Asianet News TeluguAsianet News Telugu

దటీజ్ మోదీ: అప్పుల కుప్పగా భారతావని.. 50% రుణాలు పైపైకి

కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రభుత్వ రుణాలు 50 శాతం పెరిగాయి. 2014 జూన్ నెలకు ముందు రూ.54,90,763 కోట్లుగా ఉన్న కేంద్ర ప్రభుత్వరుణాలు.. గతేడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి రూ.82,03,253 కోట్లకు చేరాయని సాక్షాత్ కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

India's debt up 50% to Rs 82 lakh crore in Modi era
Author
New Delhi, First Published Jan 20, 2019, 11:33 AM IST

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పాలనలో భారతావని అప్పుల కుప్పగా మారుతున్నది. గత నాలుగున్నరేళ్లలో దేశ రుణభారం ఏకంగా 50 శాతం పెరిగి పోయింది. కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.82 లక్షల కోట్లను దాటిపోయాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

2014 జూన్ నాటికి రూ.54,90,763 కోట్లుగా ఉన్న రుణాల విలువ గతేడాది సెప్టెంబర్ నాటికే రూ.82,03,253 కోట్లకు చేరింది. అంటే గత నాలుగున్నరేళ్లలో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ పాలనలో దేశ రుణ భారం రూ.82 లక్షల కోట్లను దాటిపోయింది. 

ఆర్థిక శాఖ ఎనిమిదో ఎడిషన్ స్టేటస్ పేపర్ ప్రకారం గతేడాది సెప్టెంబర్ నాటికి మొత్తం కేంద్రం రుణాలు రూ.82,03,253 కోట్లను చేరుకున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరిన 2014 జూన్ నాటికి రూ.54,90,763 ప్రభుత్వ రుణాలు కోట్లు. దీంతో మోదీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.27,12,490 కోట్లు పెరిగాయి.

దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానన్న నరేంద్ర మోదీ.. అప్పుల సేకరణకు గల ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకపోవడం గమనార్హం. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు గోల్డ్ బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలేమీ లేవు.

అయితే ఇప్పుడు ఆ మార్గంలో అందుకున్న అప్పుల విలువ రూ.9,089 కోట్లు. ఇక మార్కెట్ ఆధారిత రుణాలూ గతంతో పోల్చితే 47.5 శాతం పెరిగి రూ.52 లక్షల కోట్లకుపైగా పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరటంతో ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి.

ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతుండటంతో పాలనాపరమైన నిర్వహణ కోసం ప్రభుత్వం అప్పుల బాట పడుతున్నది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం సంక్షేమ పథకాలకు పెరుగుతున్న కేటాయింపులతో ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్యలోటును దేశ జీడీపీలో 3.3 శాతానికి (రూ.6.24 లక్షల కోట్లు) కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)లో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేశారు. గతేడాది నవంబర్‌తో ముగిసిన ఎనిమిది నెలల్లోనే ద్రవ్యలోటు రూ.7.17 లక్షల కోట్లకు చేరింది. ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే 114.8 శాతంగా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకు రూ.80వేల కోట్ల నిధులను తరలించాలని మోదీ సర్కార్ లక్ష్యం. అయితే ఇప్పటిదాకా రూ.34,000 కోట్లకు పైగానే సమీకరించింది.

ఓ వైపు పెరుగుతున్న రుణ భారం.. మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.. ఇంకోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తదితర మార్గాల ద్వారా పడిపోతున్న ఆదాయం.. మోదీ సర్కారుపై ముప్పేట దాడినే చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వలపై కన్నేసింది.

ఆ సొమ్ముతో పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనేగాక, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థలో కలిగిన సమస్యలనూ అధిగమించవచ్చునని భావించింది. అది కుదురక ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను మోదీ సర్కార్ కోరుతున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios