Asianet News TeluguAsianet News Telugu

‘స్సైస్‌జెట్’లో హాఫ్ శాలరీకే జెట్ పైలట్లు, ఇంజినీర్లు: టిక్కెట్ల ధరలకు రెక్కలు

జెట్ ఎయిర్‌వేస్‌లో ఆర్థిక సంక్షోభం స్పైస్ జెట్ తదితర ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌కు వరంగా మారుతోంది. మూడు నెలలకు పైగా వేతనాలందక ఇబ్బంది పడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది దాదాపు సగం వేతనానికే స్పైస్ జెట్‌లో చేరిపోతున్నారు.

Jet Airways Pilots, Engineers Joining SpiceJet At 30-50% Pay Cut: Report
Author
New Delhi, First Published Apr 15, 2019, 10:40 AM IST


‘స్సైస్‌జెట్’లో హాఫ్ శాలరీకే జెట్ పైలట్లు, ఇంజినీర్లు: టిక్కెట్ల ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ వల్ల ఇతర ప్రైవేట్ విమాన సంస్థల ఇష్టారాజ్యంగా మారింది. విమాన టిక్కెట్ల చార్జీలు చుక్కలంటుతున్నాయి. ఏటా వేసవిలో ప్రయాణికుల విమానాలు రద్దీగా ఉంటాయి. జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు రద్దవడంతో ఇతర విమానయాన సంస్థల విమానాల్లో టిక్కెట్లు దొరకడం కష్టంగా మారింది. 

దొరికినా 19 నుంచి 36 శాతం వరకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజీసీఏ ఆదేశాలతో బోయింగ్‌ 737 మాక్స్‌ విమాన సర్వీసులు రద్దు చేయడం కూడా ధరలు పెరిగేందుకు కారణమవుతోంది.

బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాల రద్దు, జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం, ఇతర విమానయాన సంస్థలకు కలిసొస్తున్నాయి. రద్దీకి తగ్గట్టు ఏ రోజుకు ఆ రోజు అదనపు విమానాల్ని రంగంలోకి దించుతున్నాయి. 

డిమాండ్‌కు అనుగుణంగా స్పైస్‌జెట్‌, జెట్ ఎయిర్‌వేస్ నుంచి వెనక్కి తీసుకున్న 10 విమానాల్ని లీజుకు తీసుకుని నడుపుతోంది. దీంతో ఈ వేసవిలో విమాన టిక్కెట్ల చార్జీలు ఇక పెద్దగా పెరిగే అవకాశం లేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు విమానాల సంఖ్య 10 లోపునకు చేరడం, అంతర్జాతీయ - దేశీయ మార్గాల్లో సర్వీసులను భారీగా రద్దు చేయడం, మూడు నెలలుగా వేతనాలే ఇవ్వకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజినీర్లు సంస్థను వీడి స్పైస్‌జెట్‌లో చేరుతున్నారు. 

ఇదే అదనుగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో వీరికి లభిస్తున్న వేతనం కంటే 30-50 శాతం తక్కువ మొత్తాన్నే స్పైస్‌జెట్‌ ఆఫర్‌ చేస్తోందని సమాచారం. పైలట్లకు 25-30 % తక్కువగా, ఇంజినీర్లకు 50 శాతం తక్కువ వేతనం ఆఫర్‌ చేస్తోందని వార్తలొచ్చాయి. 

ఇటీవలి వరకు జెట్‌ నుంచి వచ్చిన పైలట్లు, ఇంజినీర్లకు.. వారికి అందుతున్న వేతనాలకు తోడు బోనస్‌లు ఇచ్చి మరీ స్పైస్‌జెట్‌ చేర్చుకుంది. ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక స్థితి ఇంకా సంక్లిష్ట స్థితికి చేరడం వల్ల ఇలా జరుగుతోందని సీనియర్‌ నిర్వహణ ఇంజినీర్‌ ఒకరు తెలిపారు. 

జెట్‌లో నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతున్నానని, బోయింగ్‌ విమానాలనే నడుపుతున్న స్పైస్‌జెట్‌- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో దరఖాస్తు చేయగా రూ.1.50-2.0 లక్షల ఆఫర్‌ వచ్చిందన్నారు.

ఇవి మరీ తక్కువ వేతనాలు కావడంతో, జెట్‌కు వచ్చే కొత్త పెట్టుబడిదారుపై ఆశతో వేచి చూస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది వివరించారు. 4-5 ఏళ్ల అనుభవం కలిగిన పైలట్లు మాత్రం, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఇతర సంస్థల్లో చేరుతున్నారని వివరించారు. సీనియర్‌ పైలట్లు ఇలా వెళ్లేందుకు, 3-5 ఏళ్ల బాండ్‌ రాసేందుకు ఇష్టపడటం లేదని తెలిపారు. 

రూ.2.9 లక్షల వేతనం లభించే కో-పైలట్లు మాత్రం కొత్త సంస్థల్లో రూ.2 లక్షల కన్నా, తక్కువ లభిస్తున్నా, వెళ్లిపోతున్నారని వివరించారు. తమ సంస్థ వేతనాల ప్రకారమే, ఇతర సంస్థల నుంచీ వస్తున్న వారికి ఆఫర్‌ చేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

బోయింగ్‌ విమానాలు నడిపే పైలట్లను ఎయిర్‌బస్‌ విమానాలకు తీసుకోవాలంటే, ఆరు నెలల శిక్షణ అవసరం అవుతుంది. ఇంజినీర్లకు అయినా 3-4 నెలల శిక్షణ కావాలని, ఖర్చు కూడా అధికమని పేర్కొంటున్నారు.

స్వతంత్ర డైరెక్టర్‌ రాజశ్రీ పతి రాజీనామా చేసినట్టు జెట్ ఎయిర్‌వేస్ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఈ నెల 13 నుంచే అమలులోకి వచ్చేలా ఆమె రాజీనామా చేసినట్టు పేర్కొంది. ఇతర పనుల ఒత్తిడితో జెట్ ఎయిర్‌వేస్ కోసం సమయం వెచ్చించలేక పోతున్నందునే తప్పుకుంటున్నట్టు ఆమె తన రాజీనామా లేఖలో తెలిపినట్టు తెలిపింది.

సార్క్‌, ఆసియా దేశాలకు నిరవధికంగా సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్‌వేస్, టొరొంటో, పారిస్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, లండన్‌  సర్వీసులను ఈనెల 16 వరకు నిలిపేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ముంబయి-పారిస్‌ విమానానానికి జూన్‌ 10 వరకు బుకింగ్‌లను కూడా సంస్థ ఆపేసింది.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు అత్యవసర నిధి కింద రూ.1,000 కోట్లు సమకూర్చే విషయాన్ని ఎస్బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్షియం పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై కొన్ని బ్యాంకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా జీతాల బకాయిలతోపాటు కంపెనీ మూతపడకుండా కాపాడేందుకు అత్యవసరంగా జెట్‌కు సోమవారమే అత్యవసర నిధి కింద రూ.1,000 కోట్లు బ్యాంకుల నుంచి అందుతాయని సమాచారం.

లీజుపై తీసుకున్న విమానాలకు చెల్లించాల్సిన అద్దెలు చెల్లించక పోవడంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన అనేక విమానాలు ఇప్పటికే మూలన పడ్డాయి. కొన్ని లీజు సంస్థలైతే తమ విమానాల్ని వెనక్కి తీసుకున్నాయి. దీంతో జెట్ ఎయిర్‌వేస్ దగ్గర ఉన్న విమానాల సంఖ్య 120 నుంచి పదికి పడిపోయింది.  
 
ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు జెట్ ఎయిర్‌వేస్ హైదరాబాద్‌ నుంచి రోజూ 26 విమాన సర్వీసులు నడిపేది. ఆర్థిక ఇబ్బందులతో ప్రస్తుతం ఈ సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో ముందుగా హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాలకు జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
 
రుణ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ ఇటీవలే నరేశ్‌ గోయల్‌ నుంచి ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి మారింది. ఈ నెల 14లోగా జీతాల బకాయిల చెల్లింపు విషయం తేల్చాలని ఉద్యోగ సంఘాలు 15 రోజుల క్రితమే కొత్త మేనేజ్‌మెంట్‌కు నోటీసు ఇచ్చాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.    

పైలట్ల సంఘం సోమవారం ఉదయం నుంచి విమానాలు నడపబోమన్న నిర్ణయాన్ని జెట్ ఎయిర్‌వేస్ 1100 మంది పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ వాయిదా వేసుకుంది. యాజమాన్యం, బ్యాంకర్ల మధ్య సోమవారం చర్చలు జరగనున్నందున, సంస్థ పునరుద్ధరణకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios