Asianet News TeluguAsianet News Telugu

రూట్ మార్చిన అమెజాన్ భారత్ సంస్థల్లో వాటాల విక్రయం

దేశీయంగా రోజురోజుకు ఈ- కామర్స్ సంస్థలు పట్టు బిగుస్తుండటంతో కేంద్రం కూడా రకరకాల ఆంక్షలు అమలులోకి తెస్తున్నది. తాజా ఆదేశాలతో కంగు తిన్న అమెజాన్.. భారతదేశ సంస్థల్లో తాను పెట్టిన పెట్టుబడులను విక్రయించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ఎఫ్ డీఐల రాకపై ప్రభావం చూపుతుందని అమెరికా పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

India e-commerce norms: Amazon may have to sell Cloudtail, Appario stakes
Author
New Delhi, First Published Dec 30, 2018, 10:47 AM IST

ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ క్లౌడ్‌టెయిల్, అప్పారియో సంస్థల్లో ఉన్న తన వాటాలను విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఈ రెండు సంస్థలవే టాప్ ప్లేస్‌లో ఉంటున్నాయి. వీటి విక్రయాలు ప్రతి ఏడాది వేల మిలియన్ డాలర్లు దాటుతున్నాయి. ఈ - కామర్స్ సంస్థల విషయంలో ఇటీవల ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం.. తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించరాదంటూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో దేశంలోని ఈ-కామర్స్ సంస్థల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

కేంద్రం తాజా ఆదేశాలతో ఇకపై ఈ సంస్థల ఉత్పత్తులను విక్రయించే అవకాశం లేక పోయింది. కాబట్టి అందులో వాటాలను విక్రయించడం ద్వారా ఆయా సంస్థలను ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని అమెజాన్ ఆలోచన కావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

క్లౌడ్‌టెయిల్ అమెజాన్-‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి చెందిన కేటమరాన్ వెంచర్స్ జాయింట్ వెంచర్ కాగా, అప్పారియో.. అమెజాన్-పత్ని గ్రూప్ జాయింట్ వెంచర్. భారతదేశంలోనే దీర్గ కాలికంగా పెట్టుబడులు పెట్టాలన్న తమ విజన్ కు అనుగుణంగా ముందుకు సాగనున్నట్లు తెలిపింది.

తమ ఉత్పత్తుల విక్రయం ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలో అమెజాన్ ఇప్పటి వరకు రూ.27,290 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిబంధనలను కఠినతరం చేయాలని ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ వాల్ మార్ట్, అమెజాన్ అభ్యర్థించాయి. 

కాగా, ఈ-కామర్స్ సంస్థలపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అమెరికన్ పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ కఠిన నిబంధనలతో దీర్ఘకాలికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆ వర్గాలు వెల్లడించాయి.

దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న రెండు అమెరికా సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఈ కఠిన నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ఈ నూతన నిబంధనలు ఫిబ్రవరి 2019 నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ నెల 26న ఈ-కామర్స్ సంస్థలపై భారత ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి భారత వినియోగదారులకు చెడు చేయనున్నవి అని అమెరికా-ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్(యూఎస్‌ఏఐసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిశ్వాల్ తెలిపారు.

నిబంధనల అమలును జాప్యం చేయడానికి అక్కడి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘీ మాట్లాడుతూ భారత ప్రభుత్వ నిర్ణయం దేశీయ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చదని వ్యాఖ్యానించారు.

చర్చలు జరుపకుండానే ఒక్కరాత్రి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్ల నిధులను భారత మార్కెట్ కోసం వెచ్చించిందని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఇలాంటి చేదువార్త ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. ఉద్యోగ కల్పనకూ గండికొట్టగలదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios