Asianet News TeluguAsianet News Telugu

ఈ రెండేళ్లు చైనాకు గడ్డుకాలమే...దూసుకుపోనున్న భారత్: ఐఎంఎఫ్‌

 2016లో నోట్ల రద్దు.. ఆ పై జీఎస్టీ అమలుతో మందగమనంలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు తీయనున్నది. వచ్చే రెండేళ్లలో జీడీపీ 7.5 నుంచి 7.7 శాతంగా నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కానీ మన పొరుగు దేశం చైనాలో 2018 జీడీపీ 6.6 శాతమేనని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం (ఎన్‌బీఎస్‌) పేర్కొంది. దీనికి చైనా- అమెరికా వాణిజ్య యుద్ద ప్రభావమేనని అంటున్నారు.

IMF hikes India's GDP growth forecast to 7.5%
Author
New Delhi, First Published Jan 22, 2019, 11:00 AM IST

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ రెండేళ్లలో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ.  కానీ ఈ రెండేళ్లలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగానే ఉంటుందని వివరించింది. అయితే అమెరికా- చైనా మధ్య ఇటీవల కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. 

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం భారత్
భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. తగ్గిన ముడి చమురు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్‌ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్‌ వృద్ధి పురోగతికి కారణమని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టి్ గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు. 

ద్రవ్యలోటు ఆందోళనకరమన్న గీతా గోపీనాథ్
ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసంతో ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకర  పరిస్థితులు నెలకొన్నాయని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్‌ తెలిపారు. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటుందని, గతంతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువేనన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగ్గుదలకు మందగమనమే 
పలు దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి కారణమని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్‌ తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీ, తదితర పథకాల అమలు చేయడమే దీనికి కారణమని పేర్కొంది. 

దారుణంగా చైనా ఆర్థిక ప్రగతి: 2018లో జీడీపీ 6.6శాతమే
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న చైనా పరిస్థితి ఈ ఏడాది దారుణంగా మారింది. 2018లో వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. దాదాపు మూడు దశాబ్దాల్లోనే అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. అగ్ర రాజ్యం అమెరికాతో తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతల తాలూకూ ప్రభావం చైనాపై పడిందని భావిస్తున్నారు. దీంతో ఎగుమతులు భారీగా క్షీణించాయి. గత డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. 

అంతకు ముందు సెప్టెంబర్ నెలతో ముగిసిన కాలానికి వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. చైనా జాతీయ గణాంకాల విభాగం (ఎన్‌బీఎస్‌) సోమవారం వెల్లడించిన దాని ప్రకారం, 2018లో వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంది. ఇది 2017లో నమోదైన 6.8 శాతం కంటే తక్కువ. 1990లో నమోదైన 3.9 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే గత 28 ఏళ్లలో ఇదే అత్యల్పం. అధికారిక లక్ష్యమైన 6.5 శాతం కంటే వృద్ధి 0.1 శాతం ఎక్కువగానే నమోదైందని ఎన్‌బీఎస్‌ తెలిపింది. ప్రధానంగా చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలోనే అంతర్జాతీయంగా వృద్ధి రేటు మందగించింది. చైనాపై ఈ ప్రభావం నేరుగా పడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios