Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో బిట్ కాయిన్ ఏటీఎం.. త్వరలో సేవలు ప్రారంభం

ఆర్బీఐ, కేంద్రం నిషేధం విధించినా యూనోకాయిన్ సంస్థ బెంగళూరులో తొలి బిట్ కాయిన్ ఏటీఎంను ప్రారంభించింది. దీని ద్వారా నగదు డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ చేయొచ్చు. త్వరలో ఢిల్లీ, ముంబై నగరాలకు కూడా బిట్ కాయిన్ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 

India Gets its First Bitcoin ATM Kiosk in Bengaluru Amid Question Mark on Future of Virtual Currency
Author
Bengaluru, First Published Oct 21, 2018, 11:08 AM IST

క్రిప్టోకరెన్సీ అలియాస్ బిట్ కాయిన్ వినియోగంపై అధికారికంగా కేంద్ర ప్రభుత్వం.. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిషేధం విధించాయి. కానీ ఎక్సేంజ్ యూనోకాయిన్.. బిట్‌కాయిన్ కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఏటీఎం  కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలోనే ఇది తొలి బిట్‌కాయిన్ ఏటీఎం కావడం గమనార్హం. 

బెంగళూరు పాత ఎయిర్ పోర్టులో ఈ ఏటీఎం ఏర్పాటు
దీన్ని బెంగళూరులోని పాత ఎయిర్ పోర్ట్‌లో గల ఓ మాల్‌లో యూనోకాయిన్ ఏర్పాటు చేసింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలను బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు జరుపకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధం విధించిన నేపథ్యంలో యూనోకాయిన్ నుంచి బిట్‌కాయిన్ ఏటీఎం రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

నగదు మార్పిడి, ట్రేడింగ్‌కూ వాడొచ్చు
కాగా, చాలా దేశాల్లో ఈ తరహా ఏటీఎంలు ఇప్పటికే పెద్ద ఎత్తున పని చేస్తున్నాయి. బిట్ కాయిన్ నగదు మార్పిడికీ, ట్రేడింగ్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏటీఎంలో ధ్రువీక్రుత కస్టమర్లను మాత్రమే అనుమతినిస్తారు. త్వరలో బెంగళూరులో ఏర్పాటైన ఈ ఏటీఎం పని చేయడం ప్రారంభిస్తుంది. 

ఎన్సీఆర్ రూపొందించిన కియోస్క్ ఏటీఎం
ఈ కియోస్క్ (ఏటీఎం)ను ఏటీఎం తయారీదారు ఎన్‌సీఆర్ రూపొందించింది. ఇది బ్యాంక్ ఏటీఎం మాదిరిగానే ఉంటుంది. కానీ డెబిట్/క్రెడిట్ కార్డులు వాడటానికి వీలుండదు. యూనోకాయిన్ లేదా దాని విభాగం యూనోడాక్స్ కస్టమర్లు రోజుకు ఒక లావాదేవీగా కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ. 10 వేల వరకు నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. కేవలం రూ.500 నోట్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది సుమా. ఖాతాల్లో జమైన ఈ మొత్తాల్ని ఏటీఎం ద్వారా ఇతర క్రిప్టోకరెన్సీల కొనుగోలుకు వాడుకోవచ్చు.

డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ కోసం ఇలా వినియోగం
జపాన్ వంటి దేశాల్లోనైతే భోజనాలు, సినిమా, విమాన టిక్కెట్ల కొనుగోలుకూ భారతీయులు బిట్‌కాయిన్లను వాడుతున్నారు. ప్రతి రోజూ 10 బిట్ కాయిన్లు మాత్రమే అదీ కూడా భారతీయ రూపాయిల్లోనే మాత్రమే లావాదేవీలకు ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఒక పాస్ వర్డ్ లభిస్తుంది. బ్యాంకు ఖాతా, పాన్ నంబర్, చిరునామా తదితర వివరాలు చేరిస్తే సరి.

12 అంకెల ఓటీపీతో నగదు డిపాజిట్లకు, విత్ డ్రాయల్స్‌కు కూడా బిట్ కాయిన్లను వాడుకోవచ్చు. అయితే మదుపర్లు తమ సొంత రిస్క్‌పై బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టడం వారిష్టం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. బిట్ కాయిన్లు చట్ట విరుద్ధం గానీ, చట్టబద్ధం గానీ కాదన్నారు.

త్వరలో ముంబై, ఢిల్లీలకు రానున్న బిట్ కాయిన్ ఏటీఎంలు
ముంబై, ఢిల్లీల్లోనూ ఈ తరహా ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు యూనోకాయిన్ వ్యవస్థాపక సీఈవో సాత్విక్ విశ్వనాథ్ తెలిపారు. 2013 డిసెంబర్‌లో ఏర్పాటైన యూనోకాయిన్ ఆధ్వర్యంలో రిప్పుల్, లైట్‌కాయిన్ తదితర 30 క్రిప్టోకరెన్సీల లావాదేవీలూ జరుగుతున్నాయి.

దాదాపు ఐదేళ్లలో 18 శాతం వృద్ధిని కనబరిచిన యూనోకాయిన్‌కు 13 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. గతేడాది కేవలం రెండు నెలల్లోనే బిట్‌కాయిన్ విలువ 5 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో బిట్‌కాయిన్ విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇది 6,408 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది.

క్రిప్టో కరెన్సీపై పంజా విసిరిన హ్యాకర్లు  
ఉత్తర కొరియాకు చెందిన లజారస్ హ్యాకింగ్ గ్రూప్.. ఈ ఏడాది ఆరంభం నుంచి 571 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించిందని గ్రూప్-ఐబీ అనే సైబర్‌సెక్యూరిటీ వెండర్ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నది.

ది నెక్స్ వెబ్ తెలిపిన ఈ వివరాల ప్రకారం మాల్వేర్ సాయంతో హ్యాకర్లు క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. లజారస్ హ్యాకింగ్ గ్రూప్.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 14 దాడులకు పాల్పడగా, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు దీని బాధితులుగా ఉన్నామారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios