Asianet News TeluguAsianet News Telugu

సీట్లు నిండినా.. గల్లా ఖాళీ.. ఇదీ విమాన ‘యానం’ సీన్


సమస్యలతో సతమతం అవుతున్న పౌర విమాన యాన రంగాన్ని చక్కదిద్దాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేరీతిలో వ్యవహరించడంతోపాటు సదరు విమానయాన సంస్థలు పోటీ తత్వం పేరిట ఇతర సంస్థలను పావులుగా మార్చకుండా ఉంటే బెటర్ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

IndiGo worst performing airline for consumers, Air India has best luggage policy: parliamentary panel
Author
New Delhi, First Published Dec 28, 2018, 10:59 AM IST

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగం పలు రకాల సమస్యలతో కునారిల్లుతోంది. విమానాల సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నా విమాన  సంస్థలు మాత్రం నష్టాలు మూటగట్టుకుంటున్నాయి‌. ప్రయాణికుల సంఖ్యా పరంగా వరుసగా 50 నెలల పాటు రెండంకెల వృద్ధి లభించడంతోపాటు అదే ఒరవడి కొనసాగుతోంది. అధిక ముడిచమురు ధరలకు అనుగుణంగా విమాన ఇంధన ధరలు బాగా పెరగడానికి తోడు, రూపాయి పడిపోవడం సంస్థల నష్టానికి ప్రధాన కారణం. విమాన సంస్థల అవసరాలు తీర్చే స్థాయిలో పైలట్లు లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతోంది. అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 200 విమానాలతో, కష్టాల నుంచి కోలుకున్న స్పైస్‌జెట్‌ 60 విమానాలతో సేవలు విస్తరిస్తున్నాయి. రుణ భారంతో ఉన్న ఎయిరిండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ సరైన భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నాయి.

ఏటీఎఫ్ ధరలు తగ్గడంతో తక్కువ ధరకు విరివిగా విమాన టిక్కెట్లు
గత 4-5 ఏళ్లుగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు తక్కువగా ఉండటంతో, విమానయాన సంస్థలు తక్కువ ధర టికెట్లను విరివిగా అందుబాటులో ఉంచగలిగాయి. ఫలితంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రాంతీయ విమానయానం పేరిట చిన్న నగరాల నుంచీ సర్వీసులు ప్రారంభించి, గంట ప్రయాణానికి రూ.2,500 నుంచీ టికెట్లు విక్రయించడమూ కలిసొచ్చింది. సంస్థల మధ్య పోటీ వల్ల, నిర్వహణ ఖర్చులు కూడా రానంత తక్కువకు, దేశీయ మార్గాల్లో రూ.699 నుంచీ టికెట్లు విక్రయించడం వంటి దూకుడు చర్యల వల్ల నష్టాలు పెరిగాయి. 

ఇలా పావులుగా మారిన కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్
ఆర్థికస్థితి సరిగా లేని చిన్న-పెద్ద సంస్థలను దెబ్బతీసేందుకు, కొన్ని పటిష్టమైన విమానయాన సంస్థలు మాత్రం తక్కువధర టికెట్లను ఆఫర్‌ చేస్తూ, ‘ఆటా’డుతున్నాయి. గతంలో కింగ్‌ఫిషర్‌, ఇప్పుడు జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఈ ‘ఆట’లో పావులుగా మారుతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. బలహీన సంస్థలు సర్వీసులు ఆపేవరకు ఇలా చేసి, ఆనక టికెట్ల ధరలు పెంచుతున్నాయి.

జీడీపీకి 1.5 రెట్లు మాత్రమే వృద్ధి 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా దేశ వృద్ధిరేటు కంటే 1.5 రెట్లు అధికంగా విమానయాన వృద్ధి లభిస్తోంది. మన దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా 2-2.5 రెట్లు అధిక వృద్ధితో సాగుతోంది. మనదేశ జీడీపీ వృద్ధి 7.2 శాతం అయితే గరిష్ఠంగా 12 శాతం వరకు పెరగొచ్చు. కానీ దేశీయ విమానయాన రంగం 20-22 శాతం వృద్ధితో సాగుతోందంటే, కారణాలు ఆలోచించాలి. ముఖ్యంగా ఇండిగో వంటి విమానయాన సంస్థలు తమ సర్వీసులు-సీట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం, వాటిని నింపేందుకు తక్కువ ధరకు టికెట్లు ఆఫర్‌ చేయడం ప్రధాన కారణంగా పరిశ్రమ పేర్కొంటోంది. 

సెప్టెంబర్ త్రైమాసికంలో నష్టాల బాటలో విమానయానసంస్థలు
ప్రయాణికుల డిమాండ్‌కు మించి సరఫరా ఉంటే, ఏ రంగంలో అయినా సంస్థలకు నష్టాలు తప్పవు. సెప్టెంబర్ నెలతో ముగిసిన  త్రైమాసికంలో విమానయాన సంస్థలన్నీ నష్టాల పాలు కావడం ఇందువల్లే. ఏడాది క్రితంతో పోలిస్తే, ప్రయాణికుల సంఖ్య 22 శాతం వరకు పెరుగుతున్నా, సంస్థలకు నష్టాలు వస్తున్నాయంటే, టికెట్లకు సరైన ధర లేనట్టు.. లేదా నిర్వహణ వ్యయాలు అనూహ్యంగా పెరిగినట్లే. మరో పక్క పైలట్ల జీతాలు భారంగా మారాయి. మరమ్మతు ఖర్చులు కూడా అధికమయ్యాయి.

ఇవి విమానయాన సంస్థల సమస్యలు
బరువు ఎంత ఉంటే, అంత ఇంధన వ్యయం 
విమానాల్లో సీట్లు ఖాళీగా ఉండే బదులు, తక్కువకు అయినా ప్రయాణికులను తీసుకెళ్లడం మంచిది కదా అని భావిస్తారేమో.. బరువు పెరిగే కొద్దీ, ఏటీఎఫ్‌ ఎక్కువగా ఖర్చవుతుంటుంది. ఇదేవిధంగా తక్కువ వ్యాట్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుని వద్దామంటే, ఈ బరువు కూడా అధిక వ్యయానికి కారణమవుతోంది. అందుకే 1-2 రాష్ట్రాలు తగ్గిస్తే ఫలితం ఉండదని, అన్ని రాష్ట్రాలూ ఏటీఎఫ్‌పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.

ఇండిగో రూటే సెపరేట్.. డెరిక్ ఒబ్రెయిన్ సంచలన వ్యాఖ్యలు
ప్రయాణికుల దృష్టిలో పనితీరు బాగోలేని విమానయాన సంస్థ ఇండిగోనే అని పౌర విమానయాన రంగ పార్లమెంటరీ సంఘం ఛైర్మన్‌ డెరెక్‌ ఒబ్రెయిన్‌ అన్నారు. లగేజీ విధానం విషయంలో ఎయిరిండియా విధానం అత్యుత్తమని తెలిపారు. కస్టమర్ల ఫిర్యాదులకు ఇండిగో స్పందించడం లేదని.. బ్యాగేజీ బరువు కిలో, రెండు కిలోలు అధికంగా బరువు ఉన్నా ఛార్జీలు వసూలు చేస్తోందని తెలిపారు. అందుకే వినియోగదారుల సేవల విషయంలో అత్యంత అద్వాన పనితీరు ఇండిగోదేనని తమ కమిటీ అభిప్రాయం అన్నారు. 

ఏవియేషన్‌లో పలు సమస్యలు ఉన్నాయన్న ఓబ్రెయిన్
‘కొన్ని ప్రైవేట్‌ విమానయాన సంస్థల పనితీరుతో సభ్యులందరూ విసుగుచెందారు. ముఖ్యంగా బ్యాగేజీ ఛార్జీ వసూలు విషయమై ఇండిగో అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉంవని ఈ విషయాన్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంద’ని విమానయాన పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ డెరిక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. ఇవే కాకుండా విమానయాన రంగంలో చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. బేసిక్‌ ఛార్జీలో టిక్కెట్టు రద్దు ఛార్జీలు 50 శాతానికి మించకూడదని కమిటీ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. పన్నులు, ఇంధన సర్‌ఛార్జీ కింద వసూలు చేసే డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. సాధారణ సమయంతో పోలిస్తే పండగ సీజనులో కొన్ని విమానయాన సంస్థలు 8-10 రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. 

ఎయిరిండియా పునరుద్ధరణకు ప్రణాళిక రెడీ
ఎయిరిండియాకు పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. పోటీతత్వంతో కూడిన లాభదాయక విమానయాన సంస్థగా తీర్చిదిద్దడంపై దృష్టిసారించామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఓ ప్రశ్నకు పైవిధంగా మంత్రి బదులిచ్చారు. ‘ప్రధానేతర ఆస్తులు, అప్పులను స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌కు బదిలీ చేయడం సహా పూర్తి స్థాయి ఆర్థిక ప్యాకేజీ, బోర్డు ద్వారా సమర్థంగా సంస్థాగత, పరిపాలనా సంస్కరణల అమలు, కీలక వ్యాపారాలన్నింటికీ వైవిధ్యభరితమైన వ్యాపార వ్యూహాలు రూపొందించడం లాంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయ’ని సిన్హా వెల్లడించారు. 

ఎయిరిండియా ఆస్తుల విక్రయంతోనే ఆదాయం సముపార్జన
ఎయిరిండియా స్థలాలు, ఆస్తుల అమ్మకం ద్వారానే సంస్థకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని సిన్హా వెల్లడించారు. అయితే వేలం ప్రక్రియ, సంబంధిత సంస్థల నుంచి లభించే అనుమతులు, నిరభ్యంతర పత్రంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎయిరిండియాలో వాటా ఉపసంహరణకు ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడే ఉందన్నారు. ఎయిరిండియాకు రూ.55,000 కోట్ల అప్పులు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios