Asianet News TeluguAsianet News Telugu

రూపాయి పతనం: ఆర్బీఐపై స్పందించబోను: అరవింద్ పనగరియా

ఉద్యోగాల కల్పనపై దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా వ్యాఖ్యానించారు.

If I say Iam happy with job creation Ill be lying If I say Iam unhappy it has no basis either Arvind Panagariya
Author
New Delhi, First Published Nov 4, 2018, 1:10 PM IST


ఉద్యోగాల కల్పనపై దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా వ్యాఖ్యానించారు. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. అమెరికా డాలర్ పై రూపాయి విలువ 74 వరకు పతనం కావడం ఆందోళనకరమేనని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది దేశం అవతల నెలకొన్న సమస్యలతో జరిగిన పరిణామం అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఆర్బీఐ, కేంద్రం మధ్య జరుగుతున్న సంవాదంపై తాను స్పందించడం సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. ఈ అంశం పరిష్కారం అయ్యే వరకు వేచి చూడాల్సిందేనన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు గట్టిగా ఉన్నాయని తెలిపారు. పలు బలహీనతలు వెంటాడినా ఏమీ కాదన్నారు. పొరుగు దేశం చైనా మూడు దశాబ్దాలుగా పది శాతానికి పైగా జీడీపీ వ్రుద్ధి రేటు సాధిస్తోందని పనగరియా అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉండటం వల్లే అది సాధ్యమైందన్నారు. 

భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, నాలుగేళ్లుగా జీడీపీ సగటున 7.3%గా నమోదు కాగా, నాలుగు త్రైమాసికాల్లో వ్రుద్ధి రేటు పుంజుకుంటున్నదని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8.2శాతంగా నమోదైందని గుర్తు చేశారు. దీంతోపాటు రూపాయి మారకం విలువ పతనంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నదన్నారు. ఎగుమతుల విభాగంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉందన్నారు. వార్షిక ప్రాతిపదికన కరంట్ ఖాతాలోటును పరిగణించాలని అరవింద్ పనగరియా సెలవిచ్చారు. 

 2008 ఆర్థిక మాంద్యం తర్వాత దేశీయంగా రుణాలు మంజూరు చేశామని, తాజాగా మళ్లీ అటువంటి పరిస్థితులు తలెత్తకపోవచ్చునని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ చేయాల్సిందంతా చేస్తుందన్నారు. కానీ అంతర్జాతీయ పరిణామాలను ప్రభావితం చేయడం కష్టమేనన్నారు. 

సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంక్ భారీగా మెరుగు పడిందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. రెండేళ్లలోనే చాలా పురోగతి సాధించగలిగామన్నారు. 2017లో 130వ ర్యాంకు నుంచి 100కు, 2018లో 77వ ర్యాంకుకు చేరిందన్నారు. ఇది అసాధారణమని పేర్కొన్నారు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి భారత్ ర్యాంక్ 142 మాత్రమేనని గుర్తు చేశారు. మున్ముందు 50వ ర్యాంకుకు చేరుకోవడం ఆశా జనకమైన పరిణామమేనని చెప్పారు. 

2016లో పార్లమెంట్ ఆమోదం పొందిన దివాళా చట్టాన్ని అమలు చేసేందుకు ఈ ఏడాదే ఆర్బీఐ నడుం బిగించడంతో సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకు మెరుగు పడిందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. మొండి బాకీల వసూళ్ల విషయమై ఆర్బీఐ ద్రుష్టి సారించిందని చెప్పారు. భారతదేశంలో ఉద్యోగాల కల్పనలో పురోగతి లేదనడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని చెప్పారు. ఉద్యోగాల కల్పన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా 2011లో మాదిరిగా ఇంటింటి సర్వే నిర్వహించాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఉద్యోగాలు కల్పిస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్పినా అబద్ధమే అవుతుందన్నారు. నిరాశతో, అసంత్రుప్తితో ఉన్నానన్న దానికి ప్రాతిపదిక లేనే లేదన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios