Asianet News TeluguAsianet News Telugu

నరేశ్ అగర్వాల్‌తోనే అసలు సమస్య: ఎతిహాద్ చేతుల్లోకి జెట్ ఎయిర్వేస్


రోజులు గడుస్తున్నా కొద్దీ జెట్ ఎయిర్వేస్‌ కష్టాల్లో కూరుకుపోతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం కూడా నిధుల కోసం వెంపర్లాడుతోంది. ఈ తరుణంలో జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేశ్ అగర్వాల్.. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ వాటా రెట్టింపు చేసేందుకు సిద్ధ పడ్డారు. అంటే జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్‌లో ఎతిహాద్ కీలకం కానున్నదన్న మాట. 

Naresh Goyal may hand over Jet Airways' operational reins to Etihad: Report
Author
New Delhi, First Published Nov 26, 2018, 4:46 PM IST

న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ను ప్రముఖ కార్పొరేట్ సంస్థ టాటా సన్స్ స్వాధీనం చేసుకోనున్నదని గత వారం వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేశ్ అగర్వాల్ పెట్టిన షరతులు ప్లస్ మొత్తం స్వాధీనం చేసుకోవాలంటే భారీగా నిధులు సమీకరించాల్సి రావడంతో తొందరపడేదేమీ లేదని టాటా సన్స్ నిర్ణయానికి వచ్చింది. ఆచితూచి ముందడుగు వేయాలని నిర్ణయించింది. జెట్ ఎయిర్వేస్ నుంచి ప్రతిపాదన మాత్రమే వచ్చిందని, ఇంకా ఖరారు కాలేదని టాటా సన్స్ తెలిపింది. అసలు జెట్ ఎయిర్వేస్ సంస్థను కొనుగోలు చేసేందుకు ఇతర సంస్థలు ముందుకు రాకపోవడానికి ఆ సంస్థ ప్రమోటర్ నరేశ్ అగర్వాల్ తన చైర్మన్ పదవి యధాతథంగా ఉంచాలని కోరుకోవడమే కారణం.

ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ ఎయిర్వేస్ సంస్థకు 24 శాతం వాటా ఉన్నది. తాజా నరేశ్ అగర్వాల్ ఆఫర్ ప్రకారం ఎతిహాద్ వాటా రెట్టింపు కానున్నది. నిధుల సమీకరణ కోసం జెట్ ఎయిర్వేస్ తన వాటాలను ఎతిహాద్ సంస్థకు కేటాయించనున్నదన్న వార్తలను జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి గత వారం ఖండించారు. కానీ టాటా సన్స్ సంస్థతో సంప్రదింపుల తర్వాత ఎతిహాద్ సంస్థకే తన వాటాల విక్రయిస్తే బావుంటుందన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 

గత ఆదివారం ఎతిహాద్ గ్రూప్ సీఈఓ టోనీ డౌగ్లాస్ ఆధ్వర్యంలోని మేనేజ్మెంట్ టీంతో నరేశ్ అగర్వాల్ టీం సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. దుబాయిలో గల నరేశ్ అగర్వాల్ నివాసంలో ఈ భేటీలు సుదీర్ఘంగా సాగినట్లు సమాచారం. తాజాగా నిధులు సమకూర్చే ఎతిహాద్ సంస్థకే రోజువారీ జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నరేశ్ అగర్వాల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా ఈక్విటీలో ఎతిహాద్ వాటా పెంచడంతోపాటు తక్కువ వడ్డీపై రుణాలు తీసుకోనున్నారు. దీనివల్ల జెట్ ఎయిర్వేస్ చైర్మన్‌గా నరేశ్ అగర్వాల్ యథాతథంగా కొనసాగుతారు. 

దీని ప్రకారం నిధులు సమకూరిస్తే ఎతిహాద్ వాటా 49 శాతానికి చేరితే నరేశ్ అగర్వాల్ తన వాటాను 51 నుంచి 15 శాతానికి తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వరుసగా మూడోసారి నష్టాలను చవి చూసింది. ప్రస్తుతం నిధుల్లేక సిబ్బంది వేతనాలు, కొందరు రుణ దాతల వాయిదా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. 

టాటా సన్స్ ఒకవేళ టేకోవర్ చేసుకోవడానికి ముందుకు వస్తే నరేశ్ అగర్వాల్ తన నియంత్రణను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఎతిహాద్ మాత్రం పూర్తిగా నరేశ్ అగర్వాల్ పైనే ఆధారపడేందుకు సిద్ధంగా ఉన్నది. అదీగాక జెట్ ఎయిర్వేస్ సంస్థను తొలి దశలో టాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ అంటే విస్తారాలో విలీనం చేయాల్సి ఉంటుంది. అంటే నరేశ్ అగర్వాల్ 51 శాతం వాటాను సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. 

జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు ప్రాథమిక దశలో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని గతవారం టాటా సన్స్ ధ్రువీకరించింది కూడా. కానీ ఒప్పందంపై వెంటనే ముందుకు వెళ్లొద్దని, ఆచితూచి స్పందించాలని చైర్మన్ చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ డైరెక్టర్లు కొందరు కోరినట్లు సమాచారం. దీనిపై సంప్రదింపుల కోసం కన్సల్టెంట్లను నియమించాలని సూచించారని వినికిడి. ఈ వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్, టాటా సన్స్ మధ్య చర్చలు వెనుక పట్టు పట్టాయి.  

ఒకవేళ జెట్ ఎయిర్వేస్ సంస్థలో వాటా పెంచుకోవాలని ఎతిహాద్ భావించినా అందుకు పలు కారణాలు ఉన్నాయి. భారతీయుల రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఎటీఎ) పేర్కొంది. 2024 నాటికి విమానయాన రంగంలో భారత్ వాటా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. తర్వాతే చైనా, అమెరికా ఉంటాయి. 2036 నాటికి భారత్ ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందని ఐఏటీఎ అంచనా వేస్తుంది. ఇటువంటి తరుణంలో తమ వాటాను పెంచుకునే అవకాశాలను ఎతిహాద్ వదులుకునే అవకాశాల్లేవని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios