Asianet News TeluguAsianet News Telugu

రుణమాఫీ వద్దేవద్దు.. వ్యవస్థకు చేటన్న రాజన్

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పంట రుణాలను మాఫీ చేస్తామన్న హామీలు ఇవ్వొద్దని, ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సహా 13 మంది పెదవి విరిచారు. ఆర్థిక మండలి ఏర్పాటుతోపాటు మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలకు సూచిస్తూ ఒక దార్శనిక పత్రం రూపొందించారు. 

Raghuram Rajan seeks abolition of farm loan waivers from election manifestos
Author
New Delhi, First Published Dec 15, 2018, 12:38 PM IST

న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా అధికమవుతున్న ఆర్థిక సవాళ్ల పరిష్కారానికి ముందస్తు ప్రణాళిక అవసరమని..  ప్రత్యేకించి పంట రుణ మాఫీ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా పులువురు ఆర్థికవేత్తలు సూచించారు. గత ఐదేళ్లలో ఆర్థిక స్థితి మెరుగు పడిందేమీ లేదన్నారు.2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రఘురాం రాజన్‌తోపాటు  అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన, హార్వార్డ్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు గీతా గోపీనాధ్‌ సహా 13 మంది ఆర్థికవేత్తలు, దేశీయ అవసరాలను వివరిస్తూ ఆర్థిక దార్శనిక పత్రం రూపొందించారు. తాము రూపొందించిన దార్శనిక పత్రం ఆధారంగా రాజకీయ పార్టీలు వాటి పరిష్కారానికి తమదైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, మౌలిక వసతులు, విదేశీ వ్యవహారాలు, వ్యవసాయం, ఇంధనం, భూ సంస్కరణలు, పేదరిక నిర్మూలన పథకాలు, విద్య, ఆర్థిక రంగం, అభివృద్ధి, ఆర్థికవ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగాలపై ఆర్థికవేత్తలు ఇచ్చిన సూచనలివీ..

ఒక్క ఉద్యోగానికి 277 మంది పోటీ  
దేశంలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు, తగినన్ని ఉద్యోగాలు సృష్టించేంతగా వృద్ధి లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. 90,000 రైల్వే ఉద్యోగాలకు 2.5 కోట్ల మంది దరఖాస్తు చేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అవి కూడా తక్కువ స్థాయి ఉద్యోగాలని, మరిన్ని ఉద్యోగాల కల్పన జరగాల్సి ఉందని, దేశం వృద్ధి చెందుతున్నా అన్ని రంగాలు, ప్రజలకు దీనివల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని పేర్కొన్నారు. 

బ్యాంకింగ్‌కు ఆదేశాలతోపాటునిధులివ్వాలి 
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లపై దీర్ఘకాల ప్రభావం చూపే ఆదేశాలను కేంద్రప్రభుత్వం ఇస్తోంది కానీ, వాటి వల్ల పడే ఆర్థికభారానికి పరిహారం ఇవ్వడం లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఏదైనా పథకం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తే, దానికి బడ్జెట్‌ నుంచే నిధులు కేటాయించి, అన్ని బ్యాంకులు అమలు చేసేలా చూడాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించా. రుణ లక్ష్యాలు తప్పనిసరిగా చేయాలనే ఆదేశాలు పీఎస్బీలకు ప్రమాదకరం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. 

ఇలా మొండి బాకీల పెరుగుదల ముప్పు
లక్ష్యాలు సాధించేందుకు, తగినంత పరిశీలన చేయకుండా/జాగ్రత్తలు తీసుకోకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని గుర్తు చేశారు. దీనివల్ల మొండి బాకీలు మరింత పెరిగే ప్రమాదముంది. ఈ సమస్యలన్నీ పీఎస్‌బీల ప్రైవేటీకరణ వల్లే తీరవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను బ్యాంక్‌ శాఖల ద్వారా అమలు చేయాలనుకోవడం సరికాన్నారు. బ్యాంకులు తమ నిధులను ప్రభుత్వబాండ్లలో తప్పనిసరిగా ఉంచాల్సిన వాటానే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)ని, తగ్గించాలని బ్యాంకుల బోర్డుల్లో వృత్తి నిపుణులు పెరగాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రాజకీయాలు నివారించేందుకు బోర్డుల నియామకాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. .

మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు గృహ నిర్మాణదార్లను అనుమతించాలి 
బ్యాంకులు గృహనిర్మాణదార్లకు నేరుగా రుణాలివ్వడం లేదని, దానికి బదులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)కు ఇస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అవి డెవలపర్లకు రుణాలిస్తున్నాయని, పరోక్షంగా బ్యాంకులే నిధులిస్తున్నాయని గుర్తు చేశారు. డెవలపర్లు తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకులపై భారం పడుతుంది. ఇది నివారించాలంటే, మార్కెట్ల నుంచి నేరుగా నిధులు సమీకరించే అవకాశం ఎన్‌బీఎఫ్‌సీలకు కల్పించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. 

రుణమాఫీలు ఎన్నికల హామీ కాకూడదు 
రైతు రుణమాఫీలు ఎన్నికల వాగ్ధానం కాకుండా చూడాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం తీసుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.  గత అయిదేళ్లలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఏదొక పార్టీ రుణమాఫీ హామీ ఇస్తోందని, రుణమాఫీల వల్ల పొలాలపై పెట్టుబడులు తగ్గిపోతాయని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతోంాన్నారు. రుణమాఫీల వల్ల కొందరు రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని గుర్తించి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చేద్దామనే ఆలోచనకు ఇవి గండికొడుతున్నాయని సాగు కష్టాల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని రఘురామ్ రాజన్ వివరించారు.

పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే
ఇప్పటికే నగరాలలో వాతావరణం పూర్తిగా కలుషితమైందని, ప్రస్తుత వృద్ధిరేటుకు రెట్టింపు సాధించాలనుకుంటే, నగరాలు మరెంత విషపూరితం అవుతాయో. పర్యావరణ పరిరక్షణపై అధికంగా పనిచేయాలని రఘురామ్ రాజన్ తెలిపారు. సామర్థ్యాలను పెంచుకుంటూనే, ప్రపంచ పౌరులగా ప్రవర్తించాలి. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ముందు నడవాలన్నారు.

ఆర్థిక మండలిని నెలకొల్పాల్సిందే
ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ రివ్యూ కమిటీ 2017 జనవరిలో సూచించినట్లు ఆర్థిక మండలి నెలకొల్పాలని గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రాచీ మిశ్రా సూచించారు. రాష్ట్రాల్లో ద్రవ్యలోటు పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని తెలిపారు వాస్తవ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై ప్రభావం చూపేది ఏకీకృత ద్రవ్యలోటేనని ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు, కేంద్ర-రాష్ట్రాల్లోని సార్వభౌమ అధికారం వహించేవారే బాధ్యులు కావాలని గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రాచీ మిశ్రా వివరించారు. 

ఎస్ఎల్ఆర్ నిష్పత్తి తగ్గించాలి
చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)ను తగ్గించాల్సి ఉందని కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఈశ్వర్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనివల్లే బ్యాంకులు కార్పొరేట్‌ బాండ్లు అధికంగా కలిగి ఉంటున్నాయని, ఎస్‌ఎల్‌ఆర్‌ను సాధ్యమైనంతగా తగ్గించేందుకు, మధ్యంతర ప్రణాళిక అవసరం అని ఇందువల్ల బాండ్‌ మార్కెట్లలో ద్రవ్య లభ్యతకు బ్యాంకులు మరింత సన్నద్ధమవుతాయని, ఇందువల్ల బ్యాంకు రుణాలు, ద్రవ్యలోటుల వల్ల ఏర్పడే ఆర్థిక వ్యవస్థ వక్రీకరణలు పరిమితం అవుతాయి. బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచాలని కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఈశ్వర్‌ ప్రసాద్‌ తెలిపారు. 

ప్రాథమిక హక్కుగా విద్య హక్కు విఫలం
విద్యను పొందడం ప్రాథమిక హక్కుగా చేయాలన్న ఆశయం, పూర్తిగా విఫలమైందని  యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కార్తీక్‌ మురళీ ధరన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.. కావాల్సింది ఎంపిక చేసుకునేందుకు మాత్రమే భారత విద్యారంగం పరిమితం అవుతోంది కానీ, మానవ అభివృద్ధికి ఉపయోగ పడటం లేని, అందువల్ల దీన్ని వడపోతగా మాత్రమే పేర్కొనవచ్చునన్నారు. ఇంకా  మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆచార్యులు అభిజిత్‌ బెనర్జీ, హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్‌ భండారి, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ బ్యాంక్ భారత ముఖ్య ఆర్థిక వేత్త సజ్జిద్‌ చినాయ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఆచార్యులు మైత్రీశ్‌ ఘాతక్,  యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా ఆచార్యులు అమర్త్య లహిరి, క్రెడిట్‌ సూయిజ్ భారత ఆర్థికవేత్త నిలకాంత్‌ మిశ్రా, హార్వార్డ్‌ యూనివర్సిటీ ఆచార్యులు రిహిణీ పాండే, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆచార్యులు ఇ.సోమనాధన్ ఈ దార్శనిక పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios