Asianet News TeluguAsianet News Telugu

లోన్ ప్లీజ్: ఎస్బీఐకి జెట్ ఎయిర్వేస్ అప్పీల్..ఇతేహద్ ష్యూరిటీ


నష్టాల్లో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్ వేస్’ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. ఇతేహాద్ సంస్థకు వాటా విక్రయంపై ఎటూ తేలకపోవడంతో రూ.1500 కోట్ల రుణం కోసం ఎస్బీఐ మెట్లెక్కినట్లు తెలుస్తోంది. ఈ రుణానికి కూడా ఇతేహాద్ పూచీకత్తుగా ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం.  

Jet Airways in talks with SBI for Rs 1,500 crore loan
Author
New Delhi, First Published Dec 31, 2018, 11:08 AM IST

న్యూఢిల్లీ: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ ప్రైవేట్ రంగ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ రుణాల అన్వేషణలో పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నుంచి రూ.1,500 కోట్ల రుణాన్ని ఆశిస్తున్నది. కొన్ని చెల్లింపులు, నిర్వహణపరమైన వ్యయం కోసం ఈ రుణం ఇవ్వాలని ఎస్బీఐతో జెట్ ఎయిర్‌వేస్ చర్చిస్తోందని ఎయిర్‌లైన్ ఉద్యోగి ఒకరు పీటీఐకి తెలిపారు.

జెట్ ఎయిర్వేస్ సంస్థకు ఇతేహాద్ పూచీకత్తు
మిడిల్ ఈస్ట్ విమానయాన సంస్థ ఎతిహాద్.. ఈ రుణానికి పూచీకత్తుగా ఉండే వీలుందని జెట్ ఎయిర్వేస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. నరేశ్ గోయల్‌ సారథ్యంలోని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ గత మార్చి నుంచి రూ.1,000 కోట్లకుపైగా త్రైమాసిక నష్టాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ నాటికి జెట్ ఎయిర్వేస్ రుణ భారం రూ.8,052 కోట్లు
సెప్టెంబర్ నెల 30 నాటికి సంస్థ వ్యయభారం రూ.8,052 కోట్లుగా ఉన్నది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్‌ నిర్వహిస్తున్నది. దీనిపై ఎస్బీఐ అధికార ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. వ్యక్తిగత ఖాతాలు, లావాదేవీలపై స్పందించడం తమ బ్యాంకు విధానం కాదని పేర్కొన్నారు. 

వదంతులపై స్పందించేందుకు నిరాకరించిన జెట్ ఎయిర్వేస్, ఇతేహాద్
రుణం కోసం ప్రయత్నిస్తున్నారన్న వదంతులపై స్పందించబోమని ఇటు జెట్ ఎయిర్వేస్, అటు ఇతేహాద్ తెలిపాయి. జెట్ ఎయిర్ వేస్ ఇంతకుముందే 350 మిలియన్ల డాలర్ల రుణం కోసం ప్రయత్నాలు సాగించినట్లు ఆ సంస్థ వర్గాలను బట్టి తెలుస్తున్నది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, వర్కవుట్ కావడానికి టైం పడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆదాయం సేకరించేందుకు మార్గాలు అన్వేషించాలని ఇటీవల జరిగిన అత్యవసర జెట్ ఎయిర్వేస్ బోర్డు భేటీలో నిర్ణయించారు. తదనుగుణంగానే ఎస్బీఐని జెట్ ఎయిర్వేస్ సంప్రదించినట్లు తెలుస్తోంది. 


మార్కెట్లపై మరింత నిఘా: సెబీ
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, షేరు ధరల తారుమారు తదితర ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ట్రేడింగ్‌ సమాచారాన్ని అత్యంత వేగంగా విశ్లేషించేలా నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సమాచార, సాంకేతిక సేవల్ని వినియోగించుకునేందుకు వీలుగా ఐటీ కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ సంస్థలు ప్రస్తుతం సెబీ వాడుతున్న డేటా వేర్‌హౌసింగ్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను (డీడబ్ల్యుఐబీఎస్‌) మరింతగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిఘా వ్యవస్థను (ఐఎంఎస్‌ఎస్‌) నిర్వహించాల్సి ఉంటుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీల వద్ద ఏర్పాటు చేసిన తమ నెట్‌వర్క్‌ వ్యవస్థల ద్వారా మార్కెట్లో జరుగుతున్న అనుమానిత లావాదేవీలపై 2013 నుంచి సెబీ పూర్తిస్థాయిలో నిఘా పెంచిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios