Asianet News TeluguAsianet News Telugu

మనోళ్లే టాప్: భారత్‌కు పోటెత్తిన ఎన్నారై ఫండ్స్

వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని కూడా ఆదుకుంటున్నారు. గత మూడేళ్లలో వివిధ దేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్‌లు అందుకున్న దేశాల్లో భారతదేశానికే అగ్ర తాంబూలం.

India highest recipient of remittances at $79 bn in 2018: World Bank
Author
Delhi, First Published Apr 10, 2019, 11:37 AM IST

వాషింగ్టన్: సొంత దేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు విషయంలో భారత్‌ మరోసారి అగ్రస్థానంలో నిలబడింది. 79 బిలియన్‌ డాలర్లతో గతేడాదీ ప్రథమ స్థానంలోనే నిలిచింది. తద్వారా ప్రవాస భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని ఆదుకుంటున్నారు. 

గత మూడేళ్లుగా భారత్‌కు వివిధ దేశాల్లోని ప్రవాసులు పంపిస్తున్న సొమ్ము క్రమేణా పెరుగుతుండటం విశేషం. 2016లో 62.7 బిలియన్‌ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు.. 2017లో 65.3 బిలియన్‌ డాలర్లను పంపారు. 2018లో 79 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో గతేడాదే దాదాపు 14 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లయింది. ప్రపంచంలో మరే దేశానికీ ప్రవాసుల నుంచి ఈ స్థాయిలో నిధులు అందలేదు.

భీకర వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆదుకునేందుకు మలయాళ ఎన్నారైలు తమ వారికి ప్రవాసులు పెద్ద ఎత్తున సొమ్ము పంపి ఉంటారని బ్యాంక్‌ అభిప్రాయపడింది. చైనా తర్వాతీ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తమ తాజా జాబితాలో పేర్కొన్నది. మెక్సికో (3,600 కోట్ల డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (3,400 కోట్ల డాలర్లు), ఈజిప్టు (2,900 కోట్ల డాలర్లు) తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం తక్కువ, మధ్యస్త ఆదాయ దేశాలకే ప్రవాసుల నుంచి గతేడాది ఎక్కువ సొమ్ము వచ్చినట్లు తేలింది. ఇది కూడా రికార్డు స్థాయిలో 529 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 9.6 శాతం ఎక్కువ. 2017లో 483 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నది. ఇదీ రికార్డే కావడం గమనార్హం. 

ఈ ఏడాది 550 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఇక సంపన్న దేశాలకు నిరుడు 689 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 2017లో 633 బిలియన్‌ డాలర్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, పాకిస్తాన్‌కు 2018లో అక్కడి పౌరులు విదేశాల నుంచి పంపిన మొత్తం తగ్గింది. 

ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి పాకిస్తానీయులు ఈసారి తక్కువ రెమిటెన్సులు పంపారు. దీంతో 2017తో పోల్చితే 7 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే బంగ్లాదేశ్‌లో 15 శాతం వృద్ధి కనిపించడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో పలికిన నేపథ్యంలో క్రూడ్‌ ఉత్పత్తి దేశాల్లోని విదేశీయులు తమతమ దేశాలకు గతేడాది పెద్ద ఎత్తున నిధులను పంపించగలిగారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది. గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)లోని బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదే అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాల నుంచి ప్రవాసులు గణనీయంగా స్వదేశంలోని తమ వాళ్లకు డబ్బు పంపారు.

అమెరికాలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడటంతో డాలర్ల రాక ఎక్కువైందని ప్రపంచ బ్యాంక్‌ చెప్పింది. ఈ క్రమంలోనే దక్షిణాసియా దేశాల్లో 2017తో పోల్చితే 2018లో 12 శాతం వృద్ధి కనిపించిందని, 131 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. 2017లో 6 శాతం వృద్ధే ఉన్నట్లు పేర్కొన్నది. తూర్పు ఆసియా దేశాల్లోకి గతేడాది 7 శాతం పెరిగి 143 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 

విదేశాల నుంచి తమ దేశాలకు డబ్బు పంపుతున్న ప్రవాసులను వ్యయ భారం వెంటాడుతున్నది. కష్టార్జితాన్ని కన్నవాళ్లకు, కట్టుకున్నవాళ్లకు చేర్చుతున్న వీరందరిపై బ్యాంకులు 11 శాతం చార్జీలను విధిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకులు వసూలు చేసిన సగటు చార్జీలు ఇలాగే ఉన్నాయి మరి. అయితే పోస్టాఫీసులు మాత్రం 7 శాతం చార్జీలే తీసుకున్నాయి. 

నిజానికి ప్రపంచ అభివృద్ధి లక్ష్యాల దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2015లో ఈ చార్జీలు 3 శాతాన్ని మించరాదని తీర్మానించింది. అయినా వివిధ కారణాల రిత్యా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా వలస ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకే రెమిటెన్సులు ఎక్కువగా వస్తున్నందున చార్జీలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios