Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్వేస్‌లో ‘స్కాం’?: సీఈఓ వినోద్ దూబెకూ లుకౌట్ నోటీసులు

ఇటీవలి వరకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అందుకే సంస్థ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్ దంపతులతోపాటు మాజీ సీఈఓ వినోద్ దూబెకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

Jet Airways crisis: Now lookout notice against airline's CEO Vinay Dube
Author
New Delhi, First Published Jun 2, 2019, 10:57 AM IST

ఆర్థిక సంక్షోభంతో నెలన్నర రోజుల క్రితం విమానాశ్రయాల్లో గ్రౌండ్‌కు పరిమితమైన జెట్‌ ఎయిర్‌వేస్‌లో అవకతవకలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నరేశ్ గోయల్ సారథ్యం నుంచి బ్యాంకుల కన్సార్టియం నియంత్రణలోకి సంస్థ వెళ్లాక.. ఎగ్జిక్యూటివ్‌లందరి తర్వాత గుడ్ బై చెప్పిన తర్వాత జెట్ ఎయిర్వేస్ సీఈవో వినోద్‌ దూబే కూడా వ్యక్తిగత కారణాల పేరిట రాజీనామా చేశారు.

కానీ జెట్ ఎయిర్వేస్ సంస్థ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న కార్పొరేట్ వ్యవహారాలశాఖ సునిశితంగా అడుగులేస్తున్నది. సంస్థ మాజీ సీఈఓ వినోద్ దూబె పైనా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ అయింది.

జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఆర్థిక నేరాలపై కార్పొరేట్ వ్యవహారాలశాఖ దర్యాప్తు జరుగుతుండటంతో వినోద్ దూబె విదేశాలకు వెళ్లకుండా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఈ లుక్ ఔట్ నోటీసును జారీ చేసింది. గతంలో నరేష్‌ గోయల్‌పై జారీ చేసినట్లే దీనిని కూడా జారీ చేసింది.

దూబే ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌లో పదవికి రాజీనామా చేశారు. ఆయన గత నెల 14వ తేదీన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత  కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మొత్తం 20 మందిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. వీరిలో దూబే కూడా ఒకరు. 

జెట్ ఎయిర్వేస్ ఎగ్జిక్యూటివ్‌ల్లో మిగిలిన వారు తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ‘వారి వేసవి పర్యటలను ఆపేయండి’ అని దర్యాప్తు సంస్థలకు నోటీసులు వెళ్లాయి. 

ఇటీవల దుబాయి మీదుగా లండన్‌కు వెళ్లే విమానం ఎక్కి కూర్చున్న జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్లు నరేష్‌ గోయల్‌-అనితా దంపతులను విమానం నుంచి దింపేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దూబేపై కూడా ఆ  నోటీసు జారీ కావడం గమనార్హం. 

నగదు కొరత కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌ 17 నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ఈ సంస్థకు రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్లు తమ సొమ్ము వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలను మూమ్మరం చేశాయి. 

సంస్థ వాటాదారుల్లో ఒక్కటైన ఎతిహాద్ సాయంతో లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్నారై పారిశ్రామికవేత్తల సంస్థ ‘హిందూజా’ల గ్రూప్ జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది.

ఇప్పటికైతే సంస్థలో ఆర్థిక అవకతవకలపై బహిరంగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గానీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

అయితే జెట్ ఎయిర్వేస్ సంస్థలో నిధులు దారి మళ్లినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ప్రత్యేకించి విదేశీ పెట్టుబడుల విషయంలో ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే తొలుత నరేశ్ గోయల్ దంపతులు, తాజాగా జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈఓ వినోద్ దూబెలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios