Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకుకు బురిడీ: అంటిగ్వాకు పరారీ.. ఇదీ చోక్సీ స్టైల్

మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)కి రూ.13వేల కోట్ల మేరకు శఠగోపం పెట్టిన ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ ఇప్పటికిప్పుడు భారతదేశానికి రాలేరట

Mehul Choksi May Return To India In 3 Months If Medically Fit: Lawyer
Author
New Delhi, First Published Nov 18, 2018, 12:04 PM IST

ముంబై: మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)కి రూ.13వేల కోట్ల మేరకు శఠగోపం పెట్టిన ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ ఇప్పటికిప్పుడు భారతదేశానికి రాలేరట. ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ప్రయాణాలు చేయలేరని సదరు చోక్సీ తరఫు న్యాయవాది  ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేశారు. ఛోక్సీకి పారిపోయిన ఆర్థిక నేరగాడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబై పీఎంఎల్‌ఏ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఛోక్సీ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.

మూడు నెలలు ఓపిక పట్టాలని చోక్సీ తరఫు లాయర్ అభ్యర్థన
‘ప్రస్తుతం ప్రయాణాలు చేసేందుకు ఛోక్సీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. ఒకవేళ ఆయన వాంగ్మూలం నమోదు చేయాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసే అవకాశం కల్పించండి. లేదంటే ఈడీ అధికారులు ఆంటిగ్వా వెళ్లి ఆయన వాంగ్మూలం రికార్డు చేసుకోవచ్చు. కాదంటే ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు ఓ మూడు నెలలు వేచి ఉండండి. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెనక్కి వస్తారు’ అని ఛోక్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 

అంటిగ్వా అధికారులతో భారత్ సంప్రదింపులు ఇలా
ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ఛోక్సీని భారత్‌ రప్పించేందుకు అధికారులు ఆదేశ అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. చట్టపరంగా అన్ని పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా ఛోక్సీని భారత్‌ పంపించేందుకు ప్రయత్నిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీని కూడా భారత్‌ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

30 లోగా మొబైల్ అప్డేట్ చేసుకోండి: ఖాతాదారులకు ఎస్‌బీఐ డెడ్‌లైన్‌
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు డెడ్‌లైన్‌ విధించింది. ఈ నెల 30వ తేదీలోగా ఎస్బీఐ ఖాతాదారులు మొబైల్‌ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటన ప్రచురించింది. ‘దయ చేసి మీ మొబైల్‌ నంబర్‌ను 2018 నవంబర్ 30వ తేదీలోగా రిజిస్టర్‌ చేసుకోండి. లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడతాయి. 2018 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఎస్బీఐ తెలిపింది.

ఇలా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు..
ప్రతి ఖాతాదారుడు తన లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఖాతాకు మొబైల్‌ నంబరును అనుసంధానం చేయాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులకు సందేశం పంపింది.మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలనుకునేవారు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఏటీఎం ద్వారా కూడా మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని ఎస్‌బీఐ కల్పించింది.

ఏటీఎం ద్వారా మొబైల్‌ నంబర్ నమోదు చేసుకోవాలంటే..
ఏటీఎం కార్డును మెషిన్‌లో స్వైప్‌ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకుని.. పిన్ నంబర్ నమోదు చేయాలి. అటుపై మొబైల్‌ ఫోన్ నంబర్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మొబైల్‌ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, ‘కరెక్ట్‌’ అనే ఆప్షన్‌ను నొక్కాలి. ధ్రువీకరణకోసం మరోసారి మొబైల్‌ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ ఫోన్ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సందేశం వస్తుంది. మూడు రోజుల్లో ఖాతాదారుడికి రిఫరెన్స్‌ ఐడీతో కూడిన సందేశం వస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios