Asianet News TeluguAsianet News Telugu

వేతన బకాయిల క్లియర్‌పై జెట్ ఎయిర్‌వేస్ ఓకే... కానీ

జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబె ప్రకటనపై పైలట్లు ఇతర సిబ్బంది అసంత్రుప్తి వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికను అమలులోకి తేవాలని, అది తెలిపిన తర్వాతే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునే సంగతి ఆలోచిస్తామని పైలట్లు తెలిపారు

Jet Airways says it will clear pending salaries for December, but pilots unhappy
Author
New Delhi, First Published Mar 31, 2019, 12:04 PM IST

పైలట్ల సమ్మె హెచ్చరిక నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ రియాక్టయింది. నష్ట నివారణకు దిగింది. డిసెంబర్ నెల  బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) వినయ్‌ దూబే ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా లేఖ రాశారు.

నాలుగు నెలలుగా వేతన బాకాయిలు చెల్లించని కారణంగా ఏప్రిల్‌ 1 నుంచి విధులు బహిష్కరిస్తామని జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘సంస్థ కార్యకలాపాల్లో వీలైనంత త్వరగా స్థిరత్వం సాధించడానికి భారత బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నాం.

ఇందు కోసం సంస్థ యాజమాన్యం, డైరెక్టర్ల బోర్డు నిరంతరం పరిష్కార ప్రణాళికలు రూపొందించడంలో నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో కొన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తినందున మేం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది.

కాబట్టి ప్రస్తుతానికి మేం గతేడాది డిసెంబర్ నెల వేతన బకాయిలు మాత్రమే చెల్లించగలుగుతున్నాం. ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని తెలుసు. సంస్థ పట్ల మీ నిబద్ధతను గుర్తించిన యాజమాన్యం త్వరలోనే మరిన్ని నిధులు సేకరించి తదుపరి బకాయిలు చెల్లిస్తామని తెలియజేస్తున్నాం’అని ఉద్యోగులకు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఉద్యోగుల బృందం బకాయిలు చెల్లించే నిర్దిష్ట తేదీ చెప్పాలని.. అలాగే సంస్థ భవిష్యత్ ప్రణాళికను కొత్త యాజమాన్యం వెల్లడించాలని కోరారు. అప్పుడే విధుల బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచిస్తామని తెలిపారు.

మార్చి 31లోగా వేతన బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్‌ 1 నుంచి విధులు బహిష్కరిస్తామని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) గత వారం తెలియజేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరకు బ్యాంకుల నుంచి నిధులు పొందడంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విఫలమైన నేపథ్యంలో ‘నో ఫ్లయింగ్‌’కు ఎన్‌ఏజీ పిలుపునిచ్చింది.

ఈ పిలుపు ఆధారంగా సోమవారం నుంచి విధులకు దూరంగా ఉండేందుకు 1100 మంది పైలట్లు నిర్ణయం తీసుకున్నారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఇటీవలే ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం చేతికి జెట్‌ ఎయిర్‌వేస్‌ వెళ్లింది.

వేతన బకాయిలపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత లభించకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్‌ చోప్రా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios