Asianet News TeluguAsianet News Telugu

సెక్షన్ 7పై కినుక: తప్పుకోనున్న ఉర్జిత్..19న గుడ్ బై?

ద్రవ్య నియంత్రణకే మొగ్గు చూపుతున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కినుక వహించారని తెలుస్తోంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ‘సెక్షన్ 7’ను కేంద్రం ముందుకు తేవడంతో వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నియంత్రణ లేకపోగా, ద్రవ్య నియంత్రణ చర్యలు పాటించడం కేంద్రానికి కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన జరిగే బోర్డు భేటీ తర్వాత ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ గా వైదొలగనున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

RBI board to meet on 19 November to discuss key issues
Author
New Delhi, First Published Nov 1, 2018, 10:35 AM IST

న్యూఢిల్లీ/ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ కినుక వహించారా? వైదొలిగేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే జవాబులే అనేకం వినిపిస్తున్నాయి. స్వయంప్రతిపత్తి, ద్రవ్యవిధానాల్లో స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలూ వీటిని బలపరుస్తున్నాయి. మొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యలు, నిన్న సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలతో ఆర్బీఐ-కేంద్రం మధ్య వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పటేల్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. బుధవారం ఫారెక్స్, బాండ్ మార్కెట్లలో ఈ వార్తలు ప్రకంపనల్నీ సృష్టించాయి. మరోవైపు ఈ నెల 19వ తేదీన ఆర్బీఐ బోర్డు సమావేశం తర్వాత తన గవర్నర్ హోదాకు ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

ద్రవ్య వ్యవస్థకు కీలకం ఆర్బీఐ
దేశంలోని వివిధ రంగాల నియంత్రిత వ్యవస్థల మాదిరిగానే బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ. అంతేకాదు కీలకమైన ద్రవ్యవ్యవస్థకు ఆర్బీఐ మూలాధారం కావడంతో మిగతా నియంత్రణ సంస్థలకు ఇది భిన్నం. దేశ ఆర్థిక స్థిరత్వానికి చుక్కానిలా వ్యవహరించే ఆర్బీఐకి ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. అందుకే ఆర్బీఐకి స్వయంప్రతిపత్తి, ద్రవ్యవిధానాల్లో స్వేచ్ఛ. అయితే ఈ రెండింటిలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదని ఆర్బీఐ ఆవేదన. కానీ ఆర్థిక వృద్ధికి ఆర్బీఐ నిర్ణయాలు దోహదం చేయడం లేదని, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణాలోపమే కారణమని ప్రభుత్వ వాదన. 

పటేల్‌లో గూడు కట్టుకున్న అసంతృప్తి 
ప్రభుత్వ తీరుపై విరల్ ఆచార్య బాహాటంగానే విమర్శలు చేయడం, ఆచార్యకు మద్దతుగా ఆర్బీఐ ఉద్యోగుల సంఘం నోరెత్తడం, అరుణ్ జైట్లీ ప్రతి విమర్శలకు దిగడం ఊర్జిత్ పటేల్‌లో ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తిని తారాస్థాయికి చేర్చాయి. మొండి బకాయిలకు కారణం ఆర్బీఐనేనని, బ్యాంకులు ఇష్టారాజ్యంగా రుణాలు ఇస్తున్నా పట్టించుకోలేదని జైట్లీ విమర్శించిన విషయం తెలిసిందే. అసలే ఆర్బీఐని కేంద్రం నీరుగారుస్తుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

సెక్షన్ 7 ప్రస్తావన ఆర్బీఐ నియంత్రణ కోసమేనా?
ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను మోదీ సర్కార్ తెరపైకి తేవటం ఆర్బీఐని నిర్వీర్యం చేసే కుట్రేనన్న వాదనకు బలం చేకూరుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ సెక్షన్ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. ప్రధానంగా సెక్షన్ 7పై చర్చతోనే పటేల్ రాజీనామా యోచనలో ఉన్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. 

కేంద్రానికి నచ్చని పటేల్ వైఖరి 
గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ వైఖరి నచ్చకే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అధికారాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. యూపీఏ హయాంలోని రఘురామ్ రాజన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా పటేల్‌ను తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఆయనతోనూ అభిప్రాయ భేదాలను ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం అదుపునకే పటేల్ పెద్దపీట వేయడం, రెపో రేటును తగ్గించకపోవడం, భారీ మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించడం కేంద్రానికి నచ్చడం లేదు.

ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధానంగా వడ్డీరేట్లు ఖరారు నచ్చని కేంద్రం
కొత్త రుణాల మంజూరులో బ్యాంకులకు కళ్లెం వేయడం వంటివి కేంద్ర ప్రభుత్వంపై వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఒత్తిళ్లను పెంచుతున్నాయి. కీలక వడ్డీరేట్లను తగ్గించాలని ఎన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి విజ్ఞప్తులు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం మధ్య బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాల్ని ఇప్పించేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డంకిగా మారాయి.

ఇలా పటేల్ పాత్ర నామమాత్రం చేసే వ్యూహం
విద్యుత్, నిర్మాణ, ఉక్కు రంగాల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలకు దన్నుగా నిలువాలన్నా ఇదే సమస్య. దీంతోనే పటేల్‌ను నామమాత్రం చేసేందుకు సెక్షన్ 7పై కేంద్రం కన్నేసిందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)తో వడ్డీరేట్ల నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకుంటున్న సంగతి విదితమే. ఇప్పుడు సెక్షన్ 7ను ప్రయోగించాలనుకుంటుండగా, వాస్తవానికి దీనితోనే ఆర్బీఐ గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్లు, డైరెక్టర్లను తొలగించే అధికారం కేంద్రానికి దక్కడం గమనార్హం.

మొండి బాకీల వివరాలు ఆర్టీఐ ద్వారా వెల్లడించలేమన్న పీఎంఓ
బ్యాంకుల్లో మొండి బకాయిల అంచనాపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పార్లమెంట్ కమిటీకి అందించిన వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తెలుపలేమని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పష్టం చేసింది. నిజానికి 2005 ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) పరిధిలోకి ఈ అంశం రాదంటూనే పిటిషనర్‌కు పీఎంవోలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీపీఐవో) ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. అంతేకాదు ఈ రకమైన సమాచారం అడుగడం తగదని ప్రవీణ్ కుమార్ హెచ్చరించడం గమనార్హం.


రాజద్రోహమే: రాహుల్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను వాడుకునే అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏం వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నిలదీసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న చేదు నిజాలను, ఇబ్బందులను మరుగున పెట్టాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. భారతీయ సంస్థలను ఈ రకంగా వ్యవస్థీకృత విధ్వంసం చేయడం రాజద్రోహానికన్నా తక్కువేం కాదు అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 

ఆర్బీఐ నిర్వీర్యానికి కుట్రేనన్న చిదంబరం 
ఆర్బీఐని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్రంపై విరుచుకుపడ్డా రు. సెక్షన్ 7 చర్చ ఆమోదయో గ్యం కాదని, మోదీ సర్కారు నియంతృత్వ పోకడకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. 1991, 1997, 2008, 2013ల్లో విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ ఈ దిశగా వెళ్లలేదన్న ఆయన మునుపెన్నడూ లేని ఓ నిరంకుశ ధోరణిని ఆర్బీఐ విషయంలో నేటి కేంద్ర ప్రభుత్వం కనబరుస్తుండటం నిజంగా ఆందోళనకరంగా ఉందన్నారు.

సంస్థల స్వయం ప్రతిపత్తిని సర్కార్ దెబ్బతీస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు నాశనం చేస్తున్నదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios