ కూడా ఒక మనీ లాండరింగ్ కేసులో అరెస్టైనా వెంటనే బెయిల్ లభించింది. తాజాగా ఆగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో మధ్యవర్తి మైకెల్ ను భారత్ కు రప్పించడంతో తన పరిస్థితేమిటో మాల్యాకు అర్థమైనట్లు కనిపిస్తున్నది. అందుకే అసలు చెల్లిస్తా.. అని వేడుకుంటున్నా.. అసలుతో సమానంగా పెరిగిన వడ్డీ మాట ట్వీట్ల వర్షంలో బయటపెట్టకపోవడం మాల్యా తీరేమిటో అవగతమవుతోంది.

Ready to pay back 100 %: Mallya wonders why his offer not being accepted
Author
New Delhi, First Published Dec 6, 2018, 11:03 AM IST

న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అప్పుల్లో అసలు తీర్చేసేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని నూటికి నూరు శాతం చెల్లించేస్తానని ట్వీట్ల వర్షం కురిపించారు. ‘ఈ అంశం ముఖ్యంగా ప్రజాధనంతో ముడిపడి ఉంది. పెరిగిపోతున్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నష్టాలను తట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కుమ్మరించాల్సి వచ్చింది. రుణంలో అసలు 100 శాతం తిరిగి చెల్లించేస్తానని బ్యాంకులు, ప్రభుత్వానికి ఆఫర్‌ చేస్తున్నాను. దయచేసి తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి నిరాకరిస్తే ఎందుకు కారణాలైనా తెలపాలి’ అని ఆయన పేర్కొన్నారు. 

రాజకీయ పార్టీలు, మీడియా తనపై కావాలనే ‘డిఫాల్టర్‌’ అనే తప్పుడు ముద్ర వేశాయని మాల్యా ఆక్రోశం వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌(57)ను దుబాయ్ నుంచి భారతదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసులో ఈ నెల 10వ తేదీన లండన్‌ కోర్టు తీర్పు వెలువరించనున్నది. దీనిలో కూడా మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చునని భావిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే ఆయనను భారతదేశానికి తీసుకొచ్చేందుకు ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలును కూడా సిద్ధం చేసిన వీడియోను అధికారులు లండన్ న్యాయస్థానానికి సమర్పించారు. 

రుణాలు మొత్తం చెల్లిస్తానని  మాల్యా  ప్రకటించడం ఇదే తొలిసారికాదు. బ్యాంకులు ఈ ప్రతిపాదనను నిరాకరించాయి కూడా. వేలకోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి  తేవడానికి కేంద్రం చర్యల్ని వేగవంతం చేయడంతో మాల్యా గుండెల్లో గుబులు మొదలైనట్టుందని  బిజినెస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించక పోగా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో 2016లో మాల్యా దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. 

అతడిపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదవడంతో గతేడాది లండన్‌ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై లండన్‌లో ఉన్నారు. కాగా, ఈ ఏడాది మొదట్లో కర్ణాటక హైకోర్టు ఎదుట యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీ) సంస్థ మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. దాదాపు రూ.13,900 కోట్లు విలువైన యూబీ ఆస్తులను ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయించి రుణాలు చెల్లిస్తానని ప్రతిపాదించాడు. కానీ హైకోర్టు మాత్రం ఎస్‌బీఐకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానన్న మాల్య ఇంచుమించు అసలుతో సమానంగా ఉన్న వడ్డీ సంగతిని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చానని, దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదని మాల్యా ట్వీట్‌ చేశారు. 

‘విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. చాలా నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్నాం. కానీ నేను తీసుకున్న అసలు మొత్తాన్ని మాత్రం పూర్తిగా చెల్లిస్తానని చెబుతున్నా. దయచేసి తీసుకోండి’ అని పేర్కొన్నారు.

యునైటెడ్‌ బ్రూవరీస్‌ మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొందింది. దేశ ఖజానాకు రూ.వేల కోట్లు చెల్లించామని, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించామని, బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయని మాల్యా చెప్పుకొచ్చారు. విజయ్‌ మాల్యా 2016లో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని న్యాయస్థానాల వద్ద ప్రతిపాదించారు. 

అప్పట్లో భారతీయ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న రుణాల మొత్తం కంటే ఇది చాలా తక్కువ. బ్యాంకర్ల కన్సార్టియం మాత్రం రూ.4,900 కోట్లు చెల్లిస్తే అసలు వస్తుందని అప్పట్లో తెలిపింది. కానీ మాల్యా రూ.2,000 కోట్లు ఒకసారి, మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం మరోసారి చెల్లిస్తానని చెప్పారు. అప్పటికే మాల్యా చెల్లించాల్సిన మొత్తం వడ్డీలతో సహా కలిపి దాదాపు రూ.9,000 కోట్లు వరకు ఉంటుంది. అంటే మిగిలిన రూ.5,000 కోట్లను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios