Asianet News TeluguAsianet News Telugu

నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్ పెట్టుబడుల్లో ‘ఉల్లంఘన’

ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ పతనానికి ప్రమోటర్లు అనుసరించిన వైఖరే కారణమన్న విమర్శ ఉంది. నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ పెట్టుబడుల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని తెలుస్తోంది. ఈ రెండు అంశాల్లో నరేశ్ గోయల్ పాత్రపై ఇటు ఎస్ఎఫ్ఐఓ, అటు ఈడీ దర్యాప్తు చేపట్టాయి. 

Jet Airways Funds Siphoned Off, Foreign Investment Rules Violated Before Collapse? Probes Launched
Author
New Delhi, First Published May 28, 2019, 10:48 AM IST

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సంస్థలో నిధులు దారి మళ్లించారని తేలింది. దీంతో ఎలా నిధులు దారి మళ్లాయన్న కోణంలో ఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే శనివారం దుబాయి మీదుగా లండన్ నగరానికి చెక్కేయాలనుకున్న నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్‌లను చివరిక్షణంలో నాటకీయ ఫక్కీలో దర్యాప్తు అధికారుల సూచనల మేరకు ముంబై విమానాశ్రయ అధికారులు విమానం నుంచి దింపేసిన సంగతి తెలిసిందే. 

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థగా ఉన్న ‘జెట్ ఎయిర్వేస్’ కుప్పకూలిపోవడానికి ఏళ్ల తరబడి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని తేలింది. దీనిపై ఒకవైపు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధీనంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టాయి. 

ప్రత్యేకించి సంస్థ ప్రమోటర్లే నిధులను దారి మళ్లించారని ఎస్ఎఫ్ఐఓ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్ ఎయిర్వేస్.. జెట్ ఎయిర్వేస్ అనుబంధ జెట్ ప్రివిలైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 50.1 శాతం వాటా కోసం 150 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడంలోనే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మార్గదర్శకాలను ఉల్లంఘించారని తేలింది. 2012లో జెట్ ప్రివిలైజ్ సంస్థ ఏర్పడింది. 

జెట్ ఎయిర్వేస్ నుంచి నిధుల మళ్లింపుపై ఎస్ఎఫ్ఐఓ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక నిబంధనలు లేదా మార్గదర్శకాల ఉల్లంఘన విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్నాయి. ఇందులో నరేశ్ గోయల్ పాత్రమేమిటన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికిప్పుడు కేసు నమోదు చేయలేదని ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎఫ్డీఐ నిబంధనలను ఉల్లంఘిస్తే తామే నేరుగా దర్యాప్తు చేపట్టొచ్చని ఆయన చెప్పారు.

దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు ఎస్ఎఫ్ఐఓ లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం వల్లే దుబాయి మీదుగా లండన్ వెళ్లాలని విమానంలోకి ఎక్కి కూర్చున్న నరేశ్ గోయల్ దంపతులను ఇమ్మిగ్రేషన్ అధికారులు దింపివేశారు. అయితే ఎస్ఎఫ్ఐఓ, ఈడీ దర్యాప్తులపై స్పందించేందుకు నరేశ్ గోయల్ దంపతులు అందుబాటులో లేరు. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని జెట్ ఎయిర్వేస్ చెబుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios