Asianet News TeluguAsianet News Telugu

సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...

తొలుత మనదేశం వరకే పరిమితం అనుకున్న ‘రూపే’ కార్డు సరిహద్దులు దాటి విదేశాలకు చకచకా దూసుకెళుతోంది. తాజాగా సౌదీ అరేబియాలో ఎంటరైంది. పలు అంతర్జాతీయ సంస్థలతో జట్టు కట్టడం ద్వారా తన పలుకుబడి పెంచుకున్న రూపే.. మున్ముందు అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నది.

India signs MoU with Saudi to launch RuPay card in Gulf Kingdom
Author
Hyderabad, First Published Oct 30, 2019, 1:36 PM IST

న్యూఢిల్లీ/రియాద్: గతంలో డెబిట్, క్రెడిట్ కార్డులంటే వీసా మాస్టర్ కార్డులే. ఏ బ్యాంకు జారీచేసినా ఈ రెండు చెల్లింపు నెట్‌వర్క్‌ల సేవలనే వాడుకునేవి. అంతర్జాతీయంగానే వీటికి మాత్రమే అంగీకారం ఉండేది. దేశీయంగా డిజిటల్ చెల్లింపుల సేవలు పెరుగుతన్నా.. విదేశీ కార్డుల చెల్లింపు నెట్వర్క్‌లపైనే ఆధారపడాల్సిన దుస్థితి మనది. 

కానీ నిశితంగా అధ్యయనం జరిపిన కేంద్ర ప్రభుత్వం విదేశీ నెట్వర్క్‌లకు పోటీగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నూతన కార్డును తేవాలని సంకల్పించింది. అలా రూపుదిద్దుకున్న ‘రూపే’ కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీసీఐ) 2012లో అందుబాటులోకి తెచ్చింది. 

తొలుత డెబిట్, తర్వాత రూపే క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ కార్డు విదేశాల్లోనూ విస్తరిస్తున్నది. మనదేశంతోపాటు సింగపూర్, భూటాన్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ల్లో ఇప్పటికే ఈ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా బుధవారం నుంచి సౌదీ అరేబియాలో వినియోగంలోకి రానున్నది. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ తాజా సౌదీ పర్యటనలో ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అక్కడ ప్రవేశపెట్టారు.

also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

మన డేటా బయటకు వెళ్లదన్న భరోసాతోపాటు అంతర్జాతీయ కార్డులకు చెల్లించే రుసుముతో పోలిస్తే రూపే కార్డు ఫీజు చాలా తక్కువ. అనతి కాలంలోనే రూపే కార్డు ఆదరణ పొందగలిగింది అందుకే. దీంతోపాటు రూపే క్రెడిట్ కార్డు వాడే వారికి ఎటువంటి ఖర్చు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఒక ఆకర్షణ కానున్నది.

తొలుత ఈ కార్డుల జారీకి చాలా బ్యాంకులు ముందుకు రాలేదు. జన్ ధన్ యోజన ఖాతాలను ప్రారంభించడం, 2016లో నోట్ల రద్దు తర్వాత వీటికి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం దాదాపు 1100 బ్యాంకులు దాదాపు 60 కోట్ల వరకు ఈ కార్డులు అందజేశాయి. ఇందులో చిన్న, పెద్ద బ్యాంకులతోపాటు అంతర్జాతీయ బ్యాంకులు కూడా ఉన్నాయి. 

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 440 సార్లు డెబిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఈ సంఖ్య 330 కోట్లే మాత్రమే. 2018-19లో 32 శాతం అధిక లావాదేవీలు నమోదైనట్లు తెలుస్తున్నది. 

India signs MoU with Saudi to launch RuPay card in Gulf Kingdom

ఇందులో రూపే కార్డు ద్వారా రూ.100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. అంతకుముందేడాది రూ.66.7 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 70 శాతం లావాదేవీలు పెరిగాయి. మొత్తం డెబిట్ కార్డుల మార్కెట్లో రూపే కార్డు 33 శాతం వాటాను దక్కించుకోగలిగింది.విదేశాల్లోనూ రూపే కార్డుకు గణనీయంగా ఆదరణ పెరుగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోనూ వినియోగంలోకి రానుండటంతో మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాలకు వెళ్లే భారతీయులకు ఎంతో అనుకూలంగా మారనున్నది. 

భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన తొలి చెల్లింపుల నెట్వర్క్ కార్డు రూపే. ఈ కార్డుతో జరిగే లావాదేవీలన్నీ ఎన్సీసీఐ చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకుంటాయి. పటిష్ఠ భద్రత దీని స్పెషాలిటీ. విదేశీ సంస్థల కార్డుల చార్జీలతో పోలిస్తే రూపే కార్డు చార్జీ చాలా తక్కువ. అందుకే పలు బ్యాంకులు ఈ కార్డును జారీ చేయడానికి ముందుకు వచ్చాయి. 

also read మనోళ్లు మంచి పనిమంతులు: బెస్ట్ సీఈఓల్లో ముగ్గురు ఎన్నారైలకు చోటు

రుసుములు తక్కువగా ఉండటంతో చిన్న నగరాలు, పట్టణాల్లో ఈ కార్డును వినియోగించేందుకు వ్యాపార సంస్థలు ముందుకు రావడంతో వీటి వినియోగం బారీగా పెరుగుతున్నది. దేశీయంగా అన్ని ఏటీఎంలు, పీఓఎస్ యంత్రాలు, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దీన్ని వాడేందుకు అనుకూలం కూడా. సైబర్ హ్యాక్స్ నుంచి పూర్తి రక్షణకు ఎన్పీసీఐ గట్టి చర్యలు చేపట్టింది.

రూపే కార్డు వాడకం పెరుగుతుండటంతో అమెరికాకు చెందిన మాస్టర్ కార్డు, వీసా కార్డులకు భారతదేశ మార్కెట్లో వాటా తగ్గిపోతున్నది. దేశీయంగా డిజిటల్ లావాదేవీలు అధికమైనా వాటికి ఆశించినంత వ్రుద్ధి కనిపించడం లేదు. ఒకదశలో కేంద్ర ప్రభుత్వం జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ రూపే కార్డును ప్రచారం చేస్తున్నదని, ఇది విదేశీ సంస్థల వ్యాపారాన్ని అడ్డుకునేందుకేనని, దీనిపై చర్య తీసుకోవాలని మాస్టర్ కార్డు, వీసా సంస్థలు అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. 

విదేశాల్లో డిస్కవర్, డైన్స్, పల్స్, జపాన్ క్రెడిట్ బ్యూరో, చైనా యూనియన్ పే తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూపే కార్డు వినియోగంలోకి వచ్చింది. ఇప్పటివరకు 2.5 కోట్ల రూపే- డిస్కవర్ గ్లోబల్ కార్డునుల విడుదల చేసిన ఘనత ఎన్సీసీసీఐ దక్కించుకున్నది. మున్ముందు అంతర్జాతీయ సంస్థలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios