Asianet News TeluguAsianet News Telugu

గల్ఫ్‌లో కల్లోలం:ఒపెక్‌కు ఖతార్ గుడ్‌బై.. సౌదీ+ పొరుగుతో విభేదాలే

వచ్చే ఏడాది జనవరి నుంచి ఒపెక్ నుంచి వైదొలుగనున్నట్లు ఖతార్ ప్రకటించింది. సౌదీ అరేబియా ఆధిపత్యంలో నడుస్తున్న చమురు కార్టెల్ కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు ఉత్పత్తి పెంచేందుకు ఖతార్ నిర్ణయం తీసుకోనున్నది. దీనికి సౌదీ అరేబియా, ఇతర పొరుగు దేశాలతో ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది.

Qatar says it will leave OPEC and focus on natural gas
Author
Dubai - United Arab Emirates, First Published Dec 4, 2018, 12:20 PM IST

దుబాయి: వచ్చే ఏడాది నుంచి చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నుంచి వైదొలుగుతున్నట్టు ఖతార్ ప్రకటించింది. సౌదీ అరేబియా ఆధిపత్యంలో నడుస్తున్న చమురు కార్టెల్ సృష్టిస్తున్న అడ్డంకులను తోసిరాజని, తమ దేశ ఆకాంక్షలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి సాద్ షెరిదా అల్ కాబీ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. సౌదీ అరేబియాతోపాటు పొరుగు దేశాలతో గల రాజకీయ విబేధాలు ముదిరిపోవడం వల్లే ఖతార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ఈజిప్టు, సౌదీ అరేబియా రాజకీయార్థిక సంబంధాలను తెంచేసుకున్నాయి. దీంతో చమురు మార్కెట్ మరింత వేడెక్కనున్నది.

నాలుగు శాతం పెరిగిన బ్రెంట్ ఆయిల్ ధర
సోమవారం చమురు మార్కెట్ ప్రారంభంలోనే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర నాలుగు శాతం పెరిగి 62.59 డాలర్లకు చేరుకుంది. ఈ నెల 6న జరుగనున్న ఒపెక్ సమావేశానికి కూడా హాజరు కావడం లేదని ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక ఎల్‌ఎన్జీని ఎగుమతి చేస్తున్న ఖతార్ ప్రతియేటా 77 మిలియన్ టన్నుల నుంచి 110 మిలియన్ టన్నులకు పెంచనున్నట్టు కాబీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే చమురు ఉత్పత్తిని కూడా రోజుకి 4.8 మిలియన్ బ్యారెల్స్ నుంచి 6.5 మిలియన్ బ్యారెల్స్ పెంచాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఇదీ ఖతార్ ప్రణాళిక
ఇంతటి ప్రణాళికలు, ప్రయత్నాల నేపథ్యంలో ఖతార్‌ను అంతర్జాతీయ ఇంధన రంగంలో ఒక నమ్మకమైన సరఫరాదారుగా రూపొందించడమే లక్ష్యమని కాబీ వివరించారు. అయితే, ఖతార్ ప్రకటనపై ఒపెక్ కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. ఈనెల 6న జరుగనున్న సమావేశంలో ఉత్పత్తి తగ్గించే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నది. చమురు మార్కెట్‌లో సమతుల్యతను సాధించేందుకు ఒపెక్, దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు రోజుకు పది లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్టు గత నెల సౌదీ అరేబియా ఇంధనశాఖ మంత్రి ఖలీద్ ప్రకటించారు. 

సౌదీ నుంచి ఖతార్‌కు విభేదాలు
అంతర్జాతీయ రాజకీయంగా తీసుకున్న ఈ నిర్ణయంతో పొరుగు దేశమైన సౌదీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఖతార్ ఎదుర్కొననున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 57ఏళ్లుగా ఒపెక్‌లో సభ్యదేశంగా ఖతార్ నిలుస్తుంది. 2017 జూన్‌లో బహ్రెయిన్, ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఖతార్‌తో రాజకీయ బంధాలను తెంచేసుకున్నాయి. ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలు తమ భూభాగం నుంచి ప్రయాణించకుండా నిషేధించాయి. ఆర్థిక లావాదేవీలనూ రద్దు చేసుకున్నాయి.

వేడెక్కిన చమురు మార్కెట్
ఒపెక్ సమావేశానికి ముందే ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సుంకాలపై తాత్కాలిక ఉపశమనం లభించడం, చమురు సరఫరా తగ్గించడానికి ఒపెక్‌దేశాలు సమాయత్తం అవుతుండడంతో ముడి చమురు ధర బ్యారెల్ ఏకంగా నాలుగు శాతం పైగా పెరిగింది. బ్రెంట్ అయిల్ ఒకదశలో 62.59 డాలర్లకు చేరుకుంది. ఖతార్ ఒపెక్ నుంచి వైదొలగడం, సౌదీ, రష్యా ఇప్పటికే ఉత్పత్తి తగ్గించాలని అంగీకరించడంతో పాటు కెనడా ఆల్‌బెర్టా ప్రొవిన్స్ నుంచి ఉత్పత్తిని 8.7 శాతం మేర తగ్గించనున్నట్టు చేసిన ప్రకటన చమురు మార్కెట్ ప్రకంపనలు సృష్టించాయి. ఒపెక్ సమావేశంలో సప్లయ్‌ని తగ్గించాలని అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎవ్రీవేర్ మోడ్‌తో మార్కెట్లోకి ‘రోల్స్‌ రాయిస్‌’ కలినన్
బ్రిటన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ భారతదేశ మార్కెట్లోకి సరికొత్త మోడల్‌ కారును తెచ్చింది. ‘రోల్స్‌ రాయిస్‌ కలినన్‌’ పేరుతో విడుదల చేసిన ఈ కారు ధర అక్షరాలా రూ. 6.95కోట్లు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా పేరొందిన కలినన్‌ డైమండ్‌ పేరు మీద ఈ కారును విడుదల చేసింది రోల్స్‌రాయిస్‌. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ కూడా ఇదేనని సంస్థ చెబుతోంది. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీ మోడల్ కారును రూపొందించారు. కారులోని ‘ఎవ్రీవేర్’ మోడ్‌ ఆప్షన్‌ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, ‌కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును సౌకర్యవంతంగా నడుపవచ్చు. 

రోల్స్ రాయిస్ కలినన్ ప్రత్యేకతలివి
రోల్స్‌ రాయిస్‌ ఎంతో ప్రత్యేకంగా భావించే సూసైడ్‌ డోర్లతో కలినన్‌ను తీసుకొచ్చారు. డాష్‌బోర్డుపై టచ్‌స్క్రీన్‌తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాలతో టచ్‌స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు. వెనుకవైపు సీట్ల కింద బూట్‌లో రెండు అంతర్గత బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా వేసుకోవచ్చు. ఇందులోని 6.75 లీటర్ల వీ 12 ఇంజిన్‌ 653 బీహెచ్‌పీ శక్తిని, 850ఎన్‌ఎం టార్చ్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఈ మోడల్ కార్ల బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం కానున్నదన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios